ఢిల్లీలో అలా చెప్పి.. బెంగళూరులో ఇలా చెప్పుడేంది డీకే?

‘‘మనుషులు రెండు రకాలు. ఒకరు పని చేస్తే.. మరొకరు లాభపడుతుంటారు. మొదటి రకంగా ఉండాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలకు దివంగత ఇందిరా గాంధీ పిలుపు ఇస్తుండేవారు.;

Update: 2025-11-20 08:30 GMT

కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. మారుతున్న సమీకరణాలు డైలీ బేసిస్ లో మారుతుండటం తెలిసిందే. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు తీరి సరిగ్గా రెండున్నరేళ్లు పూర్తి కావొస్తున్న సందర్భంగా.. అధికార బదిలీ జరుగుతుందన్న ప్రచారం జోరందుకుంది. ఇలాంటి వేళ.. సీఎం కుర్చీలో కూర్చునేందుకు తహతహలాడుతున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారుతున్నాయి.

ఢిల్లీ పర్యటనకు ముందు ఆయన కర్ణాటక పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. దాన్ని తోసిపుచ్చిన ఆయన.. అలాంటిదేమీ ఉండదని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు తాను ఆ పదవిలో ఉంటానని.. పార్టీని గెలిపించుకొని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తానని వ్యాఖ్యానించటం తెలిసిందే. ఢిల్లీలో ఈ మాటలు మాట్లాడిన ఆయన.. అధిష్ఠానంతో భేటీ అయ్యాక మాత్రం ఆయన స్వరంలో మార్పు వచ్చింది. తాజాగా బెంగళూరులో ఇందిరా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు రావటం గమనార్హం.

‘‘మనుషులు రెండు రకాలు. ఒకరు పని చేస్తే.. మరొకరు లాభపడుతుంటారు. మొదటి రకంగా ఉండాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలకు దివంగత ఇందిరా గాంధీ పిలుపు ఇస్తుండేవారు. పీసీపీ చీఫ్ గా ఐదున్నరేళ్లు పూర్తి చేసుకున్నా. అలా అని శాశ్వతంగా ఆ పదవిలో కొనసాగలేను. మరొకరికి ఆ ఛాన్సు ఇవ్వాల్సిన అవసరముంది. అలానే కార్యకర్తలకు ఒక నాయకుడిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా’’ అని చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు తన పీసీసీ చీఫ్ పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా చెబుతున్నారు.

మరోవైపు సిద్దూ వ్యాఖ్యలకు కాంగ్రెస్ వర్గీయులు మరో ఆసక్తికర ప్రచారాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. అదేమంటే.. పీసీసీ చీఫ్ గా డీకే పదవీ కావటం వచ్చే మార్చికి ఆరేళ్లు కానుంది. అయితే.. ఈ పదవి మీద సీఎం సిద్దూ అనుచరులు ఎప్పటి నుంచే కోరుతున్నారు. ఈ పదవి రేసులో సతీష్ జర్కీహోళీ.. మంత్రి ఈశ్వర ఖాంద్రే పేర్లు తెర మీదకు వచ్చాయి. దీనిపై ఒక ప్రకటన ఉంటుందని చెబుతున్న వేళలో.. డీకే నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావటం చూస్తే.. కీలక పరిణామం ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News