పల్లె పండుగ-2.0కు పవన్ రెడీ.. ఎప్పటి నుంచంటే!
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పల్లెపండుగ కార్యక్రమం 2.0కు రెడీ అవుతున్నారు.;
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పల్లెపండుగ కార్యక్రమం 2.0కు రెడీ అవుతున్నారు. గత ఏడాది ఒకే సారి వెయ్యికి పైగా గ్రామాల్లో పల్లెపండుగ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇది అప్పట్లో గిన్నీస్ రికార్డు కూడా సృష్టించింది. పల్లెల్లో పారిశుద్ధ్యం నుంచి రహదారుల నిర్మాణం, విద్యుత్ కనెక్షన్లు, మరుగు దొడ్ల నిర్మాణం, పశువుల కొట్టాలు.. ఇలా అనేక రూపాల్లో పల్లెల్లో వెలుగులు నింపే కార్యక్రమానికి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. స్వయంగా ఆయన పంచాయతీ రాజ్ మంత్రిగా కూడా ఉన్న విషయం తెలిసిందే.
కేంద్రం నుంచి పంచాయతీలకు అందుతున్న ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామాలకే పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పల్లెపండుగ -2.0ను త్వరలోనే ప్రారంభించాలని నిర్ణయించారు. వచ్చే నెల చివరిలో దీనికి ముహూర్తం ఖరారు చేయనున్నారు., ఆయా కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ సహా జనసేన నాయకులు, కూటమి పార్టీల నేతలు కూడా పాల్గొంటారు. ఇప్పటికే జరిగిన పనులు, భవిష్యత్తులో చేయాల్సిన పనులపై తాజాగా పవన్ కల్యాణ్ సమీక్షించారు. పల్లె పండగ విజయం తాలూకు స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండగ 2.0 ప్రణాళికలు ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు.
రాష్ట్రంలో గ్రామీణ ముఖచిత్రం సంపూర్ణంగా మారేలా `పల్లెపండుగ -2.0` ప్రణాళికలు ఉండాలని పవన్ కల్యాణ్ తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో పల్లె పండగ 2.0పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి సమస్యలను మనదిగా భావించి స్పందిస్తే.. గ్రామీణుల మనసులో చోటు సంపాయించుకునేందుకు అవకాశం ఉంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు. వచ్చే ఏడాది స్థానిక సంస్థలకు ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో పల్లెపండుగ -2.0 ద్వారా గ్రామీణులకు మరింత చేరువ కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు.. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా భాగస్వామ్యం కావాలని సూచించారు.