రాహుల్ గాంధీకి పోస్ట్ ను అమిత్ మాలవీయ డిలీట్ చేయడం వెనుక అసలు కారణం ఇదే..
భారత సైన్యాన్ని అవమానించిన కేసులో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీపై ఉత్తరప్రదేశ్ లోని లక్నో కోర్టులో కేసు నమోదైంది.;
భారత సైన్యాన్ని అవమానించిన కేసులో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీపై ఉత్తరప్రదేశ్ లోని లక్నో కోర్టులో కేసు నమోదైంది. అయితే ఈ కేసుకు సంబంధించి కోర్టు బుధవారం (జూలై 16) బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఓ వార్త దుమారం రేపింది. కానీ అది ఫేక్ అని నాలుక కరుచుకున్న నేత దాన్ని తన ట్విటర్ ఖాతా నుంచి డిలీట్ చేశాడు. ఇప్పుడు ఆ వార్త కంటే ఈ వార్తనే వైరల్ గా మారింది.
రాజకీయ పరంగా, సైద్ధాంతికంగా పార్టీల మధ్య విభేదాలు ఉండవచ్చు. కానీ అవి ప్రజా ప్రయోజనం కోసమే ఉపయోగపడాలి. ప్రజలను పక్కదారి పట్టించేలా ఉండద్దు. రాజకీయ పార్టీల నాయకులు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ట్వీట్లు, పోస్టులు ప్రజలను పక్కదారి పట్టించేలా ఉంటున్నాయి. ఆ పార్టీ, ఈ పార్టీ అని బేధం లేకుండా నాయకులు పోస్టులు పెడుతూ అభాసుపాలవుతుంటారు. అయితే అది చిన్నా చితకా.. గల్లీ లీడర్లు పెడితే పెద్దగా పట్టించుకోరు కానీ నేషనల్ లీడర్స్ పెడితే దేశ వ్యాప్తంగా చర్చకు వస్తుంది.
బీజేపీ పార్టీకి చెందిన ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్విటర్ లో ఒక ఫొటో షేర్ చేశాడు. అది దేశ వ్యాప్తంగా వైరల్ గా మారి జనాల దృష్టిని ఆకర్షించింది. రాహుల్ గాంధీకి సంబంధించి పరువు నష్టం కేసులో బెయిల్ మంజూరైన తర్వాత మాలవీయ ఈ పోస్ట్ బయటకు వదిలారు. ‘బెయిల్ మంజూరు చేసిన లక్నో కోర్టు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ అలోక్ వర్మతో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ’అని. అయితే మాలవీయ ఎలాంటి ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా దీన్ని పోస్ట్ చేశారు. పైగా ‘ఆయన న్యాయమూర్తి పదవి నుంచి తప్పుకోవాలని, ఆయన నిరాకరిస్తే ఫిర్యాదు దారులు హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని’ పోస్ట్ లో పేర్కొన్నారు.
కానీ అది తప్పుడు పోస్ట్ అని తెలిసి డిలీట్ చేశారు. సెల్ఫీలో ఉన్న వ్యక్తి న్యాయమూర్తి కాదని, ఆయన న్యాయవాది సయ్యద్ మహమూద్ హసన్ అని తెలిసింది. జిల్లా కోర్టు అధికారిక వెబ్ సైట్ ఫొటోలోని వ్యక్తి న్యాయమూర్తి కాదని ప్రకటించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే, ఫ్యాక్ట్ చెకర్ అభిషేక్ కుమార్ ఆ ఫొటోలో ఉన్నది సయ్యద్ మహమూద్ హసన్ గా అంటూ మాలవీయ పోస్టుకు ట్యాగ్ చేశారు. దీంతో మలవీయ పోస్ట్ ను డిలీట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున దుమారమే లేపారు. 2022లో భారత్ జోడో యాత్ర చేస్తున్న సందర్భంలో ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణకు సంబంధించి కేసుపై రాహుల్ లక్నో కోర్టుకు మంగళవారం (జూలై 15) వచ్చారు. రూ. 20వేల బాండ్లు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో రాహుల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణను న్యాయమూర్తి ఆగస్ట్ 13కు వాయిదా వేశారు.