నన్నో టెర్రరిస్టులా చూశారు.. మిథున్ రెడ్డి సంచలన ఆరోపణలు

లిక్కర్ కేసులో బెయిలుపై విడుదలైన రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.;

Update: 2025-10-01 07:05 GMT

లిక్కర్ కేసులో బెయిలుపై విడుదలైన రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 71 రోజుల పాటు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి రెండు రోజుల క్రితం బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. బుధవారం సొంతూరు తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఎంపీ మిథున్ రెడ్డి తాను జైలులో ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు. తననో టెర్రరిస్టులా చూశారని, అధికారులు కూడా తనతో మాట్లాడేందుకు భయపడేవారని మిథున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో తన గదిలో సీసీ కెమెరాలు పెట్టి విజయవాడ నుంచి పర్యవేక్షించేవారని మిథున్ రెడ్డి ఆరోపించారు.

జైలులో తనను ఒక బ్లాకులో నిర్బంధించారని, వేరే ఎవరితో మాట్లాడనీయలేదని ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. కేవలం ములాఖత్ లో మాత్రమే కుటుంబ సభ్యులతో మాట్లాడేవాడనని, సీసీ కెమెరాల నిఘాలో ఉంచారని మిథున్ రెడ్డి చెప్పారు. పక్కవారితో మాట్లాడితే ఏదో ఇబ్బంది వస్తుందన్నట్లు చూశారని ఆరోపించారు. సీసీ కెమెరాలో ఎవరూ చూసేవారని, విజయవాడ నుంచి చూసే అవకాశం ఉందని జైలు అధికారులు తనతో చెప్పారని మిథున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నానని, అయినా ధైర్యంగా ఎదుర్కొన్నానని మిథున్ రెడ్డి వెల్లడించారు.

కాగా, ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా జైలులో సీసీ కెమెరాలు పెట్టి, తాను ఏం చేస్తున్నానో విజయవాడ నుంచి చూసేవారని మిథున్ రెడ్డి ఆరోపించడాన్ని పరిశీలకులు ఎత్తిచూపుతున్నారు. మిథున్ రెడ్డి ఆరోపణలు నిజమేనా? లేక రాజకీయ వ్యూహంతో ప్రభుత్వంపై బురదజల్లే ఆలోచనతోనే ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు విపక్షంలో ఉండగా, అరెస్టు చేసిన ప్రభుత్వం అప్పట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

అప్పట్లో చంద్రబాబు జైలులో ఉండగా, డ్రోన్లు ఎగరేసి చంద్రబాబును ఫొటోలు తీశారని టీడీపీ ఆరోపించింది. అదేవిధంగా ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు అరెస్టు సమయంలో ఆయనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని, సెల్ ఫోన్ వీడియో కాల్ ద్వారా అప్పటి ప్రభుత్వ పెద్దలు లైవ్ లో చూశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో తాజాగా మిథున్ రెడ్డి చేసిన ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయని అంటున్నారు. గతంలో తమ ప్రభుత్వంపై టీడీపీ చేసిన విమర్శలను తిప్పికొట్టేలా మిథున్ రెడ్డి కూడా అవే ఆరోపణలు చేస్తున్నారా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News