ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి చెక్.. పార్లమెంటరీ కమిటీ కీలక సూచన
మెట్రో నగరాల్లోని ప్రైవేటు ఆసుపత్రులలో రూం అద్దెలను నియంత్రించడంపై పార్లమెంటరీ కమిటీ కీలక సూచనలు చేసింది.
మెట్రో నగరాల్లో భారీగా పెరుగుతున్న వైద్య ఖర్చులకు అడ్డుకట్ట వేసేలా పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సులు చేసింది. సామాన్యుడికి ప్రైవేటు వైద్యం భారంగా మారుతున్న పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సంచలన నివేదికను సమర్పించింది. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల అందుబాటుపై రూపొందించిన 176 పేజీల నివేదికలో దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల ధరల విధానంపై కీలక సూచనలు చేసింది. కార్పొరేట్ ఆస్పత్రులు ఇష్టాసారంగా ధరలు వసూలు చేయకుండా ఆయా నగరాల్లో 3స్టార్ హోటల్ గదుల ధరలను ప్రామాణికంగా తీసుకునే విధంగా పార్లమెంటరీ కమిటీ సూచనలు చేసింది.
మెట్రో నగరాల్లోని ప్రైవేటు ఆసుపత్రులలో రూం అద్దెలను నియంత్రించడంపై పార్లమెంటరీ కమిటీ కీలక సూచనలు చేసింది. ఆసుపత్రిలో సాధారణ గది అద్దె, అదే ప్రాంతంలోని త్రీ-స్టార్ హోటల్ గది సగటు అద్దె కంటే ఎక్కువగా ఉండకూడదని స్పష్టం చేసింది. చికిత్స పొందే రోగులకు రూం అద్దెలు మితిమీరిన భారాన్ని మోపుతున్నట్లు సభ్యులు గుర్తించారు. దీంతో ఆస్పత్రులలో అద్దె గదుల ధరలపై నియంత్రణ ఉండేలా హోటల్ గదుల అద్దెలను బెంచ్‌మార్కుగా తీసుకోవాలని కమిటీ ప్రతిపాదించింది.
వసతులు వేరు.. ధరల నిర్ణయం వేరు
హోటల్ గదులకు, ఆసుపత్రి గదులకు సేవల పరంగా భారీ వ్యత్యాసం ఉంటుందని కమిటీ గుర్తించినట్లు చెబుతున్నారు. హోటల్ కేవలం బస కల్పిస్తే, ఆసుపత్రి గదులు నర్సింగ్ కేర్, ఇన్ఫెక్షన్ కంట్రోల్, అత్యవసర వైద్యసేవల పర్యవేక్షణ వంటి కీలక సేవలతో కూడుకుని ఉంటాయని అంటున్నారు. అయినప్పటికీ, ధరల నియంత్రణకు ఒక ప్రామాణికం అవసరమని కమిటీ భావిస్తోందని అంటున్నారు. గతంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కూడా ఇదే తరహాలో ఆసుపత్రుల ధరలను పరిశీలించినప్పటికీ, వైద్య సేవలను హోటల్ సేవలతో సమానం చేయలేమని పేర్కొనడం గమనార్హం.
పారదర్శకమైన బిల్లింగ్ విధానం
గది అద్దెలతో పాటు, రోగులకు అందించే వైద్య పరీక్షలు, చికిత్సల ధరలలో పూర్తి పారదర్శకత ఉండాలని కమిటీ స్పష్టం చేసింది. ఆపరేషన్ లేదా పెద్ద చికిత్సకు ముందు, మొత్తం చికిత్సకు అయ్యే ఖర్చుపై రోగి కుటుంబానికి స్పష్టమైన అంచనా ఇవ్వాలని అభిప్రాయపడింది. ఇన్సూరెన్స్ ఉన్న రోగులకు ఒకలా, లేని వారికి మరోలా ధరలు నిర్ణయించే 'డిఫరెన్షియల్ ప్రైసింగ్' విధానాన్ని పరిశీలించాలని కోరింది. కాగా, పార్లమెంటరీ కమిటీ నివేదికపై ప్రైవేటు ఆసుపత్రులు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఆసుపత్రులు అందించే మౌలిక సదుపాయాలు, వైద్య సేవలను బట్టి ధరలను నిర్ణయించుకునే స్వేచ్ఛ యాజమాన్యాలకే ఉండాలని వాదిస్తున్నాయి. రోగుల ఆర్థిక స్తోమతకు అనుగుణంగా గదిని ఎంచుకునే ఆప్షన్ ఇప్పటికే అందుబాటులో ఉందని అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి డాక్టర్ అలెగ్జాండర్ థామస్ పేర్కొన్నారు. ప్రభుత్వంతో ఈ అంశంపై చర్చిస్తామని వారు తెలిపారు.
మరోవైపు సుప్రీంకోర్టులో ప్రైవేటు ఆసుపత్రుల ధరల నియంత్రణపై విచారణ జరుగుతున్న తరుణంలో, పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశంలా పనిచేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్ద ప్రైవేటు ఆసుపత్రులు తమ లాభాల్లో కొంత భాగాన్ని పేద రోగులకు ఉచిత వైద్యం కోసం ఖర్చు చేయాలని కమిటీ సూచించడం, వైద్య రంగాన్ని సామాన్యుడికి మరింత దగ్గర చేసే దిశగా వేసిన అడుగుగా భావిస్తున్నారు. ఇక పార్లమెంటరీ కమిటీ సూచనలను ప్రభుత్వం యథాతథంగా ఆమోదిస్తుందా? లేక ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చలకు మొగ్గుచూపుతుందా? అనేది చూడాల్సివుందని అంటున్నారు. పార్లమెంటరీ కమిటీ సూచనలను అమలు చేసేలా అడుగులు వేస్తే దేశంలో వైద్య సేవల రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లుగానే పరిశీలకులు భావిస్తున్నారు.