ఆలస్యంగా వచ్చిన రాహుల్ గాంధీకి పనిష్మెంట్.. శిక్ష అనుభవించాడిలా..
అదే శిక్షణా శిబిరం సమావేశంలో రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఎన్నికల సంఘం పై సంచలన ఆరోపణలు చేశారు.;
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో వ్యవహరిస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు. మధ్యప్రదేశ్‌లోని పచ్‌మఢీలో జరుగుతున్న కాంగ్రెస్ శిక్షణా శిబిరానికి (సంఘటన్ సృజన్ అభియాన్) ఆలస్యంగా వచ్చినందుకుగాను సరదాగా విధించిన 10 పుష్-అప్‌ల శిక్షను స్వీకరించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ శిక్షణా కార్యక్రమ ఇన్‌చార్జి సచిన్ రావు శిబిరానికి ఆలస్యంగా వచ్చిన వారికి శిక్ష తప్పదని సరదాగా ప్రకటించారు. సరిగ్గా అదే సమయంలో సెషన్‌కు ఆలస్యంగా వచ్చిన రాహుల్ గాంధీ నవ్వుతూ "నేనేం చేయాలి? శిక్ష ఏంటి?" అని ప్రశ్నించారు. దీనికి సచిన్ రావు నవ్వుతూ "కనీసం 10 పుష్-అప్‌లు తీయాలి" అని బదులిచ్చారు.
తెలుపు టీ-షర్ట్, ట్రౌజర్‌లో ఉన్న రాహుల్ గాంధీ ఏమాత్రం సంకోచించకుండా వెంటనే ఆ సూచనను పాటించారు. హుషారుగా 10 పుష్-అప్‌లు తీశారు. దీంతో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చప్పట్లతో ఆయనను అభినందించారు. ఈ సరదా సన్నివేశం అప్పటివరకు సీరియస్‌గా జరిగిన సమావేశంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నింపింది. ఈ సంఘటన శిబిరంలో ఇతర నాయకులను కూడా అనుసరించేలా చేసి, వాతావరణాన్ని మరింత ఉల్లాసపరిచింది.
ఈసీపై రాహుల్ సంచలన ఆరోపణలు
అదే శిక్షణా శిబిరం సమావేశంలో రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఎన్నికల సంఘం పై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని, ఓట్ల చోరీ జరుగుతోందని ఆయన ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లోనూ ఇలాంటి మోసాలే జరిగాయని ఆరోపించారు."హర్యానాలో ఇలాంటి అవకతవకలు బయటపడ్డాయి. అక్కడ ప్రతి 8 ఓట్లకు ఒకటి చొప్పున 25 లక్షల ఓట్లు దొంగిలించారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయి. త్వరలో ఒక్కొక్కటిగా బయటపెడతాం" అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.
కాగా రాహుల్ గాంధీ చేసిన ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం ఇప్పటికే ఖండించింది. ఇవి నిరాధారమైన, అసత్య ప్రచారం అని స్పష్టం చేసింది. అయితే, రాహుల్ గాంధీ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.