బంగారం స్మగ్లింగ్: తెలుగు నటుడికి 62కోట్లు, నటికి 102కోట్లు జరిమానా
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.;
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీగ లాగితే డొంకంతా కదిలింది. ఇందులో తెలుగు నటుడు తరుణ్ రాజ్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. రన్యారావుకు అతడు రైట్ హ్యాండ్ అన్న ప్రచారం సాగింది. సాహిల్ జైన్, భారత్ జైన్ అనే మరో ఇద్దరితో కలిసి సిండికేట్ స్మగ్లింగ్ ప్లాన్ అమలయ్యేదని కూడా డిఆర్ఐ అధికారులు విచారణలో పేర్కొన్నారు.
ఈ కేసులో రన్యారావుకు కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రిబ్యూన్ ఇండియా కథనం ప్రకారం... రన్యారావుకు 102 కోట్ల జరిమానా విధించగా, తెలుగు నటుడు తరుణ్ రాజుకు 62 కోట్ల మేర జరిమానా విధించినట్టు `ట్రిబ్యూన్ ఇండియా` తన కథనంలో పేర్కొంది. సాహిల్ జైన్ - భరత్ జైన్ లకు 53 కోట్ల మేర జరిమానా విధించారు. నలుగురికి విధించిన మొత్తం జరిమానా రూ. 270 కోట్లు. ఒక్కొక్క వ్యక్తి దుబాయ్ నుంచి విదేశాలకు తరలించిన అక్రమ బంగారం విలువ (బరువు) ఆధారంగా ఈ జరిమానాల్ని విధించినట్టు తెలిసింది.
దేశ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) దర్యాప్తు ప్రకారం..రన్యారావు 127.3 కేజీల బంగారాన్ని అక్రమ రవాణా చేయగా, తరుణ్ రాజ్ 67.6 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేసారు. సాహిల్ జైన్ - భరత్ జైన్ 63.61 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలిందని ట్రిబ్యూన్ కథనం పేర్కొంది. నిర్ణీత వ్యవధిలోపు జరిమానా చెల్లించకపోతే రన్యా రావు సహా ఇతర నిందితుల ఆస్తులను జప్తు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
ఈ కేసుకు సంబంధించి మొత్తం 1200 పేజీల తుది పత్రాన్ని అధికారులకు సమర్పించారు. నిందితులకు పెనాల్టీ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అదనపు కేసు COFEPOSA పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది కానీ దానిని సెప్టెంబర్ 11కి వాయిదా వేశారు. జరిమానాలతో పాటు, క్రిమినల్ కేసులు కూడా కొనసాగుతాయని, దొంగిలించిన బంగారాన్ని తిరిగి పొందడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. బంగారం స్మగ్లింగ్ కేసుల్లో రన్యారావుకు ఆమె టీమ్ కు విధించిన జరిమానా ఇటీవలి కాలంలో అతిపెద్ద జరిమానాలలో ఒకటి అని ట్రిబ్యూన్ తన కథనంలో పేర్కొంది. ప్రఖ్యాత ట్రిబ్యూన్ కథనం ఆధారంగా టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా తన కథనంలో వివరాలను అందించింది.