"తెలంగాణ మీ అయ్య జాగీరా?" బెదిరింపులకు భయపడను.. పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణలో తన రాజకీయ కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న వారిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Update: 2026-06-02 13:00 GMT

తెలంగాణలో తన రాజకీయ కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న వారిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో తనను అడుగుపెట్టనివ్వమని.. తిరగనివ్వమని హెచ్చరికలు చేస్తున్న నేతలను లక్ష్యంగా చేసుకుని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా? నన్ను బెదిరించడానికి మీరు ఎవరు?” అంటూ ప్రశ్నించారు. తెలంగాణపై తనకున్న ప్రేమ కొత్తది కాదని.. రాజకీయ ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో నిర్వహించాల్సిన జనసేన సభకు అనుమతులు రాకపోవడంతో జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల తనపై వస్తున్న విమర్శలు.. ఆరోపణలపై ఆయన సుదీర్ఘంగా స్పందించారు. తెలంగాణ కోసం తాను పోరాటాలు చేసిన రోజుల్ని గుర్తుచేసుకుంటూ “ఆ సమయంలో ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు ఎక్కడ ఉన్నారు?” అని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తీరుపై మాత్రమే తమకు అభ్యంతరం ఉందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లేదా తెలంగాణ సంస్కృతిపై ఎప్పుడూ వ్యతిరేకత లేదని పవన్ స్పష్టం చేశారు. పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అప్పట్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. “సామాజిక తెలంగాణ రావాలి అని కోరుకున్న వారిలో నేనూ ఒకడిని” అని తెలిపారు.

జనసేన పార్టీ తెలంగాణకు వ్యతిరేకమని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ పవన్, తెలంగాణ నడిబొడ్డునే జనసేన పార్టీ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది జనసైనికులు ఉన్నారని, తెలంగాణలో పార్టీకి బలమైన మద్దతు ఉందని చెప్పారు. “ఇన్నాళ్లు చాలా విషయాల్లో సహనంగా ఉన్నాం. కానీ ఇకపై తెలంగాణలో జనసేనను బలోపేతం చేస్తాం. అవసరమైతే ఎన్నికల్లో పోటీ కూడా చేస్తాం” అని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఓట్లు వస్తాయని భావించి కాకుండా ప్రజా సమస్యల కోసం గతంలో అనేక ప్రాంతాల్లో పర్యటించానని చెప్పారు. ముఖ్యంగా తండాలు, గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. “ఏపీలో నా యాత్రలకు అడ్డంకులు సృష్టించిన సందర్భాల్లో తెలంగాణలో మాత్రం వారాహి యాత్రకు అనుమతులు ఇచ్చారు. కోదాడ, నల్గొండ ప్రాంత ప్రజలు కూడా ఎంతో ఆదరించారు” అని తెలిపారు.

తెలంగాణ యువతకు మరిన్ని అవకాశాలు రావాలని కోరుకునే వ్యక్తిని తాను అని పవన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకోని తాను, తెలంగాణలో అధికారాన్ని ఎందుకు కోరుకుంటానని ప్రశ్నించారు. తన రాజకీయ లక్ష్యం అధికారం కాదని, సమాజంలో మార్పు తీసుకురావడమేనని పేర్కొన్నారు.

ఇటీవల తనపై వచ్చిన చెరువు ఆక్రమణ ఆరోపణలపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. “నేను చెరువును కబ్జా చేశానని ఎవరైనా నిరూపిస్తే ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికే చెబుతున్నాను” అని అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు.

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలను కూడా పవన్ తీవ్రంగా తప్పుబట్టారు. “పాలకులు వేరు, ప్రజలు వేరు. పాలకులను విమర్శించండి కానీ ప్రజలను కించపరచొద్దు. దేశంలోని అనేక ప్రాంతాల్లో తెలుగువారు నివసిస్తున్నారు. అక్కడి నుంచి వారిని పంపిస్తే మన పరిస్థితి ఏమిటి?” అని ప్రశ్నించారు.

మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కృషి వల్లే తెలుగు సినిమా పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిందని గుర్తుచేసిన పవన్, తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై తనకు ఎప్పుడూ గౌరవం ఉందన్నారు. తాను ఇప్పటివరకు ఏ తెలంగాణ నాయకుడినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని, రెచ్చగొట్టే రాజకీయాలకు దూరంగా ఉండటానికే ప్రయత్నించానని చెప్పారు.

అయితే ఇకపై బెదిరింపులకు తలొగ్గేది లేదని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ “తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుంది. నేను తెలంగాణలో తిరుగుతాను. ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఏం చేస్తారో చేసుకోండి” అంటూ సవాల్ విసిరారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో జనసేన పాత్ర ఏ స్థాయిలో ఉండబోతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ ప్రారంభమైంది.












Tags:    

Similar News