పుంగనూరు తమ్ముళ్ల అసంతృప్తి.. ఏం జరుగుతోంది ..!
నిజానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలకు పుంగనూరు నియోజకవర్గానికి భిన్నమైన వాతావరణం ఉంది.;
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పుంగనూరు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కూటమి పార్టీలకు ప్రజలు అనుకూలంగా ఓటు వేసినా పుంగనూరు నియోజకవర్గంలో మాత్రం వైసిపి విజయం దక్కించుకుంది. మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో మరోసారి వరుస విజయాలు దక్కించుకున్నారు. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలకు పుంగనూరు నియోజకవర్గానికి భిన్నమైన వాతావరణం ఉంది.
గడిచిన ఎన్నికల్లో రామచంద్రారెడ్డి పేరుతో దాదాపు నలుగురి నుంచి ఐదుగురు వరకు పోటీలు చేశారు. అంటే ఒక రకంగా రామచంద్రారెడ్డిని ఓడించాలన్నది అన్ని పార్టీల ధ్యేయం. అయినప్పటికీ ఆయన విజయం సాధించారంటే ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి బలం కావచ్చు, లేదా ఎన్నికల మేనేజ్మెంట్ పై ఆయనకు ఉన్న పట్టు కావచ్చు. ఏదైనా కూడా పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి మరోసారి విజయం సాధించారు. కానీ ఆయన విజయం ఎలా ఉన్నా.. పెద్దిరెడ్డి వ్యవహారంపై మాత్రం టిడిపి నాయకులు అంతర్గతంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ అధికారంలో ఉండగా పుంగనూరులో టిడిపి జెండా కనిపించడానికి వీల్లేదు అన్నట్టుగా పెద్దిరెడ్డి వ్యవహరించాలని, కనీసం కార్యక్రమాలు చేసుకునేందుకు కూడా అనుమతులు ఇవ్వలేదని, టిడిపి జెండా కనిపిస్తే చాలు జైలుకే అన్నట్టుగా పోలీసులు సైతం తమపై ఉక్కు పాదం మోపారని చెబుతున్నా రు. అటువంటి నియోజకవర్గంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నా.. కూడా ప్రశాంతంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులు అనుచరులు కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నారు అన్నది టిడిపి నాయకులు అంతర్గత సంభాషణలో చేస్తున్న వ్యాఖ్యలు.
ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఉన్నట్టుండి పెద్దిరెడ్డిని అరెస్టు చేయమని గాని పెద్దిరెడ్డిపై లేనిపోని కేసులు పెట్టమని కోరడం కానీ వారి విధానం కాదు. కానీ తమను ఇబ్బంది పెట్టిన పెద్దిరెడ్డి వర్గీయులు ప్రశాంతంగా కార్యక్రమాలు చేసుకుంటుంటే కూటమి ప్రభుత్వం నాయకులు చోద్యం చూస్తున్నారనేది వారి వాదన. నిజానికి పుంగనూరులో ఒకప్పుడు టిడిపి కార్యక్రమాలు గాని టిడిపి జెండా ఎగరడం కానీ లేదనేది వారు మరోసారి గుర్తు చేస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగరాలి అంటే ప్రాణాలు పోయే పరిస్థితిని కూడా ఎదిరించి గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేశామని చెబుతున్నారు.
ఇప్పుడైనా పార్టీ బలోపేతం కావాలంటే పార్టీ పుంజుకోవాలంటే పెద్దిరెడ్డిని సైలెంట్ చేసే కార్యక్రమాలకు తెరతీయాలని వారు సూచిస్తున్నారు. ఇలాగే వదిలేస్తే పుంగనూరులో టిడిపి ఎప్పటికీ బలపడటం అనేది కష్టం అని చెబుతున్నారు. ఇదే విషయంపై తాజాగా ఆదివారం భేటీ అయిన స్థానిక నాయకులు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును విమర్శలు గుర్తించారు. పెద్దిరెడ్డి పై మదనపల్లి ఫైళ్ల కేసుతోపాటు అటవీ భూముల కేసు కూడా ఉందని కానీ అవి ఏవీ పైకి రాకుండా ఎందుకు తొక్కి పెడుతున్నారు అనేది వారు అడుగుతున్న ప్రశ్న. ఏది ఏమైనా ప్రస్తుతం పుంగనూరు నియోజకవర్గంలో టిడిపి నాయకులు కూటమి ప్రభుత్వంపై స్థానికంగా ఉన్న నాయకత్వంపై కూడా ఒకంత అసంతృప్తితోనే ఉన్నారనేది వాస్తవం.