కస్టోడియల్ టార్చర్ కేసుకు ఐదేళ్లు.. పట్టువదలని విక్రమార్కుడిని అంటున్న రఘురామ!
గత ప్రభుత్వంలో తీవ్ర సంచలనం సృష్టించిన కేసుల్లో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసు ఒకటి.
గత ప్రభుత్వంలో తీవ్ర సంచలనం సృష్టించిన కేసుల్లో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసు ఒకటి. గురువారంతో ఈ ఘటనకు ఐదేళ్లు పూర్తవుతున్నాయి. 2021 మే 14న రాజద్రోహం కేసులో అప్పటి ఎంపీ, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామరాజును సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రఘురామ పుట్టిన రోజు నాడే ఆయనను హైదరాబాదులో అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. ఆ రోజు రాత్రి సీఐడీ కస్టడిలో రఘురామపై దాడి జరిగిందనే ఆరోపణలపై 2024 జులై 11న కేసు నమోదు చేశారు. దాడి జరిగిన సమయంలో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో రఘురామ ఫిర్యాదు చేయలేదని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం కోసం ఆయన ఫిర్యాదు చేయగా, ప్రభుత్వం దర్యాప్తు నిమిత్తం సిట్ ఏర్పాటు చేసింది.
ఇక ఈ ఘటన జరిగి ఐదేళ్లు అవుతున్నా, కేసు నమోదు చేసి దాదాపు రెండేళ్లు కావస్తున్నా తనకు న్యాయం జరగడం లేదని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆయన తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నట్లు తాజా వ్యాఖ్యలను బట్టి విశ్లేషిస్తున్నారు. తనపై దాడి జరిగి ఐదేళ్లు కావస్తుందని, ఇప్పటికీ న్యాయం జరగలేదని తాజాగా రఘురామ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తాను పట్టువదలని విక్రమార్కుడిలా న్యాయం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నానని రఘురామ వెల్లడించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై రఘురామ గతంలో చేసిన విమర్శలను గుర్తు చేస్తూ పార్టీ నాయకుడు మహాసేన రాజేశ్ చేసిన విమర్శలను ఆయన ప్రస్తావించారు.
మహాసేన రాజేశ్ తనపై పెట్టిన పోస్టులో ‘‘తనకు టికెట్ ఇవ్వలేని చంద్రబాబు పోలవరం ఎలా పూర్తి చేస్తారని’’ తాను గతంలో అన్నట్లు ఉందని ప్రస్తావించిన రఘురామరాజు తనదైన శైలిలో తిప్పికొట్టారు. తనపై దాడి జరిగి ఐదేళ్లు కావస్తోంది. 2027 నాటికి పోలవరం కచ్చితంగా పూర్తవుతుందని సీఎం చెప్పారు. అప్పటికి నా కస్టోడియల్ టార్చర్ కేసును పూర్తి చేస్తారేమోనని ఆశాభావంతో ఉన్నా అంటూ రఘురామ వ్యాఖ్యానించారు. దీంతో తాను గతంలో చేసిన విమర్శలను అనుకూలంగా మార్చుకునేలా రఘురామ ప్రయత్నం చేసినట్లు ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వివాదం ఇలా ఉండగా, రఘురామ కస్టోడియల్ ఎపిసోడ్ కు ఐదేళ్లు ముగిసిందనే సమాచారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రఘురామరాజే ఈ ఉదంతాన్ని గుర్తు చేయడంతో ఐదేళ్ల క్రితం ఏం జరిగింది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. 2021 మే 14న హైదరాబాద్ లో రఘురామను అరెస్టు చేయగా, ఆ రోజు రాత్రి గుంటూరులో సీఐడీ పోలీసుల సమక్షంలో దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. దీనిపై అప్పట్లో సుప్రీంకోర్టులో న్యాయపోరాటం జరగడం, ఆర్మీ ఆస్పత్రిలో రఘురామ చికిత్స పొందడం తీవ్ర సంచలనం రేపింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామరాజు ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఐపీఎస్ అధికారుల ప్రమేయంపై ఆరోపణలు ఉండటంతో విచారణ నిమిత్తం విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలో సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ను విచారించిన సిట్ పోలీసులు, రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్, బిహార్ కేడర్ ఐజీ సునీల్ నాయక్ ను గతంలో పోలీసులు అరెస్టు చేశారు. ఇక బిహార్ లో సునీల్ నాయక్ అరెస్టు సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. ఇలా సిట్ పోలీసులు రఘురామ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నా, ఆయన మాత్రం దర్యాప్తు సక్రమంగా సాగడం లేదని అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో తాను పట్టువదలని విక్రమార్కుడిలా వెంటాడుతూనే ఉంటానని రఘురామ ప్రకటించడంతో భవిష్యత్తులో ఆయన ఎలాంటి అడుగులు వేస్తారనేది ఆసక్తి రేపుతోందని అంటున్నారు.