తెలంగాణ ఎమ్మెల్యే గెలుపు మొక్కును తిరుమలలో తీర్చుకున్న 150 మంది ఫ్యాన్స్!
ఇంతకూ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన్ను అంతగా అభిమానించి.. గుండు మొక్కును పూర్తి చేసుకున్న వారు ఏ ఊరికి చెందిన వారు? లాంటి వివరాల్లోకి వెళితే..;
అభిమానించటం..ఆరాధించటం లాంటి మాటలు వింటుంటాం. కానీ.. చేతల్లో కొందరు చూపిస్తుంటారు. అలాంటి సన్నివేశమే తాజాగా తెర మీదకు వచ్చింది. తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యేను అమితంగా అభిమానించే ఒక ఊరి వారు.. తమ నేత ఎన్నికల్లో గెలిస్తే తిరుమలకు వెళ్లి గుండు చేయించుకుంటామని మొక్కుకున్నారు. వారి మొక్కు ఫలించింది. సదరు ఎమ్మెల్యే గెలిచారు. అనుకున్నట్లే నియోజకవర్గంలోని ఒక ఊళ్లోని 150 మంది తిరుమలకు వెళ్లి.. గుండు కొట్టించుకున్న ఉదంతం ఆసక్తికరంగా మారింది.
ఇంతకూ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన్ను అంతగా అభిమానించి.. గుండు మొక్కును పూర్తి చేసుకున్న వారు ఏ ఊరికి చెందిన వారు? లాంటి వివరాల్లోకి వెళితే..అదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విజయం సాధించటం తెలిసిందే. 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో తమ అభిమాన నేత పాయల్ శంకర్ గెలవాలని కొందరు బలంగా అనుకున్నారు.
మాటకు అనుకోవటం కాకుండా.. తమ నేత ఎమ్మెల్యేగా గెలిస్తే.. తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పించుకుంటామని 150 మంది మొక్కుకున్నారు. వారంతా అదిలాబాద్ జిల్లా జైనథ్ మండలానికి చెందిన ‘ఆడ’ అనే గ్రామానికి చెందిన వారు. వారు కోరుకున్నట్లే బీజేపీ నేత పాయల్ శంకర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో.. తమ మొక్కును చెల్లించుకోవటానికి ఈ 150 మంది తిరుమలకు వెళ్లి తలనీలాలు సమర్పించుకొన్నారు.
అనంతరం తమ అభిమాన నేత పాయల్ శంకర్ ను కలిసి... తిరుమలకు వెళ్లి ఎన్నికల వేళలో తాము మొక్కుకున్న మొక్కును తీర్చుకున్నట్లు చెప్పారు. దీంతోవారి అభిమానానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ భావోద్వేగానికి గురయ్యారు. నియోజకవర్గంలోని పలు గ్రామస్తుల అభిమానంతోనే సర్పంచ్ గా తన కెరీర్ షురూ చేసి.. చివరకు ఎమ్మెల్యే అయినట్లు చెప్పుకున్నారు. పాయల్ శంకర్ మాటలు నిజమే కదా?