'సుపరిపాలన' ప్రోగ్రాంకి వెళ్లుంటే వెనక్కి వచ్చేసేవాడిని.. రఘురామ కీలక వ్యాఖ్యలు

ఏడాది పాలన సందర్భంగా ఇటీవల అమరావతిలో కూటమి ప్రభుత్వం 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.;

Update: 2025-06-26 10:58 GMT
సుపరిపాలన ప్రోగ్రాంకి వెళ్లుంటే వెనక్కి  వచ్చేసేవాడిని.. రఘురామ కీలక వ్యాఖ్యలు

ఏడాది పాలన సందర్భంగా ఇటీవల అమరావతిలో కూటమి ప్రభుత్వం 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, ఏపీబీజేపీ చీఫ్ పురందేశ్వరి, మంత్రి లోకేష్.. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు.

ఇదే సమయంలో.. ఈ ప్రతిష్టాత్మకమైన 'సుపరిపాలనలో తొలి అడుగు' సదస్సుకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు! అయితే... ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు అవమానం జరిగిందంటూ ఉండి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... అమరావతిలో ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు అవమానం జరిగిందని ఏపీ శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ సందర్భంగా... ప్రొటోకాల్‌ ఉల్లంఘన ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరిగిందో.. లేదో నాకు తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్‌ కంటే ఎమ్మెల్యే ప్రొటోకాల్‌ పెద్దదని తెలిపారు.

ఈ సందర్భంగా స్పందించిన రఘురామ... 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ, ఎంపీని ఒక టేబుల్ వద్ద కుర్చోబెట్టారని.. మరో టెబుల్ వద్ద కార్పొరేషన్ డైరెక్టర్లతో కలిసి ఎమ్మెల్యేలను కూర్చోబెట్టారని చెప్పిన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు... ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రొటోకాల్‌ నిబంధనలు పాటించలేదని అన్నారు.

ఇదే సమయంలో.. ఈ ప్రభుత్వ కార్యక్రమానికి స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ను కూడా ఆహ్వానించాలని తెలిపారు. ఈ క్రమంలో... ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తానని తెలిపారు. అయితే.. ఇది మొదటి తప్పుగా భావిస్తున్నట్లు చెప్పిన ఆయన... కార్యక్రమానికి వెళ్లి ఉంటే సీటింగ్‌ విధానం చూసి బయటకు వచ్చేసేవాడినని వ్యాఖ్యానించడం గమనార్హం.

ఈ సందర్భంగా.. ఆ కారక్రమంలో తమకు అవమానం జరిగిందని చాలా మంది ఎమ్మెల్యేలు తనతో చెప్పినందుకే మాట్లాడుతున్నానని చెప్పిన రఘురామ... ప్రొటోకాల్‌ ఉల్లంఘన ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరిగిందో.. లేదో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి!

Tags:    

Similar News