నెయ్యిలో నెయ్యి లేదు.. అసెంబ్లీలో పవన్ పవర్ ఫుల్ స్పీచ్
ఏపీ అసెంబ్లీలో తిరుమల లడ్డూ ప్రసాదంపై జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.;
ఏపీ అసెంబ్లీలో తిరుమల లడ్డూ ప్రసాదంపై జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెయ్యిలో నెయ్యి లేదని తేలిపోయిందని, అయినప్పటికీ వైసీపీ కల్తీ జరిగిందని అంగీకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాజీ ముఖ్యమంత్రి జగన్ తప్పు చేశారని ఎక్కడా చెప్పలేదని, కానీ ఆయన నియమించిన టీటీడీ పాలకవర్గం బాధ్యత లేకుండా వ్యవహరించిందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో టీటీడీ పాలకవర్గం తప్పు చేసిందని ఆధారాలతో బయటపడినా జగన్ వెనకేసుకు రావడాన్ని పవన్ ప్రశ్నించారు.
లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపి దోషులకు శిక్ష పడాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కల్తీ నెయ్యి అంశంపై పవన్ అసెంబ్లీలో భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయులు రచించిన అమూక్త మల్యాదలోని ఒక పద్యాన్ని చదవి వినిపించారు. దేవుడి సేవలో ఎలాంటి వారిని నియమించాలో రాజుకు కర్తవ్యాన్ని ఉపదేశించే పద్యాన్ని శ్రీకృష్ణదేవరాయులు రచించారని చెప్పారు పవన్. రాజు కోసం వసూళ్లు చేసే వాడికి ఎప్పుడూ దేవాలయాలపై అధికారం ఇవ్వకూడదని, అలాంటి వాడు రాజ్యానికి నష్టం వస్తే దేవుడి డబ్బును రాజు ఖజానాకు చేర్చుతాడని తెలిపారు. అలాంటిది తప్పుడు పని కాబట్టి వంటరి వాడికే దేవాలయాలపై అధికారం ఇవ్వాలని శ్రీకృష్ణదేవరాయులు చెప్పారని గుర్తు చేశారు. దేవుడి డబ్బు తీసుకుంటే రాజ్యం నాశనం అవుతుందని అమూక్త మల్యాదలో రాశారని అన్నారు. గత ప్రభుత్వంలో అచ్చం ఇలానే జరిగిందని పవన్ వ్యాఖ్యానించారు. భగవంతుడి డబ్బుతో ఆడుకున్నవారు, దోచేసిన వారి తరాలు లేచిపోతాయని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత తాను షాక్ తిన్నానని పవన్ అసెంబ్లీకి తెలిపారు. గత ప్రభుత్వంలో తాను తిరుమలకు వెళ్లినప్పుడు స్థానికులు కూడా ఇదే అంశాలు చెప్పేవారని, ప్రసాదంలో నాణ్యత లేదని అప్పుడే తాము అనుకున్నామని వెల్లడించారు. అయితే అప్పట్లో ఈ విషయంపై మాట్లాడకపోవడం వల్లే ఇంత నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో ఆలయాలపై దాడులు జరిగినప్పుడు మేం ఖండించామే తప్ప, మీరు ఉన్నారని, మీరు చేయించారని మేము ఆరోపించలేదు. మేము బాధ్యతగా వ్యవహరిస్తాం. ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారం కొవ్వు కలిసిందని తెలిసింది. ఆ తర్వాతే నేను ట్వీట్ చేశాను. అందరూ నన్ను ట్యాగ్ చేసిన తర్వాతే మాట్లాడాను అంటూ కల్తీ నెయ్యిపై తాను ప్రకటన చేయడానికి దారితీసిన పరిణామాలను పవన్ వివరించారు.
నెయ్యి కావాలంటే పాల నుంచే కాదు, రసాయనాల నుంచి కూడా తీయొచ్చని గత పాలకులు రుజువు చేశారని పవన్ ఎద్దేవా చేశారు. ఈ విషయంలో గత ప్రభుత్వానికి నేతృత్వం వహించిన నాయకుడు తప్పు చేశాడని నేను ఎక్కడా చెప్పడం లేదని, కానీ, అప్పటి టీటీడీ పాలక మండలి బాధ్యత తీసుకోవాలని చెప్పకుండా వెనకేసుకు రావడం ఏంటని నిలదీశారు పవన్. మీరు నియమించిన పాలకమండలి చేసిన తప్పులకు దోషులను శిక్షించాల్సిందేనంటూ తేల్చిచెప్పారు. ‘‘నెయ్యి లేకుండా నెయ్యి చేశారు. పామాయిల్, రసాయనాలతో నెయ్యి తయారు చేశారు. వైసీపీ నిజంగా కల్తీ జరిగిందని ఒప్పేసుకుంటే అసెంబ్లీలో ఇంత చర్చ జరగాల్సిన అవసరం లేదు. రిపోర్టు వచ్చిన తర్వాత కల్తీ జరగలేదు, కొవ్వు లేదని అడ్డంగా మాట్లాడుతున్నారు’’ అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్క లీటరు పాలుకూడా వినియోగించకుండా నెయ్యి తయారుచేశారని సీబీఐ సిట్ తెలిపింది. తమకు నచ్చిన సంస్థలకు టెండర్ కట్టబెట్టేందుకు నిబంధనలు సవరించారు. నిబంధనలు తూట్ల పొడిచారు. కనీస అర్హత లేనివారికి కాంట్రాక్టులు ఇచ్చారని సిట్ నివేదికను ఉటంకిస్తూ పవన్ ఆరోపణలు చేశారు. 2019-24 మధ్య 11 కోట్ల మంది శ్రీవారిని దర్శించుకున్నారని, వారికి 48 కోట్ల లడ్డూప్రసాదాలు అందజేశారని తెలిపారు. ఇందులో 20 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో చేశారని ఆరోపించారు. అదేవిధంగా గత పాలకులు లక్ష లడ్డూలు అయోధ్యకు పంపారని, ఆ లడ్డూలు వేరే అంటూ ఇప్పుడు చెబుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు. అయోధ్యకు పంపిన లడ్డూలు వేరే నెయ్యితో తయారు చేశారని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. తాను ఎవరి పేర్లు చెప్పడం లేదని, సభలో వారి పేర్లు ప్రస్తావించకూడదనే చెప్పడం లేదని అన్నారు.
నెయ్యి కల్తీకి పాలక మండలి బోర్డు బాధ్యత తీసుకోవాలని పవన్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నడిపిన వ్యక్తి వెనకేసుకు వస్తే అందులో ఆయనకు పాత్ర ఉందని అనుమానించాల్సివస్తుందని అన్నారు. నెయ్యిని కల్తీ చేసిన రసాయనాల్లో ఏ ముంది అన్నది పెరుమాళ్లకే ఎరుక అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తమకు అందిన రిపోర్టుల్లో నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నాయని ఉందని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు పవన్. సీబీఐ చార్జిషీటు ప్రకారం ఆ నెయ్యి నెయ్యే కాదని తేలిందని, దీని నుంచి ప్రభుత్వం ఎలాంటి లబ్ది పొందాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి సమస్య హిందూ మతానికి కాకుండా వేరే మతానికి జరిగితే ప్రపంచం అంతా గగ్గోలుపెట్టేవారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా లడ్డూ కల్తీ జరిగిందని ఒప్పుకోవాలని, అలా కాకుండా ఢిల్లీకి వెళ్లి రచ్చ చేస్తామంటే మీ పాపం ఇంకా పెరిగిపోతుందని హెచ్చరించారు. మీ నాశనం వేగవంతం అవుతుందన్నారు.
తిరుమల ప్రసాదంలో కల్తీ వ్యవహారంపై ప్రతి హిందువు స్పందించాలని పవన్ పిలుపునిచ్చారు. హిందూ ధర్మంపై దాడి జరిగినప్పుడు ప్రతి ఒక్కరు ప్రాంతాలకు మతాలకు అతీతంగా ఖండించాలన్నారు. ఈ మహాపాపం వేరే మతానికి జరిగితే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. మండలిలో వెంకటేశ్వరస్వామి పటాలు తెచ్చిన వైసీపీ సభ్యులు వేరే మతాలకు చెందిన ఫోటోలు తెచ్చే సాహసం చేసేవారా? అని పవన్ సూటిగా ప్రశ్నించారు. హిందువులంటే కులాలతో ముక్కలైపోయారని.. వారు ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోరని భావించారన్నారు. హిందువులంటే అంత అలుసై పోయారా అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి హిందువు దీనికి బాధ్యత తీసుకోవాలన్నారు. ఇతర మతాల గురించి మాట్లాడితే ఓట్లు పోతాయని భయంతో ఎవరూ గట్టిగా మాట్లాడటం లేదన్నారు. హిందువులు పార్టీలకతీతంగా మారాలని పవన్ పిలుపునిచ్చారు.