తాటి చెట్లు అడ్డు పెట్టి.. మంత్రిని ఆపేశారు: ఏపీలో సంచలనం
సహజంగా నిరసన అంటే.. పెద్ద ఎత్తున జనాలు గుమిగూడుతారు. నినాదాలు చేస్తారు. రోడ్లపై బైఠాయిస్తారు.;
సహజంగా నిరసన అంటే.. పెద్ద ఎత్తున జనాలు గుమిగూడుతారు. నినాదాలు చేస్తారు. రోడ్లపై బైఠాయిస్తారు. కానీ, దీనికి మించి అన్నట్టుగా విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేటకు చెందిన మత్స్యకారులు, స్థానికులు రహదారులపైకి వచ్చి.. ఏకంగా 10-15 అడుగుల ఎత్తున ఉన్న తాటిచెట్లనే రోడ్లపై పడేసి.. మంత్రి కాన్వాయ్‌ను నిలిపివేశారు. ఆ మంత్రి ఎవరో కాదు.. పాయకరావు పేట నియోజకవర్గం ఎమ్మెల్యే, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. ఆమె వస్తున్నారన్న వార్తతో ఒక్కసారిగా కదిలి వచ్చిన మత్స్యకారులు పెద్ద ఎత్తున రహదారులను దిగ్భందించారు.
పాకయరావుపేట-విశాఖ రహదారిపైకి చేరుకుని.. పెద్ద పెద్ద తాటిచెట్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి.. వాటి వెనుకాల కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. మెరుపు నిరసనతో అవాక్కయిన పోలీసులు తేరుకునేలోగానే మంత్రి కాన్వాయ్ అక్కడకు చేరుకుంది. దీంతో నిరసన కారులను చూసి.. మంత్రి ఏం జరుగుతుందో నన్న భయంతో కొంత సేపు కారులోనే ఉండిపోయారు. అనంతరం.. నిరసన కారులు సంయమనంతోనే ఉన్నారని తెలుసుకుని.. కాన్వాయ్ నుంచి బయటకు వచ్చి వారితో చర్చించారు. అయినప్పటికీ.. మత్స్యకారులు, స్థానికులు మంత్రిని నిలదీశారు. మీరు ఏం చేస్తున్నారు? ఇంత జరుగుతున్నా.. మమ్మల్ని పట్టించుకోరా? అంటూ.. మంత్రిపై నిప్పులు చెరిగారు. డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తించారు.
ఇంతకీ ఏం జరిగింది?
పాయకరావుపేటలోని రాజయ్య పేటలో బల్క్ డ్రగ్ పార్క్(ఔషధ తయారీ పరిశ్రమల ఏర్పాటు) కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి భూముల సేకరణకు అధికారులు రంగం రెడీ చేస్తున్నారు. దీంతో తమ భూములు ఇచ్చేది లేదంటూ.. కొన్నాళ్లుగా ఇక్కడి మత్స్యకారులు.. స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ, మంత్రి ఈ విషయాన్ని పెడచెవిన పెట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం మంత్రి వస్తున్న విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు వేలాదిగా తరలి వచ్చి.. ఆమెను అడ్డుకున్నారు. దీంతో చేసేది లేక.. ఈ వ్యవహారంపై కమిటీ వేస్తామని మంత్రి చెప్పారు. కానీ, స్థానికులు ససేమిరా అన్నారు. ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. అయినా వారు వినలేదు.
దీంతో వారికి చేతులెత్తి దండం పెట్టిన మంత్రి.. ఈ సారి తప్పకుండా పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి ఇక్కడ ఇప్పటికే పార్కు ఉంది. దీనిని తీసేయాలని ఎప్పట నుంచో మత్స్యకారులు కోరుతున్నారు. దీనిని తీసేయకపోగా.. విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కేంద్రంనుంచి నిధులు వస్తాయి. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఇటీవల కాకినాడ జిల్లాలోనూ ఉప్పాడలో మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. సో.. మొత్తానికి సర్కారు పైపైనే చూసుకుంటున్నా.. అంతర్గతంగా ఉన్న సమస్యలు అనేకం పెరుగుతున్నాయి.