ట్రోల్స్ చిక్కుల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ..!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నారు.;

Update: 2025-07-14 11:30 GMT

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నారు. ఆయన చేస్తున్న ప్రసంగాలు, తీవ్ర విమర్శలు వంటివి నెటిజ‌న్ల‌కు ఆటపట్టుగా మారాయని చెప్పాలి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి నిజానికి.. జనసేన నాయకులకు కూడా మింగుడు పడడం లేదనే చెప్పాలి. ఏదైనా ఒక విషయంపై మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అదేవిధంగా గతంలో మాట్లాడిన మాటకు ప్రస్తుతం మాట్లాడే మాటకు మధ్య పొంతన ఉండేలా చూసుకోవాలి.

కానీ, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో దారి తప్పుతున్నారనేది నెటిజన్లు చేస్తున్న ట్రోల్స్ ను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. గతంలో హిందీ భాష పై తీవ్ర విమర్శలు గుప్పించిన పవన్ ఇటీవల కాలంలో మాత్రం హిందీని ప్రశంసిస్తున్నారు. బిజెపిని భారతీయ జనతా పార్టీ కాదని అది హిందీ జనతా పార్టీ అని పేర్కొన్న పవన్ కళ్యాణ్ గత ఎన్నికల సమయంలో బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. దీనిపై అప్పట్లోనే ట్రోల్స్ వచ్చాయి. ఇక ఇటీవల కాలంలో హిందీని ఆయన పూర్తిగా భుజాల మీద ఎక్కించుకున్న ప‌రిస్థితి ఉంది.

బిజెపి నాయకుల కంటే ఎక్కువగా కూడా పవన్ కళ్యాణ్ హిందీ ప్రచారం చేస్తున్నారనే మాట‌ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. హిందీని ఒకప్పుడు విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందీ నేర్చుకుంటే తప్పేముంది.. దీనివల్ల మనకి కమ్యూనికేషన్ పెరుగుతుందని చెప్పుకొస్తున్నారు. త్రిభాషా సూత్రాన్ని సమర్థిస్తున్నారు. ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ త్రిభాషా సూత్రాన్ని తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. విమర్శించారు. బీజేపీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా గుర్తించారు.

కానీ.. ఇప్పుడాయ‌న దాన్ని సమర్థిస్తున్నారు. ఇక, సనాతన ధర్మం విషయానికి వస్తే ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ విమర్శలు పాలయ్యారు. ఒకప్పుడు తనకు మతం లేదని కులం లేదని తాను సిద్ధాంతాలకు మాత్రమే విలువ ఇస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే చేగువేరా.. లెనిన్ వంటి వారిని తనకు ఆదర్శంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు తన ఇంట్లో తల్లి మాత్రమే పూజలు చేస్తారని తన తండ్రి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉంటారని ఆయన పలు సందర్భాల్లో 2014-19 చెప్పుకొచ్చారు.

కానీ, తిరుపతి లడ్డు విషయంలో కావచ్చు తిరుపతిలో జరిగిన తొక్కేసలాట అంశంలో కావచ్చు ఆయన పూర్తిగా సనాతన ధర్మానికి మద్దతిస్తూ కాషాయ వస్త్రాలు ధరించి ఏకంగా దీక్ష కూడా చేశారు. ఈ పరిణామం కూడా పవన్ కళ్యాణ్‌ను ట్రోల్స్‌కు గురయ్యేలా చేసింది. ఇక మరో ముఖ్య విషయం.. తను పుట్టి పెరిగిన ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క వేదికపై ఒక్కొక్క రకంగా చేస్తున్న వ్యాఖ్యలు కూడా నటిజెన్లకు ఆటవిడుపుగా మారింది. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన నేనిక్కడ పుడితే బాగుండేది అని వ్యాఖ్యానించడం.. గతంలో తను కర్నూల్ లో పెరిగానని, నెల్లూరులో పుట్టానని, పాలకొల్లులో చదివానని ఇట్లా రకరకాలుగా ఒక సంబంధం లేనటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల నెటిజన్లు పదేపదే ట్రోల్స్ చేస్తున్నారు.

``సరే దీనివల్ల ఏం జరుగుతుంది? ఏదో మా నాయకుడు ఇలా అన్నంత మాత్రాన మాకు ఒరిగేది ఏంటి`` అని కొంతమంది జనసేన నాయకులు అనుకుంటే అనుకుని ఉండొచ్చు. కానీ, ఒక కీలక పార్టీకి అధినేతగా ఉన్న వ్యక్తి, పదేపదే ఇలా ట్రోల్స్‌కు గురి అయితే రేపు ప్రజల్లో ఆయన పట్ల వ్యతిరేక భావన పెరిగే అవకాశం ఉంటుందన్నది పరిశీలకుల అంచనా. కాబట్టి, భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు గానీ, ప్రసంగాలు చేసేటప్పుడు గాని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఒక పార్టీ అధినేతగా పవన్ కు ఇది చాలా ముఖ్యమైనది పరిశీలకుల భావన.

Tags:    

Similar News