బీహార్‌పైనే దృష్టి.. ఇంటెలిజెన్స్ విఫ‌ల‌మైందా?

ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో పలువురు చనిపోయారు.;

Update: 2025-11-11 15:30 GMT

ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో పలువురు చనిపోయారు. ఇంకా అనేకమంది ఆసుపత్రుల్లో ప్రాణాపాయ స్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం చుట్టూ ఈ వ్యవహారం అనేక ప్రశ్నలు మిగులుస్తోంది. బలమైన ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఉందని, చీమ చిటుక్కుమ‌న్నా తమకు తెలిసిపోతుందని చెబుతున్న మోడీ సర్కార్ కు ఢిల్లీ పేలుళ్ల ఘటన మాయని మచ్చ మిగిల్చే పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం మనకు అనేక అంశాల్లో ఉపగ్రహ వ్యవస్థ ఉంది. డ్రోన్ వ్యవస్థ ఉంది. ఇంటిలిజెన్స్ అనేక రంగాల్లో పుంజుకుంది. ఐటీ పరంగా కూడా ఇంటిలిజెన్స్ కు సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల్లో ఖర్చుపెడుతోంది. అటువంటిప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనను ఎందుకు ముందుగా గుర్తించలేకపోయింది అన్నది ఒక సమస్య. అయితే మరోవైపు దేశవ్యాప్తంగా అదే రోజు పలు ప్రాంతాల్లో సాదాలు చేసి అనేకమంది నుంచి బాంబులు అదేవిధంగా పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పలువురుని అరెస్టు కూడా చేశారు.

అటువంటప్పుడు దేశ రాజధాని లో జరిగే అంశాలపై ఇంటెలిజెన్స్ ఎందుకు దృష్టి పెట్టలేకపోయింది అన్నది ప్రతిపక్షాలు నిలదీస్తున్న ప్రశ్న. దీనికి ప్రధాన కారణం.. బీహార్ పైనే దృష్టి పెట్టిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. బీహార్‌లో ప్రస్తుతం రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది, దీనిలో అధికార ఎన్డీఏ.. విపక్ష మహా ఘఠ్‌బంధ‌న్‌ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇంటిలిజెన్స్‌ వర్గాలు ఆ రాష్ట్రం పైనే ఎక్కువగా దృష్టి పెట్టాయి అన్నది విపక్షాలు ఆరోపిస్తున్న మాట.

ఇదే నిజమైతే ప్రభుత్వానికి మరిన్ని విమర్శలు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఎదురు కానుంది. దేశ రాజధాని లోనే జరిగిన పేలుడును, పైగా కీలకమైన పర్యాటక ప్రాంతం. దేశ దేశానికే గర్వకారణమైన ఎర్రకోట ప్రాంతంలో పేలుడు జరిగినప్పటికీ ఇంటిలిజెన్స్ వర్గాలు ఎందుకు గుర్తించలేకపోయాయి అన్నదానికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రాబోయే పార్లమెంటు సమావేశాల్లో కచ్చితంగా ఎదురవుతుందని పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.

Tags:    

Similar News