మన్మోహన్‌ను మించిన మోడీ: నెటిజన్ల కామెంట్
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై నెటిజన్లు కామెంట్లు కుమ్మరిస్తున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై నెటిజన్లు కామెంట్లు కుమ్మరిస్తున్నారు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందించే ఆయన.. సోషల్ మీడియా మాధ్యమాలైన ఎక్స్, యూట్యూబ్ సహా.. ఇన్ స్టాలోనూ రికార్డులు సృష్టించారు. అత్యధిక మంది ఫాలో వర్లు ఉన్న నాయకుడిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. అయితే.. సందర్భం ఏదైనా వెంటనే స్పందించే మోడీ.. అనేక సమయాల్లో ప్రజలకు సూచనలు, సలహాలు కూడా ఇస్తారు. ఇది చేయొద్దు.. అలా చేయండి.. అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తారు.
కానీ.. కీలకమైన విషయాలకు వచ్చే సరికి మాత్రం ఆయన మౌనంగా ఉండిపోతారన్న వాదన బలంగా వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. తాజాగా రెండు ఘటనలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. వీటిపై ప్రధానిగా మోడీ పన్నెత్తు మాట కూడా అనకపోవడం.. సోషల్ మీడియాలో కూడా స్పందించకపోవడం.. అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ఆయన ఉద్దేశ పూర్వకంగానే మౌనంగా ఉంటున్నారని.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం విమర్శించారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు దంచికొట్టే మోడీ.. వారికి ఇబ్బందులు ఎదురైనప్పుడు మౌనంగా ఉండిపోతారని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయాల్లో
1) నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటన: దీంతో 22 లక్షల మందికిపైగా విద్యార్థులు ప్రభావితం అయ్యారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ పేపర్ లీక్ అయిందని వాదన ఉన్నా.. ప్రధాన మూలాలు గుజరాత్‌లోనే కనిపించాయని అదికారులు చెబుతున్నారు. ఈప్రభావంతో ఇద్దరు విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి కీలక సమయంలో ప్రధాని మోడీ ఈ వ్యవహారంపై స్పందిస్తారని అందరూ భావించారు. కానీ, ఆయన మౌనంగా ఉండిపోయారు. ఇక,
2) ఓ కేంద్ర సహాయ మంత్రి కుమారుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. నిజానికి 11 సంవత్సరాల మోడీ పాలనలో కేంద్ర మంత్రులపై అవినీతి ఆరోపణలు రాలేదు.
ఇక, వారి కుటుంబ సభ్యులపై పోక్సో వంటి కేసులు కూడా నమోదు కాలేదు. కానీ, తొలిసారి ఇలా జరిగింది. దీనిపై దేశవ్యా ప్తంగా చర్చ జరుగుతున్నా.. ఢిల్లీలో జాతీయ మీడియా ఈ విషయాన్ని హైలెట్ చేస్తున్నా.. మోడీ మాత్రం మౌనంగా ఉండిపో యారు. ఈ వ్యవహారాలపైనే నెటిజన్లు.. మన్మోహన్‌ను మించిన మోడీ అంటూ.. మాజీ ప్రధాని మౌన మునిగా పేరు తెచ్చుకున్న మన్మోహన్‌తో మోడీని పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. చిత్రం ఏంటంటే.. మూడు సంవత్సరాల కిందట.. ఒడిసాలో జరిగిన రైలు ప్రమాదంలో 300 మంది పైచిలుకు ప్రయాణికులు మృతి చెందారు. అప్పుడు కూడా మోడీ మౌనంగానే ఉండిపోయారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లినా.. చర్యలపై ఆయన పన్నెత్తు మాట కూడా మాట్లాడలేదు.