కాన్ట్సిట్యుయెన్సీ కబుర్లు: పెనమలూరులో ఏం జరుగుతోంది?
ఏడాదికాలంలో నియోజకవర్గంలో ఆయన సాధించిన ప్రగతి ఏంటి? అనే విషయం చర్చకు వస్తే.. మూడు అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.;
కొన్ని కొన్ని నియోజకవర్గాల రాజకీయాలు చిత్రంగా ఉంటున్నాయి. మరికొన్ని నియోజకవర్గాలు వివాదాల కు కేంద్రంగా మారుతున్నాయి. మొత్తంగా నియోజకవర్గం స్థాయి రాజకీయాలు కూడా చాలా ఆసక్తిగా ఉం టున్నాయి. ఇలాంటి వాటిలో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం ఒకటి. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో బోడే ప్రసాద్ విజయం దక్కించుకున్నారు. అది కూడా అతి కష్టంమీద ఆయన టికెట్ దక్కించుకోవడం తెలిసిందే. ఏడాదికాలంలో నియోజకవర్గంలో ఆయన సాధించిన ప్రగతి ఏంటి? అనే విషయం చర్చకు వస్తే.. మూడు అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.
1) అందరినీ కలుపుకొని పోవడం: గత ఎన్నికలకు ముందు.. టీడీపీలోనే రెండు మూడు రకాల గ్రూపులు ఉన్నాయి. ఇది .. బోడే ప్రసాద్‌కు అప్పట్లో ఇబ్బందికరంగా మారింది. అసలు టికెట్ విషయం డోలాయ మానంలో పడడానికి ఇది కూడా కారణమని అంటారు. దీనిని గమనించిన ఆయన.. టీడీపీ సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా.. అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరిస్తున్నారు. అందరినీ చేరువ చేసుకుని కలుపుకొని పనులు చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు ఉన్న గ్రూపు రాజకీయాలు తగ్గాయని తెలుస్తోంది.
2) ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రచారం: ఈ విషయంలోనూ బోడే ప్రసాద్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు కనుసన్నల్లో పడేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమం లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో భారీ హోర్డింగులు ఏర్పాటు చేయడంతోపాటు.. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తున్నా రు. అయితే.. నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయడంలో వెనుక బడుతున్నారు.
3) వివాదాలకు దూరంగా: సాధారణంగా టీడీపీ ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలు.. ఇక్కడ కనిపించడం లేదు. ఒకప్పుడు కాల్ మనీ ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వాటి జోలికి పోకుండా.. ఎమ్మెల్యే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫలితంగా వివాదాలకు దూరంగా ఉండే నాయకుల జాబితాలో బోడే చేరిపోయారు. అంతేకాదు.. ఇసుక, మద్యం వంటి వాటిలోనూ ఆయన పాత్ర పెద్దగా కనిపించడం లేదు. అలాగని పూర్తిగా తప్పుకోకపోయినా.. వివాదాలు వచ్చే స్థాయిలో మాత్రం ఎమ్మెల్యే పనిచేయడం లేదు. ఈ మూడు కారణాలతో పెనమలూరు రాజకీయాలు ఫర్వాలేదు.. అనే ట్యాగ్‌తో ముందుకు సాగుతున్నాయి.