మోడీ ప్రకటన అలా.. రాహుల్ పోస్టు ఇలా.. పరువు పోయిందిగా!
ఇదేనా అభివృద్ధి అంటూ..ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ``అభివృద్ధి అంతా భ్రమే. ఆచిన్నారులు న్యూస్ పేపర్లలో అన్నం తింటున్న దృశ్యం చూశాక.. నా హృదయం ముక్కలైంది.;
`దేశం అభివృద్ధి బాటలో దూసుకుపోతోంది..` అని ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత నియోజకం వారణాసిలో 4 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన సమయంలో శనివారం భారీ ప్రకటన చేశారు. అయితే.. ఆ తర్వాత 30 నిమిషాల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మోడీకి కౌంటర్‌గా తన ఎక్స్ ఖాతాలో కీలక పోస్టు చేశారు. ``ఇదేనా అభివృద్ధి.. దూసుకుపోవడం`` అని ప్రశ్నించారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రధాని సహా.. మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.
ఇంతకీ ఏం జరిగింది?
మధ్యప్రదేశ్‌లోని శ్యోపూర్ జిల్లాలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో శనివారం పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టారు. అయితే.. సహజంగా ఎక్కడైనా పళ్లాల్లో ఈ భోజనం వడ్డిస్తారు. కానీ, ఇక్కడ న్యూస్ పేపర్లపై చిన్నారులకు అన్నం వడ్డించారు. అంతేకా దు.. అత్యంత దారుణమైన పరిస్థితిలో వారు నేలపై కూర్చుని.. పేపర్లను మట్టిపై పెట్టుకుని వాటిలోనే భుజిస్తున్నారు. తింటున్న సమయంలో కొన్ని కాయితాలు చిరిగిపోయి.. మట్టి, దుమ్ము కూడా అన్నంలో కలిసిన దృశ్యాలు కనిపించారు. ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన రాహుల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇదేనా అభివృద్ధి అంటూ..ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ``అభివృద్ధి అంతా భ్రమే. ఆచిన్నారులు న్యూస్ పేపర్లలో అన్నం తింటున్న దృశ్యం చూశాక.. నా హృదయం ముక్కలైంది. ఇంత దారుణమా? వీరంతా భావిభారత పౌరులు కాదా?`` అని రాహుల్ ప్రశ్నించారు. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని అధికార పీఠాలను ఎక్కుతున్న వారు..కనీసం చిన్నారులకు కూడా గౌరవ ప్రదమైన రీతిలో భోజనం పెట్టలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కాగా.. ఈ పోస్టు వెలుగు చూసిన తర్వాత.. బాధ్యులపై చర్యలు తీసుకున్నామని.. సదరు పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశామని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. కాగా.. మధ్యప్రదేశ్ లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉండడం గమనార్హం.