ఏ భావజాలాన్ని గుడ్డిగా నమ్మవద్దు...యువతకు పవన్ సలహా
యువత అన్నది అణు బాంబు లాంటిది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. యువత తలుచుకుంటే ఏమైనా చేయగలదు అన్నారు.;
యువత అన్నది అణు బాంబు లాంటిది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. యువత తలుచుకుంటే ఏమైనా చేయగలదు అన్నారు. వారు ఒక విస్పోటం అని కూడా అభివర్ణించారు. యువత ఏదీ అనుకుంటే అది జరుగుతుంది అని పవన్ అన్నారు. విశాఖలో ఏయూ శతాబ్ది ఉత్సాలకు హాజరైన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతరం గురించి కీలకమైన అంశాలనే చెప్పారు. యువత ఎలా ఉండాలో ఆయన చెప్పుకొచ్చారు. యువత ఆలోచనలు భావోద్వేగాలతో కాకుండా వాస్తవికంగా ఉండాలని హిత బోధ చేశారు.
దేశ భవిష్యత్తు :
ఈనాటి యువతరం దేశానికి ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తుని ఇచ్చే శక్తి అని ఆయన అన్నారు. ఈ విద్యార్థులు దేశాన్ని నడిపే నావికులు అని చెప్పారు. యువ ప్రతిభ, జ్ఞానం సమాజానికి, దేశానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు ఇక ఆంధ్ర విశ్వవిద్యాలయం భారతీయ వారసత్వ సంపద చిహ్నం అని ఆయన చెప్పారు. ఏపీలో ఉన్న అన్ని కళల అభివృద్ధికి ఏర్పాటైన సంస్థగా చెప్పారు. మేధస్సు, సంస్కృతి, దేశ నిర్మాణం అనే మూడు స్థంభాలపై ఏయూ నిర్మాణం జరిగింది అని ఆయన అన్నారు. ఏయూ శతాబ్ద కాలంగా వేలాది మంది మేధావులను సమాజానికి అందించిందని గుర్తు చేశారు. అలాంటి వారి స్ఫూర్తితో యువత సమాజాన్ని మార్చే బలమైన శక్తులుగా ఎదగాలి అని ఆయన కోరారు.
మీ కోసమే అంటూ :
ఇక తన ఆఖరి శ్వాస వరకు భవిష్యత్ తరాల కోసమే పని చేస్తానని పవన్ స్పష్టం చేశారు. యువత కూడా అలాగే సమాజానికి అంకితం కావాలని కోరారు. యువత ఆలోచనలు అన్నీ ఆచరణాత్మకంగా నైతికంగా ధర్మబద్ధంగా ఉండాలని పవన్ చెప్పారు. ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మితే ఆవేశం తప్ప మరేమీ మిగలదని ఆయన అన్నారు.
ఏయూ లోగో గురించి :
ఆంధ్ర యూనివర్సిటీ లోగోను ప్రత్యేక శ్రద్ధతో తయారుచేశారని పవన్ చెబుతూ దానిని వివరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. లోగోలోని ప్రతి అంశానికి అర్థం స్ఫూరించేలా తయారు చేశారని అన్నారు. కాంతి కిరణాలతో ఉదయించే సూర్యుడు విశ్వవిద్యాలయాన్ని దాని అనేక అధ్యయన విభాగాలను సూచిస్తుందని చెప్పారు. ఇక కమలం శ్రేయో దేవత లక్ష్మీ, జ్ఞాన దేవత సరస్వతి ఇద్దరినీ ప్రతిబింబిస్తుందని అన్నారు. అలాగే సూర్యకిరణాలపై ఆర్యులలో దీవెన చిహ్నమైన స్వస్తిక్ ఉంటుందని వివరించారు. ఇలా అరవై నాలుగు తామర రేకులతో కూడిన శిఖరం బయటి వృత్తం, భారతదేశ శాస్త్రీయ సంప్రదాయంలోని అరవై నాలుగు కళలను, శాస్త్రాలను సూచిస్తుందన్నదే ఈ అర్ధం పరమార్ధం అన్నారు.
కాలాతీతమైన ఫిలాసఫీ :
కాలాలని దాటి చూసే ఫిలాసఫీని యువత అందుకోవాలని పవన్ సూచించారు. కారల్ మార్క్స్ లాంటి వ్యక్తులు మాత్రమే కాదు నాలాంటి వ్యక్తులు ఎవరు ఏ ఐడియాలజీ చెప్పినా గుడ్డిగా నమ్మి ప్రభావితం కావొద్దని పవన్ చెప్పడం విశేషం. 80, 90 దశకాల్లో బ్యాలెన్స్ లేని ఐడియాలజీ నమ్మి ఎంతో మంది అడవులకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మాటలు పార్టీ పెట్టిన కొత్తలో మాదిగా చెప్పటం లేదు. పార్టీ పెట్టి దశాబ్ధ కాలం తరువాత చెబుతున్నాను అని పవన్ అన్నారు. నాలాంటి వాడే సమాజానికి ఇంత చేయగలిగితే. మీరికెంత చేయగలరో ఆలోచించాలని ఆయన యువతను కోరారు. మొత్తానికి పవన్ పవర్ ఫుల్ స్పీచ్ తో యువతను ఉర్రూతలూగించారు.