రూ.100 కోట్ల ఆస్తి భార్యకు రాసివ్వడంపై పోసాని రియాక్షన్!..
తన భార్యపై ఉన్న విపరీతమైన ప్రేమే ఈ నిర్ణయానికి కారణమని పోసాని చెప్పుకొచ్చారు. ఆమె బాగా చదువుకున్న మహిళ అని, నాగపూర్ యూనివర్సిటీలో బిఎస్, బిఎల్, ఎమ్ ఎల్ పూర్తి చేసిందని తెలిపారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు, రైటర్ పోసాని మురళి కృష్ణ ఎప్పుడూ తన స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాటలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ఆస్తులు, కుటుంబం గురించి కొన్ని షాకింగ్ విషయాలను పంచుకున్నారు. తాను కష్టపడి సంపాదించిన వంద కోట్ల రూపాయల ఆస్తిని భార్య పేరిట రాయడం వెనుక ఉన్న అసలు కారణాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం..
నా పేరు మీద అర్ధ రూపాయి కూడా లేదు:
పోసాని మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో తాను కష్టపడి దాదాపు రూ.100 కోట్లకు పైగానే సంపాదించానని ఓపెన్‌గా చెప్పారు. అయితే, ఆ ఆస్తి మొత్తాన్ని తన భార్య పేరిట రాసేశానని, ప్రస్తుతం తన పేరు మీద ఒక్క పైసా కూడా లేదని సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో ల్యాండ్ రేట్లు పెరిగినప్పటికీ, తన ఆస్తి విలువ వంద కోట్ల చిల్లర మాత్రమే ఉంటుందని, వెయ్యి కోట్లు ఏమీ లేదని ఆయన నవ్వుతూ క్లారిటీ ఇచ్చారు.
భార్యపై అంత నమ్మకం ఎందుకంటే?:
తన భార్యపై ఉన్న విపరీతమైన ప్రేమే ఈ నిర్ణయానికి కారణమని పోసాని చెప్పుకొచ్చారు. ఆమె బాగా చదువుకున్న మహిళ అని, నాగపూర్ యూనివర్సిటీలో బిఎస్, బిఎల్, ఎమ్ ఎల్ పూర్తి చేసిందని తెలిపారు. ఇక ఎమ్ ఎల్ చదువుకునే రోజుల్లోనే పెద్దలు పెళ్లి చేశారని, ఆ తర్వాత పిల్లలు, కుటుంబం కోసం ఆమె తన కెరీర్‌ను కూడా వదులుకుందని గుర్తుచేసుకున్నారు. ఇక ఇల్లును, పిల్లలను చాలా పద్ధతిగా చూసుకునే బాధ్యత గల వ్యక్తి కాబట్టే తన ఆస్తి అంతా ఆమె చేతుల్లో పెట్టానని అన్నారు.
టైంపాస్ కోసమే సినిమాలు:
వంద కోట్లు ఉన్నాయి కదా.. ఇక ఇంట్లో కూర్చోవచ్చు కదా అని అడగ్గా, పోసాని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. "డబ్బులు ఉన్నాయని ఖాళీగా తింటూ కూర్చుంటే టైంపాస్ కాదు. నాకు పని చేయడం ఇష్టం. సాయంత్రానికి ఎంతో కొంత చేతికి వస్తే ఆ కిక్కే వేరు. డబ్బుల కన్నా నాకు టైంపాస్ అవ్వడం ముఖ్యం" అని చెప్పారు. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్లే ఇంకా కష్టపడుతున్నప్పుడు, ఇక తాను అందులో కనీసం 10 శాతం అయినా వర్క్ చేయాలనే కసి ఉందని అన్నారు.
లక్ష కోట్ల కంటే నా ఫ్యామిలీనే ముఖ్యం:
తన 33 ఏళ్ల వైవాహిక జీవితంలో కుటుంబం వల్ల తనకు ఎప్పుడూ ఎలాంటి బాధ కలగలేదని పోసాని ఎమోషనల్ అయ్యారు. తన భార్య, ఇద్దరు కొడుకులు తనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారని చెప్పారు. "నాకు ఇంత మంచి ఫ్యామిలీ దొరకడం నా అదృష్టం. నా భార్యాపిల్లల ప్రేమ ముందు లక్ష కోట్ల ఆస్తి వచ్చినా సరే సరితూగదు. ఇక ఆస్తుల కంటే నా కుటుంబమే నాకు అత్యంత విలువైనది" అంటూ తన ఫ్యామిలీ బాండింగ్‌ను చాటిచెప్పారు.
డబ్బు కంటే బంధాలకే ఎక్కువ విలువ ఇస్తానని పోసాని మురళి కృష్ణ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. సంపాదన మొత్తం భార్యకు ఇచ్చేసి, రూపాయి లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నానని ఆయన చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక నేటి కాలంలో ఆస్తుల కోసం గొడవలు పడే సమాజంలో, ఫ్యామిలీనే నా ప్రపంచం అని చాటిచెప్పిన పోసాని నిజంగా గ్రేట్ అని నెటిజన్స్ కామెట్స్ చేస్తున్నారు.