జగన్ తో వివాదం....రాఘురామ సంచలన వ్యాఖ్యలు
ట్రిపుల్ ఆర్ అని ఆయనకు ముద్దుగా సోషల్ మీడియా పెట్టింది పేరు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కనుమూరి రఘురామ క్రిష్ణం రాజు రాజకీయాల్లో సీనియర్ నేత.;
ట్రిపుల్ ఆర్ అని ఆయనకు ముద్దుగా సోషల్ మీడియా పెట్టింది పేరు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కనుమూరి రఘురామ క్రిష్ణం రాజు రాజకీయాల్లో సీనియర్ నేత. ఉన్నది ఉన్నట్లుగా కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడుతారు. మనసులో ఏదీ దాచుకోరు. ఇక ఆయన స్నేహం ఇస్తే ప్రాణం ఇస్తారు, ఆగ్రహించారో నిప్పులే కురిపిస్తారు. ఇక రాజుల మర్యాదలు అన్నీ ఆయన చేసినట్లుగా ఎవరూ చేయరని అంటారు. ఆయన అందరితో ఎంతో కలుపుగోలుగా ఉంటారు, అయితే ఫైర్ బ్రాండ్ గానే రాజకీయాల్లో ఆయన పేరు గడించారు. అలాంటి రఘురామ క్రిష్ణం రాజు వైసీపీ ఎంపీ కాక ముందు ఒక మాదిరిగా జనాలకు తెలిస్తే వైసీపీ రెబెల్ ఎంపీగా ఏపీ మొత్తానికే కాదు రెండు తెలుగు రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో కూడా అందరికీ తెలిసిపోయారు.
ఒక్కడిగా కత్తి యుధం :
ఆయన జగన్ మీద చేసిన ఒంటరి పోరు ఢిల్లీలో నిత్యం కూర్చుని రచ్చబండ పేరుతో జగన్ మీద చేసిన విమర్శలు సెటైర్లు పంచులు అన్నీ కూడా సోషల్ మీడియాను ఊపేశాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు వార్తలుగా మారాయి. 151 సీట్లతో ఎంతో బలమైన ప్రభుత్వంగా వచ్చిన వైసీపీకి ఏ వైపు నుంచి ఎదురు లేని రోజులలో రఘురామ ఒక్కడే చేసిన కత్తి యుద్ధం ఆనక ఏపీలో జగన్ వ్యతిరేక రాజకీయ వాతావరణాన్ని పెద్ద ఎత్తున సృష్టించింది. ఇదిలా ఉంటే జగన్ తో వైరం కానీ వివాదం కానీ తనకు ఏ మేరకు రాజకీయ లాభాని చేకూర్చాయి అన్న దానితో పాటు డిప్యూటీ స్పీకర్ గా ప్రస్తుతం పొజిషన్ రాజకీయాలు అన్నిటి మీద రఘురామ క్రిష్ణం రాజు ఒక ప్రముఖ టీవీ చానల్ కి చ్చిన ఇంటర్వ్యూలో చాలా పంచుకున్నారు. అవి ఒక్కోసారి ఆసక్తిగా మరి కొన్ని సార్లు సంచలనంగా కూడా ఉన్నాయి.
రాజకీయంగా లాభం లేదు :
జగన్ వంటి బలమైన ముఖ్యమంత్రిగా ఆ రోజులలో ఉన్న వేళ తాను ఢిల్లీ వేదికగా చేసిన పోరాటం ఒంటరిగా సాగింది అన్నారు. తొలి మూడేళ్ల వైసీపీ పాలనలో ఎవరూ ఆయనను ఎదిరించే సాహసం చేయలేకపోయారు అని రఘురామ గుర్తు చేశారు. తాను మాత్రం పోరాడాను అన్నారు. ఇక 2024 ఎన్నికల్లో తనకు ఎంత వరకూ అది కలసి వచ్చింది అంటే పెద్దగా లేదని ఆయన చెప్పారు, పైగా అందరూ తనను చూసి జడుసుకున్నారు అని అన్నారు. ఇదంతా మానవ నైజం అన్నారు. తనకు కోరుకున్న ఎంపీ సీటు దక్కకపోతే ఎన్నికలకు చివరి నిముషంలో ఎమ్మెల్యే సీటు దక్కిందని తాను కూటమి తరఫున 174వ వాడిగా టికెట్ అందుకున్నాను అని చెప్పి మరీ రఘురామ ఆశ్చర్య పరచారు.
ఢిల్లీ మీదనే మోజు :
తనకు ఢిల్లీ రాజకీయాల మీదనే మోజు ఉందని ఎంపీగానే వెళ్ళాలని ఉందని ఆయన మనసులో మాట చెప్పారు. అయితే ఎమ్మెల్యేగా తనకు అవకాశం దక్కింది, డిప్యూటీ స్పీకర్ గా చాన్స్ ఇచ్చారని ఈ పొజిషన్ బాగానే ఉంది కానీ ఎవరికి ఏది దక్కినా అదంతా తాను దేవుడి ఇచ్చింది అంటాను అని కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను అని రఘురామ వేదాంత ధోరణిని ప్రదర్శించారు. అన్నీ మనం అనుకున్నవి జరగవు కదా అని కూడా అనడం విశేషం.
విజయసాయి మిత్రుడే :
తనకు విజయసాయిరెడ్డి మంచి మిత్రుడే అని రఘురామ మరో విషయం చెప్పి షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరి మధ్య వైసీపీలో ఉన్నపుడు భారీ ఎత్తున ట్వీట్ల యుద్ధం సాగింది. అయితే అదంతా గతం అని రఘురామ అన్నారు. పైగా ఆ ట్వీట్లు విజయసాయిరెడ్డి పేరుతో జగన్ దగ్గర ఉండే ఒక మూడడుగుల మనిషి పెట్టేవాడని తనకు తరువాత తెలిసింది అన్నారు. బూతులు కూడా దట్టించి మరీ విజయసాయిరెడ్డి లాంటి వారి ఖాతాల నుంచి పెట్టేవాడని రఘురామ చెప్పారు. ఇక విజయసాయిరెడ్డి కూడా ఒక నిస్సహాయ స్థితిలో తన మీద వైసీపీలో ఉన్నపుడు విమర్శలు చేశారు తప్ప వ్యక్తిగతంగా కాదని అర్ధం చేసుకున్నాను అన్నారు. తాను తాడేపల్లిలో జగన్ భవనం ఉన్న ప్రాంతంలో ఒక యాభై ఇళ్ళ మధ్యలో ఉన్న విజయసాయిరెడ్డి ఇంట్లో ప్రస్తుతం అద్దెకు ఉంటున్నాను అన్నారు. ఆ ఇంటిని తనకు అద్దెకి విజయసాయిరెడ్డి ఇచ్చారని చెప్పారు. ఆ తరువాత ఇద్దరం మంచి మిత్రులుగా ఉన్నామని చెప్పారు.
జగన్ తో కూడా :
ఇక తానూ విజయసాయిరెడ్డి ఇద్దరం అనేక విషయాల మీద చర్చించుకుంటామని అయితే జగన్ ప్రస్తావన అందులో రాదని అన్నారు. జగన్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలని ఆయన ప్రశ్నించారు. జగన్ ఇపుడు ఓటమి చెందిన నాయకుడు అన్నారు. పైగా అసెంబ్లీలో తానే స్వయంగా జగన్ వద్దకు వెళ్ళి పలకరించి వచ్చాను అని కూడా చెప్పారు.
అవమానం జరిగింది :
ఒక ప్రజా ప్రతినిధిగా రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న తనను ఆకివీడులో రామాలయంలోకి వెళ్ళనీయకుండా అడ్డుకోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనలాంటి వారికే ఇలా అవమానం జరిగితే చేతులు ముడుచుకుని కూర్చుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన అన్నారు. రేపటి రోజున సామాన్యులను బెదిరించే స్థితికి వస్తారు అని అన్నారు. అందుకే తాను పోరాడుతున్నాను అన్నారు. మరో వైపు చూస్తే తాను నిజాలే మాట్లాడుతాను అన్నారు. పద్ధతిగానే వెళ్తున్నాను అన్నారు.
జై భీం అంటే అంబేద్కర్ :
జై భీం అంటే అంబేద్కర్ అని ఆయన్ని ఆరాధించేవారు ఆయన సిద్ధాంతాలను అనుసరించాలి కదా అని ప్రశ్నించారు. అంబేద్కర్ బుద్ధ మతాన్ని స్వీకరించారని రఘురామ గుర్తు చేశారు. కానీ వేరే ఇతర మతాలను తాను స్వీకరించను అని ఆయన స్పష్టంగా చెప్పారు అని అన్నారు. దళిత క్రిస్టియన్స్ రిజర్వేషన్ల విషయం కూడా ఉందని అన్నారు. అలాంటి వారు కనుక రిజర్వేషన్లు వదులుకుంటే హిందూ మతంలో ఉన్న అసలైన దళితులకు న్యాయం జరుగుతుంది అని రఘురామ చెప్పడం విశేషం. మొత్తానికి రఘురామ ఇంటర్వ్యూలో చాలా బోల్డ్ గా అనేక విషయాలనే చెప్పుకొచ్చారు.