హైడ్రామా నడుమ విజయవాడలో పవన్... నేడు పీఏసీ!
టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టైన నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది.;

టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టైన నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. దీంతో ఎక్కడా చెప్పుకోదగ్గ అవాంచనీయ సంఘటనలు జరగలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబులాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినా ఏపీ ప్రశాంతంగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఏపీకి బయలుదేరారు!
అవును... టీడీపీ అధినేత అరెస్టును సంపూర్ణంగా ఖండింఛిన జనసేన అధినేత.. ఏపీకి వెళ్లాలని ఫిక్సయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరే ప్రయత్నం చేశారు! అయితే ఈ సమయంలో పవన్ కల్యాణ్ ఏపీకి వస్తే శాంతిభద్రతల సమస్యలు వస్తాయని పోలీసులు భావించారు. దీంతో పవన్ పర్యటనను అడ్డుకున్నారు.
ఈ విషయంపై అసంతృప్తిని వెళ్లగక్కిన పవన్... రోడ్డుమార్గంలో ఏపీకి బయలుదేరారు. ఈ సమయంలో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. విజయవాడ-హైదరాబాద్ హైవేపై హైటెన్షన్ నెలకొంది. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ వాటిని జనసైనికులు తొలగించే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారని తెలుస్తుంది.
ఇలా జనసైనికులను చెదరగొట్టే సమయంలో పవన్ కల్యాణ్ రోడ్డుపై బైటాయించారు. రహదారిపై పడుకుని నిరసన తెలిపారు. ఈ ఘటనతో విజయవాడ – హైదరాబాద్ పై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచి పోయాయి. దీంతో... అర్ధరాత్రి ప్రయాణికులు నరకం చూశారని అంటున్నారు. ఈ సమయంలో అనుమంచిపల్లిలో పవన్ కళ్యాణ్ తోపాటు నాదెండ్ల మనోహర్ ను కూడా ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం విజయవాడకు వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ కు అనుమతి లంభించింది. ఎట్టకేలకు పోలీసులు పవన్ కళ్యాణ్ కు అనుమతి ఇచ్చారు. జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద నుంచి మూడు కార్లతోనే పవన్ కల్యాణ్ కాన్వాయ్ ముందుకు కదిలింది. అనంతరం పవన్ విజయవాడ చేరుకున్నారు.
నేడు జనసేన పీఏసీ సమావేశం:
నేడు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన పీఏసీ సమావేశం కానుంది. ఈ మీటింగ్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోపాటు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం జరుగనుంది. తాజా రాజకీయ పరిణామాలపై పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చర్చించనుంది. ఇదే సమయంలో వారాహి తదుపరి షెడ్యూల్ పైనా కమిటీ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తుంది.