రాఖీ వేళ కవిత కేటీఆర్ ల మీదే ఫోకస్ !
ఇక మరో అన్నా చెల్లెలు విషయానికి వస్తే రాజకీయంగా ప్రముఖంగా కనిపించే వారుగా కవిత కేటీఆర్ కనిపిస్తారు.;
రాఖీ పండుగను దేశమంతా శనివారం జరుపుకుంటున్నారు అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ల మధ్యన అనుబంధానికి ప్రతీకగా రాఖీ వేడుకలను చేసుకుంటారు. ఇక రాజకీయ రాఖీలు కూడా ఈ శుభవేళ సందడి చేస్తూంటాయి. ఎవరు ఎవరికైనా రాఖీలు కట్టవచ్చు. అన్నగా భావించి సోదర బంధాన్ని పెంచుకోవచ్చు. తెలుగునాట చూస్తే ఇద్దరు అన్నలు ఇద్దరు చెల్లెమ్మల మీద అందరి దృష్టి ఉంటోంది. వారు ఎవరు అన్నది తెలిసిందే.
జగన్ షర్మిల మధ్యన :
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెల్లెమ్మ షర్మిలల మధ్య విభేదాలు అందరికీ ఎరుకే అని అంటారు. గడచిన నాలుగేళ్ళుగా షర్మిల జగన్ కి రాఖీ కట్టడం లేదు. అంతే కాదు పుట్టిన రోజున శుభాకాంక్షలు చెప్పడం లేదు. రాజకీయం ఈ ఇద్దరిని అలా విడదీసింది అని అంతా చెప్పుకుంటారు. దాంతో ఈ రాఖీ వేళ కూడా వీరి గురించి చర్చ అయితే ఉంది కానీ రాఖీ కట్టకపోతే ఆశ్చర్యం లేదు అంటారు. కడితేనే అది సంచలనం అని కూడా అంటారు.
కవిత సంగతేంటి :
ఇక మరో అన్నా చెల్లెలు విషయానికి వస్తే రాజకీయంగా ప్రముఖంగా కనిపించే వారుగా కవిత కేటీఆర్ కనిపిస్తారు. ప్రతీ ఏటా తన అన్న కేటీఆర్ కి కవిత రాఖీ కడతారు. అది మీడియాలో కూడా ఫోకస్ అవుతుంది. అయితే ఈసారి ఆ సంప్రదాయం కంటిన్యూ అవుతుందా అన్నదే చర్చగా ఉంది. ఎందుకంటే కల్వకుంట్ల వారి కుటుంబంలో కూడా రాజకీయాలు ప్రవేశించాయి. కవిత చాలా కాలంగా బీఆర్ఎస్ కి దూరంగా ఉంటున్నారు. ఆమె ప్రకటనలు అన్నీ కూడా అన్న మీద ఎక్కుపెడుతున్నారు అని అంటారు.
అందుబాటులో ఉంటారా :
మరో వైపు చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందుబాటులో ఉంటారా అన్నది కూడా చర్చగా ఉంది. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని అంటున్నారు. ఆయన శనివారానికి హైదరాబాద్ వస్తారా వస్తే కనుక ఆయన తన చెల్లెలుకు రాఖీ పండుగ వేళ అందుబాటులో ఉంటారా అన్నది మరో చర్చ. ఇక కవిత కూడా రాఖీ కట్టేందుకు అన్న వద్దకు వెళ్తారా అని కూడా అంతా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ అన్నా చెల్లెలు రాఖీ అంశం రాజకీయ విమర్శలకు కూడా తావిస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే కేటీఆర్ మీద విమర్శల జోరు పెంచేశారు. రాఖీ పండుగ వేళ సొంత చెల్లెలుని ఎదుర్కోలేకనే కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళిపోయారని కూడా ఆయన కామెంట్స్ చేశారు.
అంతటా ఆసక్తికరం :
రాఖీ పండుగ అన్నది అన్నింటికీ అతీతమైనది. కానీ రాజకీయం దేనికీ అతీతం కాదు కదా. అందుకే రాఖీ వేడుకలోనూ అది దూరుతోందని అంటున్నారు. ఏది ఏమైనా కేటీఆర్ అన్న జగన్ అన్న అని లక్షలాది మంది చేత పిలిపించుకునే ఈ నాయకులు రాఖీ పండుగ వేళ ఏ విధంగా వేడుక చేసుకుంటారూ అన్నది ఆసక్తిని పెంచుతోంది అలాగే చెల్లెమ్మలు కూడా రాఖీ వేళ ఏమి చేయబోతారు అన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.