పవన్ ను కలిసే వరకు స్కూల్ కు వెళ్లనంటున్న తొమ్మిదేళ్ల అంధ బాలిక

వీరికి కాస్త భిన్నంగా తొమ్మిదేళ్ల అంధ బాలిక స్వాతి అన్నపూర్ణ తీరు ఉందని చెప్పాలి. ఆమె తండ్రి ఏసుబాబుకు మాదిరే.. స్వాతికి కూడా పవన్ కల్యాణ్ అంటే అమితమైన అభిమానం.;

Update: 2026-01-26 08:05 GMT

పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను అభిమానించి.. ఆరాధించేటోళ్లు ఎంతలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందుకు చిన్నా.. పెద్దా అన్న తేడా ఉండదు. టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ తో పాటు పలు ఇతర వుడ్ లలో మరెక్కడా ఏ నటుడికి.. అతడి పేరు పక్కనే ‘ఇజం’ తగిలించి.. ఒక కొత్త తత్త్వాన్ని క్రియేట్ చేసిన ఘనత పీకే ఫ్యాన్సే దే.

పవనిజం అంటూ పవన్ ను ఫాలో అయ్యేటోళ్ల గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా తాము అభిమానించే పవన్ ను కలిస్తే చాలు.. తమ జీవితం ధన్యమవుతుందని భావించేటోళ్లు లక్షల్లో ఉంటారు.

వీరికి కాస్త భిన్నంగా తొమ్మిదేళ్ల అంధ బాలిక స్వాతి అన్నపూర్ణ తీరు ఉందని చెప్పాలి. ఆమె తండ్రి ఏసుబాబుకు మాదిరే.. స్వాతికి కూడా పవన్ కల్యాణ్ అంటే అమితమైన అభిమానం. అంతకు మించిన ఆరాధన. యు.కొత్తపల్లి మండలానికి చెందిన స్వాతి అన్నపూర్త ప్రస్తుతం విశాఖపట్నం భీమిలి నేత్రా విద్యాలయంలో నాలుగో తరగతి చదువుతోంది.

పవన్ అంటే తన తండ్రికి ఎంత ఇష్టమో ఆమెకు తెలుసు. గత ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన పవన్ కోసం ఆయన ఎవరితోనూ సంబంధం లేకుండా పిఠాపురం వెళ్లి మరీ పని చేశాడు. అంతేకాదు.. పవన్ కల్యాణ్ కు ఇష్టమైనవన్నీ ఈ బాలికకు ఇష్టం. హనుమాన్ అంటే పవన్ కల్యాణ్ కు ఇష్టమని తెలిసిన స్వాతి.. హనుమాన్ చాలీసా సాధన చేసింది.

తాను అంతలా ఆరాధించే పవన్ కల్యాణ్ ను తాను కలవాలన్న కోరికను తండ్రికి చెప్పింది. అదేమంత తేలికైన విషయం కాదు కదా. తన అశక్తతను వ్యక్తం చేస్తే.. తాను పవన్ ను కలిసే వరకు స్కూల్ కు వెళ్లనని మంకుపట్టు పట్టింది. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన స్వాతి.. ఆ తర్వాత స్కూల్ ఓపెన్ అయినప్పటికి వెళ్లకుండా పట్టుదలతో ఉండిపోయింది. దీంతో.. తన కూతురు కోరికను తీర్చేందుకు ఏసుబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. ఫలితం లేని పరిస్థితి. దీంతో.. పవన్ ను కలవటం ఎలా అన్నదిప్పుడు టాస్కుగా మారింది. మరి.. ఈ విషయం పవన్ కు ఎప్పుడు తెలుస్తుంది? ఆ చిన్నారి కోరిక ఎలా తీరుతుందో చూడాలి.

Tags:    

Similar News