రబ్బర్ స్టాంప్ ని కాను ...మోడీతో డైరెక్ట్ గా రాహుల్ ఢీ !

కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలో ఒక్కసారిగా ధీమా పెరిగిపోతోంది.

Update: 2026-05-14 03:48 GMT

కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలో ఒక్కసారిగా ధీమా పెరిగిపోతోంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో గత రెండేళ్ళుగా కాంగ్రెస్ అనేక అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కి ఎదురు నిలిచి పోరాడింది. కానీ గెలిచింది మాత్రం లేదు, హర్యానా మహారాష్ట్ర, ఢిల్లీ బీహార్ ఇలా అనేక చోట్ల ఓడిన కాంగ్రెస్ కి ఈ ఏడాది జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికలు మంచి బూస్టింగ్ ఇచ్చాయని అంటున్నారు. నిజానికి అస్సాం లో బీజేపీతో డైరెక్ట్ గా తలపడి కాంగ్రెస్ గతానికి కంటే కూడా సీట్లూ ఓట్లూ కోల్పోయింది.

అస్త్రశస్త్రాలతో రెడీ :

అలాగే పశ్చిమ బెంగాల్ లోనూ పరాభవం ఎదురైంది. కానీ దక్షిణాదిన కేరళం మాత్రం కాంగ్రెస్ కి వెయ్యేనుగుల బలాన్ని ఇచ్చింది. అక్కడ అద్భుతమైన విజయం సాధించింది. అంతే కాదు దానికి బోనస్ అన్నట్లుగా తమిళనాడులో టీవీకే పార్టీ విజయ్ కి అండగా నిలవడం ఎనలేని ఆనందాన్ని కలిగిస్తోంది. దాంతో వచ్చే ఏఅడాది ఆ వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీని బలంగా ఢీ కొట్టేందుకు అవసరమైన అస్త్ర శస్త్రాలను రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ సిద్ధం చేసుకుంటోంది. ఇక మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఏ మాత్రం అవకాశం దొరిగినా రాహుల్ ఎక్కడా తగ్గడం లేదు. బంగారం కొనుగోలు చేయవద్దు విహార యాత్రలు వద్దు వంట నూనె వాడకం తగ్గించండి, పెట్రోల్ డీజిల్ అదుపు పొదుపు చేయండి అని మోడీ ఇచ్చిన సందేశాన్ని సైతం గట్టిగా విమర్శించి రాహుల్ గాంధీ దేశంలోని బలమైన వర్గాలని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఘాటు లేఖతో హీట్ :

ఇపుడు మరో కీలక ఇష్యూలో నేరుగా ప్రధాని మోడీకి ఘాటు లేఖ రాయడం ద్వారా రాజకీయాన్ని మరింత వేడెక్కించారు. సీబీఐకి కొత్త డైరెక్టర్ నియామకం విషయంలో ప్రధాని చైర్మన్ గా ఉన్న కమిటీ లో రాహుల్ గాంధీ మెంబర్. అయితే ఈ నియామకం విషయంలో ప్రతిపక్ష నాయకుడి ఆలోచనలు ఆయన పాత్ర ఏమీ లేకుండా నామమాత్రం చేస్తున్నారు అంటూ రాహుల్ గాంధీ తాజాగా మోడీకి రాసిన లేఖ విమర్శించారు. నేను రబ్బర్ స్టాంప్ ని కాను అని ఆయన స్పష్టం చేశారు. సీబీఐ వంటి అత్యున్నత సంస్థలో డైరెక్టర్ నియామకం విషయం కేవలం ఏకపక్షంగా సాగాలన్న అధికార పక్షం ధోరణి తప్పు అని కూడా దుయ్యబట్టారు.

మొక్కుబడిగా ఉండలేను :

ఈ కమిటీలో నామమాత్రంగా ప్రతిపక్ష నాయకుడికి చోటు ఇచ్చారు కానీ అర్ధవంతమైన పాత్ర అయితే ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. అందువల్ల తాను ఆ విధంగా వ్యవహరించలేనని కూడా రాహుల్ గాంధీ తెగేసి చెప్పారు. ఈ పోస్టుకు అర్హులైన 69 మంది అభ్యర్ధుల సెల్ఫ్ అప్రైజల్ నివేదికలను తనకు ముందుగా ఎందుకు అందించలేదని ఆయన ప్రశ్నించారు. నేరుగా కమిటీ సమావేశంలోనే వాటిని పరిశీలించాలని కోరడం మంచి విధానం కాదని రాహుల్ ఫైర్ అయ్యారు. అర్హులైన అభ్యర్ధుల పనితీరుని అంచనా వేయడానికి ముందుగా తనకు నివేదికలు పంపించడం అవసరం అని ఆయన అన్నారు. తమకు నచ్చిన వారినే సీబీఐ డైరెక్టర్ గా ఎంచుకోవడానికి అయితే ఈ కమిటీ సమావేశం ఎందుకు తనను పిలవడం ఎందుకని రాహుల్ గాంధీ ప్రశ్నించారు

పూర్తిగా పక్షపాత పూరితంగా :

సీబీఐ డైరెక్టర్ నియామకం విషయంలో 2025 లో కూడా కమిటీ సమావేశంలో విధానపరమైన నిర్ణయాలను తాను ప్రశ్నించాను అని ఆయన గుర్తు చేశారు. పూర్తిగా పక్షపాత పూరితంగా కేంద్రం వ్యవహరిస్తోందని అందుకే సీబీఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించి కమిటీ సమావేశానికి తాను హాజరు కావడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి రాహుల్ గాంధీ సీబీఐని ఒక అస్త్రంగా కేంద్రం వాడుకుంటోందని చెప్పడం అంతే కాదు నియామకాల విషయంలోనూ పక్షపాతం ఉందని ఎలుగెత్తి చాటడం ద్వారా గతంలో ఏ ప్రతిపక్ష నాయకుడు చేయని విధంగా ఆరోపణలు విమర్శలు చేశారు. మొత్తానికి చూస్తే రాహుల్ గాంధీ దూకుడు పెంచారని అంటున్నారు.

Tags:    

Similar News