ఆధునిక నరకాసురులు... పవన్ ట్వీట్ వెనక...?

పండుగ వెనక ఉన్న పురాణాలు అందులోని రాక్షసులను తెచ్చి ఆధునిక రాజకీయాల్లో మిళాయించి జనాలు వారిని అంతం చేయాలని సందేశం ఇవ్వడం కొత్త రాజకీయంగా మారుతోంది.;

Update: 2023-11-12 03:58 GMT

దీపావళి పండుగ వచ్చింది. నరకాసురుడు గుర్తుకు వచ్చాడు. దానికంటే ముందు దసరా వచ్చింది. మహిషాసురుడు గుర్తుకు వచ్చాడు. వినాయకచవితి వస్తే మూషికుడు అనే రాక్షసుడు గుర్తుకు వస్తాడు. శ్రీరామనవమికి రావణుడు గుర్తుకు వస్తాడు, శ్రీక్రిష్ణాష్టమికి శిశుపాలుడు సహా ఎందరో రాక్షసుల లిస్ట్ చదువుతారు. ఇలా ప్రతీ పండుగకూ ఒక దుష్ట సంహార చరిత్ర ఉంది. పండుగకు జనాలకు శుభాకాంక్షలు చెప్పే ఆనవాయితీ కూడా ఉంది.

అయితే పండుగను పండుగగా తీసుకుని శుభాకాంక్షలు చెప్పడం ఎపుడో అంతా మరచిపోయారు. పండుగ వెనక ఉన్న పురాణాలు అందులోని రాక్షసులను తెచ్చి ఆధునిక రాజకీయాల్లో మిళాయించి జనాలు వారిని అంతం చేయాలని సందేశం ఇవ్వడం కొత్త రాజకీయంగా మారుతోంది.

ఈ తరహా రాజకీయాలకు పెట్టింది పేరు టీడీపీ. దాని అధినాయకుడు చంద్రబాబు. ఆయన పండుగ శుభాకాంక్షలను కూడా రాజకీయాలకు వాడుకోకుండా ఉండలేరు. ఈ పండుగ స్పూర్తితో ప్రత్యర్ధి పక్షాలను గద్దె దించాలనో ఓడించాలనో ఆయన పిలుపు ఇస్తూ ఉంటారు.

బాబుని సదా అభిమానించి అనుసరించే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ది కూడా అదే స్టైల్ గా మారుతోంది. అందుకే ఆయన కూడా దీపావళి శుభాకాంక్షలతో వదలకుండా ఆధునిక నరకాసురులు అని విశేషణం పెట్టారు. మరి ఆ నరకాసురుడు ఎవరు. అందరికీ తెలుసు పవన్ ఎవరి గురించి అంటున్నారో.

ఏపీలో వైసీపీ పాలన అంతం చేయాలని జనసేన టీడీపీ పాలన స్థాపించాలన్నదే పవన్ దీపావళి సందేశం. మరిఒ అది జరగాలీ అంటే పురాణాలు వల్లిస్తే సరిపోతుందా. అందుకోని వారిని తెచ్చి ఈనాటి రాజకీయ నేతలకు తగిలిస్తే పని పూర్తి అవుతుందా.

జనం మనసులు గెలవాలి. పురాణ పురుషులు కూడా సులువుగా రాక్షసులను అంతం చేయలేదు. ఎన్నో వ్యూహాలు ఎత్తులు వేసి యుద్ధాలు చేసి చివరికి దుష్ట సంహారం శిష్ట రక్షణ చేశారు. అయితే ఇది ప్రజాస్వామ్యం. దుష్ట సం హారాం అంటే అధికారంలో నుంచి దించడమే. అంతకంటే ఎక్కువగా భాష కూడా వాడకూడదు.

ఆ మాటకు వస్తే అసలు పురాణాల ప్రసక్తి కూడా తేకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకున్న వారే ప్రభువులు. మరి ప్రభువులు అయిన వారిని కించపరిస్తే ప్రజలను కించపరచినట్లే. మాకూ ఒక చాన్స్ ఇవ్వండి అని అడగడం మంచి విధానం అవుతుంది. అంతే తప్ప వారు వీరిని రాక్షసులుగా చిత్రీకరించి వీరు వారిని మరేదో పోలిక పెట్టి విమర్శించి చేస్తే అది ప్రజాస్వామ్య స్పూర్తి అనిపించుకుంటుందా అనేది ఆలోచించాలి.

ఏది ఏమైనా ఆధునిక నరకాసురులు అంటూ ఎవరూ లేరు. ప్రతీ మనిషిలోనూ మంచి చెడు ఉన్నాయి. మంచి దారి సదా వెతకడమే పండుగల ఉద్దేశ్యం. ఆ దిశగానే మన ప్రజాస్వామ్య విధానమూ సాగాలి. విజ్ఞులు అంతా అదే కోరుకోవాలి.

Tags:    

Similar News