కొడుకు షాడో ఎమ్మెల్యే...అధికారుల సెల్యూట్
ఒక ఎమ్మెల్యే విధిగా హాజరు కావాల్సిన ప్రోటోకాల్ కార్యక్రమాలలో సైతం కొండారెడ్డి దర్శనం ఇస్తూండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.;
ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే రాచరికానికి పూర్తిగా అనువైనది. ఆ దర్జా దర్పం ఇక్కడ కూడా కొనసాగించవచ్చు. ఒక ఇంట్లో ఎవరైనా ఎంపీ ఎమ్మెల్యే లేదా ఇతర కీలక పదవిని చేపడితే చాలు మొత్తం కుటుంబం అధికారిక హవా చలాయించే రోజులు వచ్చేశాయి. దాదాపుగా అన్ని చోట్లా ఇలాగే జరుగుతోంది. రాయలసీమలో అధికార టీడీపీలో ఇపుడు ఒక ఘనమైన నియోజకవర్గంలో కుమార రత్నం తన తండ్రి సీట్లో షాడో ఎమ్మెల్యేగా చక్రం తిప్పుతూ అధికారులకు చుక్కలు చూపిస్తున వైనం అంతటా బిగ్ డిబేట్ గా మారింది.
ఆయన గెలిచినా కూడా :
కడప జిల్లాలో పొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం చాలా కీలకమైనది, రాజకీయంగానే కాదు ఆర్ధికంగా కూడా ఈ నియోజకవర్గం గురించి చెప్పుకుంటారు. ఇక్కడ అనేక పెద్ద వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. 2024 ఎన్నికల్లో ఇక్కడ నుంచి వరదరాజులు రెడ్డి గెలిచారు. ఆయన ఢక్కామెక్కీలు తిన్న నాయకుడు. అప్పటికి అనేక సార్లు గెలిచారు కూడా. అయితే ఆయన ఈసారి బాగా వృద్ధాప్యంలో గెలిచారు. గెలిచేనాటికి ఆయన వయసు అక్షరాల 86 ఏళ్ళు అని చెబుతున్నారు. ఇక ఆ తరువాత కొంతకాలానికే ఆయన తీవ్రమైన అనారోగ్యానికి గురి అయ్యారు. దాంతో ఆయనను పక్కన పెట్టి సకల వ్యవహారాలు కుమారుడు కొండారెడ్డి చూసుకుంటున్నారు అని అంటున్నారు.
ప్రోటోకాల్ సైతం :
ఒక ఎమ్మెల్యే విధిగా హాజరు కావాల్సిన ప్రోటోకాల్ కార్యక్రమాలలో సైతం కొండారెడ్డి దర్శనం ఇస్తూండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేగా వరదరాజులు రెడ్డి హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నా కుమారుడు ఏ హోదాలో పాల్గొంటారు అన్నది కూడా ఇబ్బంది పెడుతున్న వ్యవహారంగా మారింది. ఎమ్మెల్యేగా ఏ పని చేయాలన్నా కుమారుడే రెడీ అంటున్నారు. ఆయనే బదిలీ వ్యవహారాల నుంచి అన్నింట్లో కాలూ వేలూ పెడుతూ తన అధికారిక ప్రతాపం చూపిస్తున్నారు అని అంటున్నారు. దీంతో విపక్షం మండిపడుతోంది. ఆయనను ఏ హోదాలో రానిస్తున్నారు అని కూడా ప్రశ్నిస్తోంది.
మీటింగ్స్ తో బిజీ :
ఒక ఎమ్మెల్యేగా తండ్రి చేయాల్సిన అధికారిక ప్రారంభోత్సవాలతో పాటు అన్నీ ఆయనే పాలుపంచుకుంటున్నారు అని అంటున్నారు ఇక అభివృద్ధి కార్యక్రమాలలో అయితే ఆయన హాజరవుతున్నారు. మున్సిపల్ మీటింగ్స్ కి వస్తున్నారు అని కాదని చెప్పేంటంత ధైర్యం అధికారులు చేయలేకపోతున్నారు అని అంటున్నారు. దాంతో ఆయన మరింతగా జోరు చూపిస్తున్నారని అంటున్నారు. దీంతో షాడో ఎమ్మెల్యే వ్యవహారం పార్టీని కూడా ఇబ్బంది పెడుతోంది అని అంటున్నారు. ఇది వైసీపీకి కూడా ఒక అంది వచ్చిన అవకాశంగా మారింది అని అంటున్నారు మరి దీని మీద హైకమాండ్ ఏ రకమైన డైరేక్షన్ ఇస్తుందో తెలియదు కానీ షాడో ఎమ్మెల్యేగా ఆయన దూకుడు అయితే వేరే లెవెల్ అని అంటున్నారుట.