అణు బాంబు లాంటి ఆధారాలు...ఈసీ వర్సెస్ రాహుల్
అయితే కేంద్ర ఎన్నికల సంఘం విషయంలో ఈ మధ్య కాలంలో లెక్కలేనన్ని అనుమానాలు పెరిగిపోతున్నాయని రాజకీయ పార్టీలు అంటున్నాయి.;
కేంద్ర ఎన్నికల సంఘం, రాజ్యాంగం ప్రకారం స్వతంత్ర వ్యవస్థ. అయితే కేంద్ర ఎన్నికల సంఘం విషయంలో ఈ మధ్య కాలంలో లెక్కలేనన్ని అనుమానాలు పెరిగిపోతున్నాయని రాజకీయ పార్టీలు అంటున్నాయి. సాధారణంగా రాజకీయ పార్టీలు ప్రత్యర్థుల మీద విమర్శలు చేస్తూ ఉంటాయి కానీ ఇపుడు ఈసీని కూడా ముగ్గులోకి లాగుతున్నారు. గత కొంతకాలంగా ఈసీని టార్గెట్ చేస్తుకుంటూ తనదైన శైలిలో ఆరోపణల శరసంధానం చేస్తున్నారు కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.
అన్ని రెడీగా ఉన్నాయట :
తాము గత ఆరు నెలలుగా ఈసీ వ్యవహార శైలి ఎన్నికల్లో అనుసరిస్తున్న విధానాల మీద సొంతంగా దర్యాప్తు చేస్తున్నట్లుగా రాహుల్ గాంధీ చెబుతున్నారు. తన దర్యాప్తులో అణు బాంబుల లాంటి ఆధారాలు లభించాయని ఆయన సంచలన వ్యాఖ్యలే చేశారు. ఈ ఆధారాలు కనుక బయటపెడితే ఈసీకి ఎక్కడ కూడా దాక్కోవడానికే చోటు ఉండడని అంటున్నారు. ఈసీ చేస్తున్నది కచ్చితంగా దేశ ద్రోహం అని ఆయన ఫైర్ అవుతున్నారు.
అణు బాంబు పేల్చేది ఎపుడు :
అణు బాంబు పేలిన రోజున ఈసీకి ఇబ్బందికరం అవుతుందని రాహుల్ గాంధీ అంటున్నారు. అయితే అణు బాంబు ఎపుడు పేలుతుంది అన్నది మాత్రం ఆయన డేటూ టైం అయితే చెప్పలేదు కానీ ఏదో నాడు పేలుతుందని స్పష్టంగా పక్కా క్లారిటీతో చెబుతున్నారు. ఈసీ బీజేపీ కోసం ఓట్ల చోరీకి పాల్పడుతోందని కూడా తీవ్రమైన వ్యాఖ్యలనే రాహుల్ గాంధీ చేశారు. వీటి వివరాలు అన్నీ తమ వద్ద భద్రంగా ఉన్నయని ఆయన చెబుతున్నారు.
పూర్తిగా వ్యతిరేకిస్తున్న రాహుల్ :
బీహార్ లో కొద్ది నెలలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఈసీ చేపట్టింది. అయితే దానిని మొదటి నుంచి రాహుల్ గాంధీ తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నారు. ఇది ఇబ్బందిని కలిగించే ప్రక్రియ అని ఆయన అంటున్నారు. ఇక బీహార్ ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ శుక్రవారం విడుదల చేసింది. దాంతో ఆగ్రహించిన రాహుల్ ఈసీ తీరు మీద నిప్పులు చెరుగుతున్నారు.
రాష్ట్ర స్థాయి నుంచే అక్రమాలు :
ఎన్నికల అక్రమాలు రాష్ట్ర స్థాయి నుంచే జరుగుతున్నాయని రాహుల్ గాంధీ ఎత్తి చూపిస్తున్నారు. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సైతం అనేక అక్రమాలు జరిగాయని ఆయన మీడియా దృష్టికి తెచ్చారు. ఒకరిద్దరు కాదు, కోట్లాదిమందిని కొత్తగా ఓటర్లుగా చేరుస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా దేశ ద్రోహం కిందకే వస్తుందని అన్నారు. దేశ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న ఎవరినీ వదిలిపెట్టబోమని అటు వంటి అధికారులు పదవీ విరమణ చేసినా వారికి చట్ట ప్రకారం శిక్షించి తీరుతామని రాహుల్ గాంధీ స్పష్టం చేస్తున్నారు.
ఈసీ ఖండన :
అయితే రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలను ఈసీ ఖండించింది. ఇవన్నీ బాధ్యతారాహిత్యం తో కూడుకున్న వ్యాఖ్యలని ఈసీ పేర్కొంది. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఈసీ పేర్కొంది అయితే ఈ తరహా వాటిని ఈసీ పట్టించుకోదని స్పష్టం చేసింది. ఈసీ పారదర్శకంగా పనిచేస్తోందని, తాము అదే విధానంలో ముందుకు సాగుతామని అందువల్ల ఎవరు చేసిన వ్యాఖ్యలకూ స్పందించే పరిస్థితి తమకు లేదని అంటోంది.
ఆరోపణలు ఆగేది లేదా :
ఈ దేశంలో ఈసీ ఒక స్వంతంత్ర్య వ్యవస్థ. ఈ వ్యవస్థ మీద జనంలో నమ్మకం ఉంది. అయితే ఈవీఎంల విషయంలో కానీ ఓటర్ల జాబితా విషయలో కానీ విపక్షాలు తరచూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. వాటిని పూర్తి స్థాయిలో నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీ మీద ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఈ దేశానికి ప్రాణం ప్రజాస్వామ్యం. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా భారత్ ఉంది. అందువల్ల ఈ దేశంలో దానిని నిలబెట్టే సౌధంగా ఈసీ ఉంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్ర నేత. ఆయన చేస్తున్న ఆరోపణలు కానీ ఇతర నాయకులు చేస్తున్న వాటిలో కానీ తప్పాకుండా స్పందిస్తేనే కోట్లాది ఓటర్లకు వాస్తవాలు తెలుస్తాయని అంటున్నారు.