పిఠాపురం వర్మ సైలెంట్ అవాల్సిందే....అది అంతే !
అంతే కాదు సూపర్ సిక్స్ పధకాలకు సంబంధించి ఆ మధ్యన టీడీపీ నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి కూడా వర్మకు బదులుగా మంత్రి నారాయణనే వెళ్ళమని పార్టీ అధినాయకత్వం సూచించింది అని అంటున్నారు.;
పిఠాపురం వర్మ పార్టీ ప్రకటనలు గత కొన్నాళ్ళుగా పెద్దగా కనిపించడం లేదు, వినిపించడం లేదు, ఎందువల్ల అంటే మ్యాటర్ చాలానే ఉందిట. తాజాగా దానికి సంబంధించిన విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాకినాడ జిల్లా ఇంచార్జి మంత్రిగా ఉన్న నారాయణ ఈ మధ్యనే టీడీపీ కార్యకర్తలతో మాట్లాడిన ఒక టెలి కాన్ఫరెన్స్ ఆడియో బైట్ వైరల్ అవుతోంది. అందులో ఉన్న దాని ప్రకారం చూస్తే వర్మ సైలెంట్ అవాల్సిందే అన్నది అధినాయకత్వం నుంచి వచ్చిన సూచనలుగానే చెబుతున్నారు.
ఆయన జీరోనే అంటూ :
పిఠాపురం వర్మని సైడ్ చేశారని ఆయనే చెబుతున్నారంటూ కూడా ప్రచారంలో ఉన్న విషయం. కొద్ది నెలల క్రితం టీడీపీ అధినాయకత్వం వర్మను పిలిపించి ఏ రకమైన స్టేట్మెంట్స్ ఇవ్వవద్దని పార్టీ పెద్దలు అయితే చెప్పినట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. ఇది కూటమి ప్రభుత్వం అని ఎన్డీయే భాగస్వాములతో కూడిన సర్కార్ అని అందువల్ల ప్రకటనలు ఇస్తే కనుక వేరుగా సంకేతాలు వెళ్తాయని పార్టీ పెద్దలు చెప్పారని అంటున్నారు.
జనసేన పిలిస్తేనే :
అంతే కాదు జనసేన నేతలు ఏదైనా కార్యక్రమం కోసం పిలిస్తేనే వర్మ వెళ్ళాలి తప్పించి ఆయనకు ఆయనగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా స్ట్రిక్ట్ గానే ఆదేశాలు వెళ్ళినట్లుగా కూడా చెబుతున్నారు. వర్మ దూకుడుగా రాజకీయాలు చేస్తారని అందుకే ఆయన విషయంలో ఈ విధంగా హైకమాండ్ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. వర్మ గట్టిగా ఏదైనా మాట్లాడితే అది కూటమి సర్కార్ కి ఇబ్బందిగా మారుతుందని కూడా ఆలోచించిన మీదటనే ఈ విధంగా డైరెక్షన్ ఇచ్చారని అటున్నారు.
సూపర్ సిక్స్ ప్రచారంలో :
అంతే కాదు సూపర్ సిక్స్ పధకాలకు సంబంధించి ఆ మధ్యన టీడీపీ నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి కూడా వర్మకు బదులుగా మంత్రి నారాయణనే వెళ్ళమని పార్టీ అధినాయకత్వం సూచించింది అని అంటున్నారు. ఈ విధంగా వర్మను పూర్తిగా టీడీపీలో సైలెంట్ గా సైడ్ చేసారని అంటున్నారు. అయితే వర్మ ఈ విషయంలో ఎక్కడా బయటపడకపోయినా జనసేన నేతలు మాత్రం ఇదే విషయం మీద ప్రచారం చేస్తున్నారు.
పవన్ తో వర్మ :
ఈ మధ్యనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో వర్మ కలసి ఉప్పాడ బహిరంగ సభలో కనిపించారు. ఆ సభలో కూడా ఆయన మౌనంగానే చూస్తూ ఉన్నారు. మరో విషయం ఏమిటి అంటే వర్మకు ఇప్పటిదాకా ఏ రకమైన నామినేటెడ్ పదవి కూడా దక్కలేదు, చూడబోతే ఆయనకు ఫ్యూచర్ లో కూడా ఏదీ దక్కే చాన్స్ లేదని అంటున్నారు.
గతంలో అలా :
వర్మ విషయం తీసుకుంటే 2014లో పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేసి గెలిచారు. 2019లో పార్టీ టికెట్ ఇచ్చినా ఓటమి పాలు అయ్యారు. 2024లో ఆయనకు టికెట్ దక్కలేదు, జనసేనకు అక్కడ నుంచి పోటీ చేసేందుకు పొత్తులలో భాగంగా అవకాశం దక్కింది. దాంతో నేరుగా అధినాయకుడు పవనే పోటీ చేశారు. మొత్తం మీద చూస్తే వర్మ విషయంలో టీడీపీ పెద్దల ఆలోచన ఈ విధంగా ఉందని ఆయన దాదాపుగా సైలెంట్ అయిపోయారని ప్రచారం అయితే సాగుతోంది. మరి దీని మీద వర్మ వర్గం వైపు నుంచి ఏ రకమైన స్పందన అయితే లేదు, మొత్తానికి పిఠాపురం వర్మ ఇపుడు కూటమిలో ప్రభావం చూపలేని నేతగా మారారా అన్నదే చర్చ.