జీరో కామెంట్స్ మీద నారాయణ ట్విస్ట్

కట్ చేస్తే తాజాగా విశాఖలో పర్యటిస్తున్న మంత్రి నారాయణను పిఠాపురం వర్మ కలవడం రాజకీయంగా కొంత కలకలం రేపింది.;

Update: 2025-10-17 18:03 GMT

పిఠాపురం అంటేనే రాజకీయంగా మంటెక్కేలా టీడీపీ జనసేనల మధ్య ఏదో సాగుతోంది. అది లోకల్ గా ఉండే వ్యవహారమే. ఆ మాటకు వస్తే ఏపీలో చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆ పరిస్థితి ఉంది. కానీ ఒక్క పిఠాపురమే హైలెట్ కావడానికి కారణం అది జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం కావడం. తాజాగా పిఠాపురం పాలిటిక్స్ మీద మంత్రి నారాయణ టెలి కాన్ఫరెన్స్ లో పిఠాపురం వర్మ ఇక మీదట జీరో అంటూ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

జనసేనకు అస్త్రంగా :

అసలే అగ్గి మీద గుగ్గిలం అన్నట్లుగా ఉన్న పిఠాపురం రాజకీయంలో వర్మ జీరో అని నారాయణ అన్నట్లుగా వచ్చిన ఆ ఆడియో బైట్ జనసేనకు అస్త్రంగా మారింది. మాతో పెట్టుకుంటే అట్టాగే ఉంటుంది అని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ వచ్చారు. గురువారం అంతా ఇదే రాజకీయం సాగింది. దీని మీద పిఠాపురం వర్మ కూడా రియాక్ట్ అయ్యారు. తాను టీడీపీకి క్రమశిక్షణ కల్గీన నాయకుడిని చంద్రబాబుకు నమ్మకమైన నేతను అన్నారు. పార్టీ కోసం తాను ఎంతటి త్యాగం అయిన చేస్తాను అంటూ ప్రకటించారు.

విశాఖలో ఆ ఇద్దరూ :

కట్ చేస్తే తాజాగా విశాఖలో పర్యటిస్తున్న మంత్రి నారాయణను పిఠాపురం వర్మ కలవడం రాజకీయంగా కొంత కలకలం రేపింది. ఇదే సందర్భంలో మీడియా కూడా వైరల్ అయిన మంత్రి గారి ఆడియో బైట్ గురించి ప్రశ్నించారు. దానికి మంత్రి నారాయణ రెస్పాండ్ అవుతూ తాను వర్మను జీరో అనలేదని పిఠాపురంలో వివాదాలు జీరో అని మాత్రమే అన్నాను అని బిగ్ ట్విస్ట్ ఇచ్చేశారు. పిఠాపురంలో ఇక నుంచి ఏ రకమైన వివాదాలు ఉండవని తాను చెబితే దానిని మీడియా వక్రీకరించి ప్రచారం చేసింది అని మంత్రి అన్నారు. నిజానికి చూస్తే ఆ ఆడియో బైట్ లో వర్మ ఇక జీరో అని ఆయన మాట్లాడానికి ఏమీ లేదని పార్టీకి చెప్పకుండా ఆయన ఏ కార్యక్రమానికి వెళ్ళకూడని మంత్రి అన్నట్లుగా స్పష్టంగా ఉందని అంటున్నారు. అంతే కాదు పిఠాపురంలో సూపర్ సిక్స్ ఇంటిటి ప్రచార కార్యక్రమానికి కూడా వర్మకు బదులుగా చంద్రబాబు తనను వెళ్ళమని ఆదేశించారు అని కూడా మంత్రి ఆ ఆడియో బైట్ లోనే చెప్పారు అంటున్నారు

వర్మ అదే మాట :

ఇక వర్మ అయితే మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీకి బద్ధుడిని అని ప్రకటించారు. పార్టీ ఏమి చెప్పినా ఎంత తగ్గమన్నా తగ్గేందుకు సిద్ధమని కూడా ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే మంత్రి నారాయణను వర్మ కలసి చాలా సేపు చర్చించారని అంటున్నారు. మరి ఈ ఇద్దరి మధ్య ఏమి జరిగింది ఏమి మాట్లాడుకున్నారు ఏమి సూచనలు మంత్రి ఆయనకు చేశారు తెలియదు కానీ మీడియాకు మాత్రం నారాయణ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు అని అంటున్నారు. చంద్రబాబు ఆగమంటే ఆగుతా అంతే కాదు ఆయన దూకమంటే దూకుతా అని వర్మ చెప్పారు. తాను ఎలాంటి అసత్య ప్రచారాలను పట్టించుకోను అన్నారు. తాను టీడీపీలో ఒక పిల్లర్‌ లాంటి వాడిని అని వర్మ చెప్పడం విశేషం.

Tags:    

Similar News