జగన్ చెప్పిన తర్వాత పెద్దిరెడ్డి నో చెప్పారా?

వైసీపీ అధినేత చెప్పే మాటలకు చేసే పనులకు అస్సలు సంబంధమే ఉండదని ఆయన గురించి బాగా తెలిసిన సన్నిహితులు చెబుతుంటారు;

Update: 2025-09-19 05:18 GMT

వైసీపీ అధినేత చెప్పే మాటలకు చేసే పనులకు అస్సలు సంబంధమే ఉండదని ఆయన గురించి బాగా తెలిసిన సన్నిహితులు చెబుతుంటారు. అంతేకాదు.. ఆయన నమ్మకాన్ని సొంతం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదంటారు. దశాబ్దాల తరబడి పరిచయం ఉన్నప్పటికి.. తన ఆలోచనలకు తగ్గట్లుగా నడుచుకునే విషయంలో చోటు చేసుకునే మార్పులను నిశితంగా గమనించటంతో పాటు.. ఆ వెంటనే వారికిచ్చే ప్రాధాన్యతను తగ్గించే విషయంలో జగన్ పక్కాగా ఉంటారని చెబుతారు. అందుకే.. జగన్ కు దగ్గర కావటం కంటే కూడా ఆయనకు సన్నిహితుడిగా మారిన తర్వాత ఆయన తమకిచ్చే ప్రాధాన్యతను కంటిన్యూ చేసుకోవటమే కత్తి మీద సాముగా చెబుతారు.

గడిచిన పదేళ్లను చూస్తే.. జగన్ సన్నిహితులు.. ఆయన అమితంగా ప్రాధాన్యతను ఇచ్చే పార్టీ ముఖ్యనేతల జాబితాలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కానీ.. అందులో ఇప్పటివరకు మార్పు రాని కొద్ది మంది నేతల్లో మొదటి పేరు ఏమైనా ఉందంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిగా చెప్పాలి. జగన్ ప్రభుత్వంలో ఆయన హవా ఎంతలా సాగిందో తెలిసిందే. చిత్తూరు జిల్లా మాత్రమే కాదు.. రాయలసీమలో కడప మినహాయించి మిగిలిన మూడు జిల్లాల్లో ఆయన మాటే వేదంగా సాగిన పరిస్థితి.

అంతేకాదు.. తన ప్రసంగాల సమయంలోనూ పెద్దిరెడ్డి ప్రస్తావన తరచూ తెస్తుంటారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబును ఇరిటేట్ చేయాలన్న సందర్భంలో పెద్దిరెడ్డి ఉదాహరణకు మించింది మరొకటి లేదన్నట్లు జగన్ వ్యవహరిస్తారు. పెద్దిరెడ్డిని డ్యామేజ్ చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తారని.. వారి కాలేజీ రోజుల్లో చంద్రబాబు మీద పెద్దిరెడ్డి చేయి చేసుకున్నారని.. దాన్ని మనసులో పెట్టుకొని ఇబ్బంది పెడుతున్నట్లుగా చెప్పటం కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా..వీరవిధేయుడిగా ఉండటమే కాదు.. తనకు పెద్దరికాన్ని కట్టబెట్టిన జగన్ విషయంలో ఆయన వ్యవహరించే తీరు.. జగన్ మనసు కోరుకునేదిలా ఉంటుందని చెప్పాలి. అలాంటిది తాజాగా జరిగిన పార్టీ శాసన సభాపక్ష సమావేశంలో.. అసెంబ్లీ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావాల్సిన అంశంపై చర్చ జరిగినప్పుడు.. జగన్ రాకుంటే.. కనీసం ఎమ్మెల్యేలు అయినా హాజరైతే బాగుంటుందన్న అభిప్రాయాన్ని పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రస్తావించారు.

ఈ సందర్భంగా అనూహ్య రీతిలో రియాక్టు అయిన జగన్.. ‘పెద్దరెడ్డన్నా.. నువ్వు పెద్దరికం తీసుకొని ఎమ్మెల్యేలను అసెంబ్లీకి తీసుకెళతావా? అననతో పాటు ఎమ్మెల్యేలు సభకు వెళ్లానుకుంటే వెళ్లొచ్చు’ అని జగన్ వ్యాఖ్యానించగా. అందుకే స్పందనగా పెద్దిరెడ్డి తనకు సభకు వెళ్లే ఉద్దేశం లేదని వ్యాఖ్యానించటం గమనార్హం. ఈ సందర్భంగా జగన్ మాటల్ని జాగ్రత్తగా వింటే ఆయన ఆలోచన ఏమిటో అర్థమవుతుందని.. ఆ విషయాన్ని ఇట్టే పసిగట్టటంలో పెద్దిరెడ్డి వేరే లెవల్ గా చెబుతారు.

మరోవైపు..తాను సభకు వెళితే.. అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన పనుల్ని ప్రస్తావిస్తూ.. అధికారపక్షం టార్గెట్ చేస్తే.. అది తన ఇమేజ్ ను మరింత దెబ్బ తీస్తుందన్న విషయం పెద్దరెడ్డికి తెలుసు. ఓవైపు జగన్ సైతం అన్యమనస్కంతోనే వెళ్లమని చెబుతున్నారే తప్పించి.. పక్కాగా వెళ్లాలన్న సంకేతాన్ని స్పష్టంగా ఇవ్వని నేపథ్యంలో పెద్దిరెడ్డి అందుకు తగ్గట్లే రియాక్టు అయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News