రఘురామ కేసులో బిగ్ ట్విస్ట్: సీన్ లోకి బోరుగడ్డ అనిల్?

తొలిసారిగా బోరుగడ్డకు కేసుతో సంబంధం ఉందని, విచారణకు రమ్మంటూ సిట్ పోలీసులు నోటీసులు జారీ చేయడం సంచలనం సృష్టిస్తోంది.;

Update: 2026-04-06 16:38 GMT

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో తాజాగా వైసీసీ సానుభూతిపరుడు, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ పేరు తెరపైకి రావడం సంచలన చర్చగా మారింది. ఇప్పటివరకు రఘురామ కేసులో పోలీసు ఉన్నాతాధికారులు, గత ప్రభుత్వ పెద్దలపైనే ఆరోపణలు, అభియోగాలు నమోదయ్యాయి. తొలిసారిగా బోరుగడ్డకు కేసుతో సంబంధం ఉందని, విచారణకు రమ్మంటూ సిట్ పోలీసులు నోటీసులు జారీ చేయడం సంచలనం సృష్టిస్తోంది.

గత రెండు రోజులుగా రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసుపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సిట్ అధిపతి, ఎస్పీ ఏఆర్ దామోదర్ విజయనగరంలోని తన కార్యాలయంలో విచారణకు రమ్మంటూ నిందితులకు నోటీసులు జారీ చేశారు. వీటిని అందుకున్న అప్పటి సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ ఆదివారం విచారణకు హాజరుకాగా, అంతకుముందు రోజే మరో నిందితుడు అప్పటి సీఐడీ ఏఎస్పీ విజయపాల్ విచారణ ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో ఏ1, అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తోపాటు సాక్షిగా పేర్కొంటూ వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కుమార్ కు నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు.

రఘురామ కేసులో బోరుగడ్డ అనిల్ పేరు కొత్తగా తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. రఘురామ కేసుకు బోరుగడ్డకు సంబంధం ఏంటన్న విషయమై లోతుగా వెళితే ఆసక్తికర సమాచారం వెలుగుచూసిందని పోలీసులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామరాజుపై నమోదైన దేశద్రోహం కేసులో సీఐడీ పోలీసులు సాక్షిగా బోరుగడ్డ అనిల్ కుమార్ పేరు చేర్చినట్లు సిట్ అధికారులు గుర్తించారని చెబుతున్నారు. ఇదే అంశంపై నిందితులు సునీల్ నాయక్, విజయపాల్ ను ప్రశ్నించినట్లు చెబుతున్నారు.

ఇక దీనిపై వివరాలు సేకరించేందుకు బోరుగడ్డ అనిల్ కుమార్ కు నోటీసులు ఇచ్చారని, విచారణకు హాజరు అయ్యేందుకు సమయం ఇవ్వాల్సిందిగా బోరుగడ్డ కోరినట్లు ప్రచారం జరుగుతోంది. రఘురామ కేసులో బోరుగడ్డ అనిల్ పేరు బయటపడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో వైసీపీ సానుభూతిపరుడుగా చెప్పుకుని బోరుగడ్డ టీడీపీ, జనసేన ముఖ్యనేతలపై అసభ్యకరమైన భాషలో వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డాడని కూటమి ప్రభుత్వంలో కేసులు నమోదైన విషయం తెలిసిందే.

గత ప్రభుత్వంలో వైసీపీ ముఖ్యనేతల అండదండలతో సోషల్ మీడియాలో వీడియోలతో బోరుగడ్డ చెలరేగిపోయారని కూటమి నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతడిపై రాష్ట్రం నలుమూలలా కేసులు నమోదు కావడంతో అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. దాదాపు నాలుగైదు నెలలు జైలులో ఉండి బెయిలుపై బయటకు వచ్చిన బోరుగడ్డ ప్రస్తుతం సైలెంటుగా ఉంటున్నాడు. బెయిలు వచ్చిన తర్వాత ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బోరుగడ్డ తీరుమారలేదని విమర్శలు వినిపించాయని అంటున్నారు. ఆ తర్వాత ఇటువంటి వివాదాలకు వెళ్లనని చెప్పిన బోరుగడ్డ ప్రస్తుతం తన పనేదో తాను చూసుకుంటున్నాడు. ఇటువంటి సమయంలో రాష్ట్రంలోనే హైవోల్టేజ్ కేసుగా చెబుతున్న రఘురామ రాజు వివాదంలో బోరుగడ్డ పేరు బయటకు రావడం సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయంలో పోలీసులు ఎలా ముందుకు వెళతారనేది తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోందని అంటున్నారు.

Tags:    

Similar News