ఆమె మొరుసుపల్లి....ఈమె దేవనపల్లి !

ఇక వైఎస్ షర్మిలగానే ఆమె 2021 దాకా ఉన్నారు.. ఇంకా చెప్పాలీ అంటే 2024 జనవరిలో పీసీసీ చీఫ్ గా ఏపీకి వచ్చేంతవరకూ కూడా వైఎస్ షర్మిలగానే ఆమె పేరుని ఉంచారు.;

Update: 2025-09-04 18:14 GMT

అవును. అదే నిజం. రాజకీయాల్లో తేడా వస్తేనే నిజాలు అలా గటగటా బయటకు వస్తాయి అంతా బాగుంటే ఏమీ కాదు. కుదరకపోతే వ్యవహారం ముదిరిపోతుంది. అక్కడ నుంచి ఎక్కడి దాకా వెళ్లాలో కూడా వెళ్తుంది. సెంటిమెంట్ ని వాడుకోవడమే కాదు దానికి ఎలా కిల్ చేయడమో కూడా పాలిటిక్స్ కి తెలియనంతా ఎవరికీ తెలియదు. అందుకే ఆమె మొరుసుపల్లి అని గుర్తుకు వచ్చారు. ఈమె దేవనపల్లి అని కూడా ఇపుడు తలచుకుంటున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరూ అంటే ఘనమైన తెలుగు రాజకీయ కుటుంబాలకు చెందిన షర్మిల కవిత.

ఇంటి పేరు అవుట్ :

సాధారణంగా మహిళలు అందరికీ ఇంటి పేరు సాధారణంగా పెళ్ళి తరువాత పోతుంది. భర్త ఇంటి పేరే వారికి కొత్తగా యాడ్ అవుతుంది. అయితే రాజకీయాల్లో మాత్రం సెంటిమెంట్ ఎక్కువ కదా. అందుకే ఎప్పటికి ఏది అవసరమో దానిని వాడుకుంటారు. అలా వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల అయ్యారు. అలాగే దేవనపల్లి కవిత కాస్తా నిన్నటిదాకా కల్వకుంట్ల కవితగానే ఉన్న్నారు. మరి తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పెట్టిన బీఆర్ఎస్ తో ఆమెకు ఇపుడు రాజకీయ విభేధం వచ్చింది. అందుకే ఆమె కల్వకుంట్ల కవిత కాదు దేవనపల్లి కవిత అని సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ క్యాడర్ అంతా ఒకటికి పదిసార్లు గట్టిగానే చెబుతోంది.

షర్మిల విషయంలోనూ :

ఇక వైఎస్ షర్మిలగానే ఆమె 2021 దాకా ఉన్నారు.. ఇంకా చెప్పాలీ అంటే 2024 జనవరిలో పీసీసీ చీఫ్ గా ఏపీకి వచ్చేంతవరకూ కూడా వైఎస్ షర్మిలగానే ఆమె పేరుని ఉంచారు. కానీ ఏపీలో అనాడు అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ని విమర్శించడంతోనే షర్మిల ఇంటి పేరు ఒక్కసారిగా వైసీపీ నేతలకు గుర్తుకు వచ్చింది. వెతికి పట్టుకుని మరీ మొరుసుపల్లి షర్మిల ఆమె అనడం మొదలెట్టారు. ఆమెకు భర్త ఇంటిపేరే వర్తిస్తుంది కానీ తండ్రి ఇంటి పేరు ఎలా వాడుకుంటారు అన్నదే వైసీపీ క్యాడర్ లాజిక్ పాయింట్ ఇక్కడ. అచ్చం అలాగే ఇపుడు కవిత వైషయంలోనూ బీఆర్ఎస్ క్యాడర్ చేస్తున్నారు అని అంటున్నారు.

రాజకీయం అంతా అక్కడే :

బీఆర్ఎస్ నుంచి వేరు పడిన కవిత రేపటి రోజున కొత్త పార్టీ పెట్టి తమకు ఇబ్బంది అవుతారు అన్న ముందు చూపుతోనే ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు. అంటే కేసీఆర్ పేరుని ఆమె రాజకీయంగా వాడుకోకుండా ముందర కాళ్ళకు బంధం అన్న మాట. కల్వకుంట్ల కవిత అన్నదే దాదాపుగా పాతికేళ్ళ ఆమె రాజకీయ జీవితంలో ఉంటూ వచ్చిన పేరు. ఆమె ఆ విధంగానే పాపులర్ అయ్యారు. ఆ విధంగానే ఆమె ఎంపీ ఎమ్మెల్సీ కూడా అయ్యారు. మరి ఆనాడు లేని అభ్యంతరాలు ఇపుడు ఎందుకు వస్తున్నాయి అంటే కనుక ఆమె ఎదురు నిలిచారు అని అంటున్నారు. రాజకీయ ప్రత్యర్ధి అవతారం ఎత్తారు కాబట్టి కేసీఆర్ ని ఆమె తన రాజకీయం కోసం ట్యాగ్ చేసుకోకుండా ఓన్ చేసుకోకుండా ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు.

చిత్రమేంటంటే :

తెలుగు నాట ఇద్దరు చెల్లేళ్ళ కధ కూడా ఈ విధంగా చూస్తే రాజకీయంగా సమాంతరంగానే వెళ్తోంది అని చెప్పాల్సి ఉంటుంది. చిత్రమేంటి అంటే షర్మిల భర్త పేరు అనిల్ కుమార్ అయితే కవిత భర్త పేరు కూడా అనిల్ కుమారే. అంతే కాదు ఇద్దరికీ రాజకీయంగా తండ్రుల నుంచి ఎంతో కొంత గుర్తింపు ఉంది. అందుకే పుట్టింటి ఇంటి పేరు వాడుకోవద్దు అని అటు వైసీపీ అయినా ఇటు బీఆర్ఎస్ అయినా అంటున్నారు. కానీ పేగు బంధాన్ని ఎవరూ విడదీయలేరు కదా అన్నది అన్నీ తెలిసిన వారి మాట.

రాజకీయాల్లో వారసత్వం అంటే కుమారులదేనా అన్న చర్చ కూడా ఈ సందర్భంగా మహిళా పక్షపాతులు లేవనెత్తినా అది సమంజసంగానే ఉంటుంది. ఎందుకంటే వారసత్వానికి ప్రతిభ ముఖ్యం కానీ లింగ వివక్ష ఉండరాదు అని అంటారు. ఆ విధంగా చూస్తే అటు వైఎస్సార్ రాజకీయ వారసత్వం అయినా ఇటు కేసీఆర్ ది అయినా కుమారుడు కుమార్తెలను పోటీ పడేలా చేయడమే ఆరోగ్యకరమైన వాతావరణంగా కనిపిస్తుంది. జనాలు ఎవరిని మెచ్చి మెడలో వరమాల వేస్తారో వారు క్లెయిం చేసుకోవచ్చు. కానీ ఈ తరహా బురద రాజకీయాలకు తెర తీయడం ఎవరు చేసినా అది వర్తమాన నాగరిక సమాజంలో బాగేదేమో అన్నదే అంతా అంటున్న మాట.

Tags:    

Similar News