చంద్రబాబు ట్వీట్ ఎక్కడికో తీసుకెళ్లింది.. దశ, దిశ మారిపోయింది! మ్యాథ్స్ టీచర్ సక్సెస్ స్టోరీ
సోషల్ మీడియా ఎంత శక్తిమంతమైనదో నిరూపించే కథ ఇది.. సోషల్ మీడియాను మంచిగా వాడితే ఎలాంటి ఫలితాలు వస్తాయనేదానికి ఈ కథనమే ఓ నిదర్శనం.;
సోషల్ మీడియా ఎంత శక్తిమంతమైనదో నిరూపించే కథ ఇది.. సోషల్ మీడియాను మంచిగా వాడితే ఎలాంటి ఫలితాలు వస్తాయనేదానికి ఈ కథనమే ఓ నిదర్శనం. పిల్లలకు అర్థమయ్యేలా లెక్కలు సబ్జెక్టును బోధించేందుకు ఓ టీచర్ వీడియోలు రూపొందించి, యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తే 100 దేశాల్లోని తెలుగు ప్రజలు ఆ చానల్ ను ఫాలో అవుతూ, తమ పిల్లల సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. అంతేకాకుండా యూట్యూబ్ లో ఆ వీడియోలను చూసిన ఎన్ఆర్ఐలు చానల్ నిర్వాహకురాలైన ప్రభుత్వ పాఠశాల టీచర్ శ్రమను గుర్తించి విరాళాల ద్వారా స్కూల్ రూపురేఖలే మార్చేశారు. ఈ సక్సెస్ స్టోరీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఓ ట్వీట్ కీలకంగా మారడం విశేషం. టీచర్స్ డే సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఈ అంశం ఉపాధ్యాయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
రాజమండ్రిలోని లాలా చెరువు మున్సిపల్ హైస్కూల్ ఆ నగరంలో ఉన్నవారికి తెలుసు.. కానీ, అక్కడ పనిచేస్తున్న మంగారాణి టీచర్ ను యావత్ ప్రపంచానికి పరిచయం చేసింది యూట్యూబ్. లాలా చెరువు మున్సిపల్ హైస్కూలులో టీచరుగా పనిచేస్తున్న మంగారాణి.. పిల్లల సందేహాలను నివృత్తి చేయడానికి చిన్నచిన్న వీడియోలు చేసేవారు. వాటి ద్వారా పిల్లలు బాగా చదువుకుంటుండటంతో ఆ వీడియోలను మిగతా ఉపాధ్యాయులతో పంచుకోవాలని యూట్యూబ్ లో అప్ లోడ్ చేసేవారట.. ఇలా యూట్యూబ్ లో 2.38 లక్షల సబ్ స్రైబర్లను సాధించిన మంగారాణి.. 8 కోట్ల వ్యూస్ తో 100దేశాల్లో ఫాలోవర్లు ఉన్నట్లు వెల్లడించారు. అయితే తనకు ఆ స్థాయిలో ఫాలోవర్లు రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ట్వీట్ కారణమని టీచర్స్ డే సందర్భంగా వెల్లడించారు.
డిజిటల్ కంటెంట్ ద్వారా పాఠాలు బోధిస్తున్న మంగారాణిని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేశారు. మొత్తం 175 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయగా, వేదికపై మాట్లాడే అవకాశం మాత్రం కేవలం ఆరుగురికే దక్కింది. వీరిలో మంగారాణి మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. సుమారు 1500 వీడియోలు చేసిన తాను 40,000 మంది సబ్ స్రైబర్లను సాధించడానికి చాలా కష్టపడ్డానని చెప్పారు. అయితే అలాంటి సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన యూట్యూబ్ చానల్ ను అభినందిస్తూ ట్వీట్ చేయడంతో ఒకేసారి సబ్ స్రైబర్ల సంఖ్య 2.38 లక్షలకు చేరిందని చెప్పారు. అంతేకాకుండా చంద్రబాబు ట్వీట్ తో ప్రపంచం మొత్తంమీద తెలుగు ప్రజలు జీవిస్తున్న 100 దేశాల్లో తన చానల్ ఫాలో అవుతూ పిల్లలను చదవిస్తున్నారని, అదే సమయంలో తమ పాఠశాలకు విరాళాలిస్తూ ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.
చంద్రబాబు ట్వీట్ తర్వాత అమెరికా నుంచి ఓ ఎన్ఆర్ఐ వచ్చి తమ పాఠశాలకు ప్రొజెక్టర్ బహూకరించారని, మరో ఎన్ఆర్ఐ లైబ్రెరీ ఏర్పాటు చేశారని వివరించారు. ఇక తమ పాఠశాలలో వినూత్నంగా పాఠాలు బోధిస్తుండటంతో ప్రవేశాలు పెరిగడంతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు నుంచి పిల్లలను చేర్చుకోని ఫోన్లు వస్తున్నాయని వివరించారు. ఇలా ఆ టీచర్ తన సక్సెస్ స్టోరీ చెబుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ కూడా ముగ్ధులై ఆసక్తిగా విన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ డిజిటల్ టెక్నాలజీని వాడుకుంటే ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయో మంగారాణి నిరూపించారని ప్రశంసించారు. ఏదిఏమైనా సోషల్ మీడియా వెర్రితలలు వేస్తున్న రోజుల్లో ఓ టీచర్ సరైన విధంగా వాడుకుని అద్భుత ఫలితం సాధించడం విశేషంగా చెప్పొచ్చని అంతా అభినందిస్తున్నారు.