రాహుల్‌ వ్యాఖ్యలపై శశి థరూర్‌ ఘాటుగా స్పందన

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇటీవల చేసిన 'నరేందర్.. సరెండర్‌' వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.;

Update: 2025-06-05 11:02 GMT

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇటీవల చేసిన 'నరేందర్.. సరెండర్‌' వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఆయన సొంత పార్టీలోని సీనియర్‌ నాయకుడు, ఎంపీ శశి థరూర్‌ స్పష్టతనిచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జోక్యం వల్లే భారత్‌ కాల్పులు విరమించిందన్న రాహుల్‌ ఆరోపణలను శశిథరూర్ పూర్తిగా తోసిపుచ్చారు. భారత్‌కు యుద్ధం ఆపాలనే బోధ అవసరం లేదని, శాంతికి భారత్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు.

- శశి థరూర్‌ వివరణ:

ప్రస్తుతం వాషింగ్టన్ డీసీ పర్యటనలో ఉన్న శశి థరూర్‌ను అక్కడి మీడియా రాహుల్‌ వ్యాఖ్యలపై ప్రశ్నించగా ఆయన వివరంగా స్పందించారు. "భారత్‌ ఎప్పుడూ పాకిస్థాన్‌కు స్పష్టంగా చెప్పింది. మీరు కాల్పులు ఆపితే మేమూ ఆగిపోతాం. మూడో పక్షం జోక్యం అవసరం లేదు. ఆ సమయంలో మేము ఇప్పటికే ఆగేందుకు సిద్ధంగా ఉన్నాం. అదే పాక్‌ తర్వాత చేసింది కూడా" అని థరూర్‌ అన్నారు. భారత్‌ తన సొంత నిర్ణయాల ఆధారంగానే కాల్పుల విరమణకు సిద్ధపడిందని, దీనికి డొనాల్డ్‌ ట్రంప్‌ జోక్యం అవసరం లేదని ఆయన పరోక్షంగా రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు.

- రాహుల్ వ్యాఖ్యల దుమారం:

ఇటీవల భోపాల్‌లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి మూలం. "ఆపరేషన్‌ సిందూర్‌ మొదలైనప్పుడు మోదీకి ట్రంప్‌ ఫోన్‌ చేసి 'నరేందర్, సరెండర్‌' అని అన్నారు. వెంటనే మోదీ కాల్పుల విరమణ ప్రకటించారు" అంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన 1971లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అమెరికా బెదిరింపులను లెక్కచేయకుండా పాక్‌తో యుద్ధం చేసి, విజయం సాధించిన సందర్భాన్ని ప్రస్తావించి, ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని విమర్శించారు.

- బీజేపీ కౌంటర్ అటాక్:

రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా స్పందించారు. "రాహుల్ గాంధీ, మీ చరిత్రే లొంగిపోయే చరిత్ర. షర్మ్ అల్ షేక్, సిమ్లా చర్చలు, దేశ విభజన సమయంలో ముస్లింలీగ్‌కు లొంగడం, సింధూ జలాల ఒప్పందం.. ఇవన్నీ మీ పార్టీ చేసినవే" అంటూ ఆయన ఎక్స్ లో వరుసగా పోస్ట్‌లు చేశారు. "ఇలాంటి వ్యాఖ్యలు దేశ భద్రతను అవమానపరచడమే కాదు, సైనికుల త్యాగాలను తక్కువగా చూపడమే" అని నడ్డా పేర్కొన్నారు. దేశ సైన్యం, దాని త్యాగాలను కించపరిచేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ విమర్శించింది.

రాహుల్‌ వ్యాఖ్యలు, శశి థరూర్‌ ఖండన, ఆపై బీజేపీ ఎదురు దాడి.. ఇవన్నీ ప్రస్తుతం భారత రాజకీయాల్లో వేడి చర్చకు దారితీశాయి. కాంగ్రెస్‌ నేతల మధ్య అభిప్రాయ భేదాలు బహిరంగంగా బయట పడటం, అంతర్గత వ్యూహాల్లో గందరగోళాన్ని సూచిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో సీనియర్‌ నాయకులు, యువ నాయకుల మధ్య ఆలోచనా విధానంలో తేడాలు ఉన్నాయని, ఇది పార్టీ ఐక్యతకు సవాలుగా పరిణమించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశ భద్రత, సైనికుల త్యాగాల వంటి సున్నితమైన అంశాలపై బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ నాయకులకు అవసరమని పలువురు సూచిస్తున్నారు.

Tags:    

Similar News