రాహుల్ గాంధీ సెక్యూరిటీ ప్రొటోకాల్.. సీఆర్పీఎఫ్ కి ఒకటే టెన్షన్
కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలోని విపక్ష నేత రాహుల్ గాంధీ సెక్యూరిటీపై సీఆర్ఫీఎఫ్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాసింది.;
కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలోని విపక్ష నేత రాహుల్ గాంధీ సెక్యూరిటీపై సీఆర్ఫీఎఫ్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాసింది. జడ్ ప్లస్ కేటగిరీలో ఎస్పీజీ భద్రతలో ఉన్న రాహుల్ గాంధీ “ఎల్లో బుక్” ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవడం లేదని ఆక్షేపించింది. రాహుల్ చర్యల వల్ల ఆయన భద్రత ప్రమాదకరంగా మారిందని సీఆర్పీఎఫ్ రాసిన లేఖలో పేర్కొంది. దేశంలో ఉన్నప్పుడు, విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు కూడా రాహుల్ గాంధీ సెక్యూరిటీ నిబంధనలు పాటించడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు రాహుల్ గాంధీకి రాసిన లేఖలో సీఆర్పీఎఫ్ ఆరోపించింది.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి రాహుల్ భద్రతపై ఇదే విధమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాహుల్ భద్రతను పట్టించుకోవడం లేదని పలుమార్లు కాంగ్రెస్ ఆరోపించగా, ప్రతిసారి రాహుల్ సెక్యూరిటీ నిబంధనలు ఉల్లింఘిస్తున్నారని చెబుతూ సీఆర్పీఎఫ్ ఆ ఆరోపణలు ఖండిస్తోంది. 2020 నుంచి ఈ వివాదం మరింత ముదిరింది. గతంలో ఒకసారి రాహుల్ గాంధీ 113 సార్లు సెక్యూరిటీ నిబంధనలు పాటించలేదని వివరిస్తూ సీఆర్పీఎఫ్ లేఖ రాయడం చర్చనీయాంశమైంది.
గత కొంతకాలంలో ప్రజల్లో విస్త్రుతంగా తిరుగుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెక్యూరిటీ కంచెను దాటుకుని ప్రజలతో మమేకవుతున్నారు. ప్రధానంగా భారత్ జోడో యాత్ర చేసిన నుంచి ఆయన ఎస్పీజీ వలయాన్ని దాటుకుని ప్రజలను కలుసుకుంటున్నారు. ఈ యాత్ర జరిగిన తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో కూడా రాహుల్ నేరుగా ప్రజలతో వన్ టు వన్ మాట్లాడటానికే ప్రాధాన్యమిచ్చారు. అదేవిధంగా ర్యాపిడో రైడర్లతో కలిసి ప్రయాణించడం, లారీ డ్రైవర్ క్యాబిన్ లో కూర్చొని ప్రయాణించడం వంటి చర్యలకు దిగుతున్నారు. దీనివల్ల ఆయనకు భద్రత పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని సీఆర్పీఎఫ్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
మరోవైపు సీఆర్ఫీఎఫ్ కు సమాచారం ఇవ్వకుండా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళుతున్నారని కూడా లేఖలో ఆరోపించింది. ఇటలీ, వియత్నాం, దుబాయ్, ఖతార్, లండన్, మలేషియాల్లో ఆయన పర్యటించిన సమాచారం తమకు తెలియజేయలేదని ఆ లేఖలో సీఆర్ఫీఎఫ్ వెల్లడించింది. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న రాహుల్ గాంధీ ఎక్కువ ముప్పు ఉన్న నేతల్లో ఒకరుగా సీఆర్ఫీఎఫ్ పరిగణిస్తోంది. ఆయనకు వీవీఐపీ హోదాలో అత్యున్నత భద్రత కల్పిస్తున్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలతో సహా దాదాపు 55 మంది సాయుధుల రక్షణ రాహుల్ గాంధీకి ఉంది. కానీ, కాంగ్రెస్ అగ్రనేత ఈ సెక్యూరిటీని ఛేదించుకుని వెళ్లిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే ఈ లేఖపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు స్పందించలేదు.