పీఠికాపురానికి సంక్రాంతి శోభ ...పవన్ సందడి వెరీ స్పెషల్

పిఠాపురానికి చాలా మందుగానే పవన్ సంక్రాంతి పండుగను తీసుకుని వస్తున్నారు. ఇప్పటికే ఈ మహోత్సవాలకు సంబంధించి పిఠాపురం చేరుకుంటారు.;

Update: 2026-01-09 02:30 GMT

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మూడు రోజుల పాటు భారీ ఎత్తున సంక్రాంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దానికి పెట్టిన పేరు పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం అని. పిఠాపురం అని వ్యావహారికంగా అంటున్నా అసలు పేరు పీఠికాపురం. ఆధ్యాత్మికతతో కూడుకున్న పేరు అది. అందుకే ఆ పేరుతో జనసేనాని పిఠాపురం వేదికగా ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకూ మూడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు.




 


ముందస్తుగా పండుగ :

పిఠాపురానికి చాలా మందుగానే పవన్ సంక్రాంతి పండుగను తీసుకుని వస్తున్నారు. ఇప్పటికే ఈ మహోత్సవాలకు సంబంధించి పిఠాపురం చేరుకుంటారు. అక్కడ ఆయన ముందస్తు సంక్రాంతి సంబరాలను ఆర్ఆర్‌బీహెచ్‌ఆర్ కళాశాల మైదానంలో ప్రారంభిస్తారు. ఇదే సందర్భంలో ఆయన పిఠాపురం నియోజకవర్గ పరిధిలో 186 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. అదే విధంగా మరో 26 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన పలు పనుల ప్రారంభోత్సవాలని సైతం నిర్వహిస్తారు.

సమీక్షలు...సందర్శనలు :

ఇక పీఠికాపుర సంక్రాంతి మహోత్సవంలో పవన్ పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలని తిలకిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను కూడా ఆయన పరిశీలిస్తారు. అదే విధంగా పిఠాపురం మునిసిపాలిటీ పరిధిలో ఇటీవల ముంపునకు గురైన ఇందిరా నగర్ కాలనీ, రైల్వే స్టేషన్ సమీపంలోని మోహన్‌నగర్‌లను పవన్ సందర్శిస్తారు. ఈ నెల 10వ తేదీన గొల్లప్రోలు ప్రాంతంలోని ఇళ్ల స్థలాలను పరిశీలిస్తారు. ఆ మీదట ఆయన కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని జిల్లాలో శాంతి భద్రతలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాలకు చేరుకుని 10.11 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారు.

సంక్రాంతి శోభతో :

ఈసారి పిఠాపురంలో జరిగే సంక్రాంతి సంబరాలు గతానికి మించి అని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలీ అంటే పండుగ శోభ అంతా ఉట్టిపడేలా ఏర్పాట్లు అయితే భారీ ఎత్తున చేశారు. ఈ ఉత్సవాల మొదటి రోజు సంక్రాంతి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, జానపదగీతాలాపనలు, వీర నాట్యాలు, ఉరుముల నృత్యాలు, తప్పెట గుళ్లు, గరగు నృత్యాలు, లంబాడ నృత్యం, డప్పులు, గిరిజన సంప్రదాయ నృత్యరీతి థింసా, కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నాట్య ప్రదర్శనలు ఎన్నో ఏర్పాటు చేయడం విశేషం. అలాగే ప్రత్యేకంగా కోలాటాలు కూడా ఏర్పాటు చేశారు.

అదే విధంగా కేరళ సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ సైతం ఈ ఉత్సవాలలో ముఖ్యమైన ప్రదర్శనగా ఉంటాయి. చివరి రోజు అయిన ఈ నెల 11వ తేదీన గ్రామీణ జానపదుల పాటలు, సినీ మ్యూజికల్ నైట్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇక ఈ మూడు రోజులూ పవన్ పిఠాపురంలో అందరికీ అందుబాటులో ఉంటారు. ఆయన మకాం కూడా అక్కడే ఉంటుంది. మొత్తానికి ఈ సంక్రాంతితో పిఠాపురం కీర్తి ప్రఖ్యాతి నలు చెరగులా వ్యాపింపచేసేలా పవన్ ఘనమైన ఉత్సవాలకు శ్రీకారం చుడుతున్నారు అని చెప్పాలి.

Tags:    

Similar News