బాలయ్య-చిరు ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్: ఆర్ నారాయణ మూర్తి చెప్పిన అసలు నిజం
చిరంజీవి స్వయంగా నాకు ఫోన్ చేశారు. అది ఆయన సంస్కారం. అందరం ఆయన ఇంట్లో కలిసి, సమస్యలను చర్చించి, సీఎం వద్దకు వెళ్లాం. పరిశ్రమ పెద్దగా ఆయన మాట్లాడారు.;
ఏపీ రాజకీయాలు–టాలీవుడ్ మధ్య హాట్ టాపిక్‌గా మారిన బాలకృష్ణ-చిరంజీవి వ్యాఖ్యల వివాదంపై సీనియర్ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రస్తావన, దానికి బాలకృష్ణ ఇచ్చిన కౌంటర్ నేపథ్యంలో ఈ ఎపిసోడ్‌పై ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు కొత్త మలుపు తిప్పాయి.
* చిరంజీవి చెప్పింది 100% నిజం: నారాయణమూర్తి
గతంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ విషయంలో చిరంజీవి చెప్పిన మాటలు "100 శాతం నిజం" అని ఆర్ నారాయణమూర్తి స్పష్టం చేశారు. జగన్ హయాంలో జరిగిన ఆ భేటీలో తాను కూడా పాల్గొన్నానని గుర్తుచేశారు. "ఆ రోజు సీఎం జగన్ సినిమా ఇండస్ట్రీ ప్రతినిధులందరికీ గౌరవంగా వ్యవహరించారు. ఎవరినీ అవమానించలేదు. పూర్వ ప్రభుత్వమే చిరంజీవి గారిని నిర్లక్ష్యం చేసిందని ప్రచారం తప్పు" అని ఆయన అన్నారు.
* చిరంజీవి సంస్కారం
"చిరంజీవి స్వయంగా నాకు ఫోన్ చేశారు. అది ఆయన సంస్కారం. అందరం ఆయన ఇంట్లో కలిసి, సమస్యలను చర్చించి, సీఎం వద్దకు వెళ్లాం. పరిశ్రమ పెద్దగా ఆయన మాట్లాడారు. ఆ భేటీ వల్లే అప్పటి సమస్యలు పరిష్కారమయ్యాయి" అని తెలిపారు.
* బాలకృష్ణ వ్యాఖ్యలపై మౌనం
ఇకపోతే, బాలకృష్ణ చేసిన కామెంట్స్‌పై ఆర్ నారాయణమూర్తి స్పందించడానికి నిరాకరించారు. "తాను బాలయ్య గురించి మాట్లాడదల్చుకోలేదు" అని ముక్తాయించారు.
* టికెట్ ధరల పెంపుపై అభ్యంతరం
అయితే, సినిమా టికెట్ ధరల పెంపుపై మాత్రం ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. "సినిమా అనేది సామాన్యుడి వినోదం. టికెట్ ధరలు అధికం చేస్తే సాధారణ ప్రేక్షకుడు ఇబ్బందులు పడతాడు. అందుకే పెంపు అవసరం లేదు" అని అభిప్రాయపడ్డారు.
ఇంకా ఉన్న ఇండస్ట్రీ సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాలని ఆర్ నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. చిరంజీవి వ్యాఖ్యలను బలపరుస్తూ.. జగన్ భేటీ వెనుక జరిగిన వాస్తవాలను బయటపెట్టడంతో.. ఈ వివాదం కొత్త కోణంలోకి అడుగుపెట్టింది.