పవన్ లో ఈ యాంగిల్...ఎపుడూ మిస్ కాదు !

ఇక ఆలయ సంప్రదాయాలను అనుసరించి మొదట పుట్టలో పాలు పోసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మొక్కులు చెల్లించుకుని పడగలకు మొక్కారు.;

Update: 2025-10-30 21:30 GMT

పవర్ స్టార్ గా వెండి తెర మీద పవన్ మెరుస్తారు అక్కడ అభిమాన గణానికి ఆయనే డెమ్మీ గాడ్ గా ఉంటారు. పవన్ ని ఒక్కసారి చూడాలని ఆయన మాట వినాలని పలవరించే ఫ్యాన్స్ కోకొల్లలు. ఇక రాజకీయ తెర పైన ఆయన జనసేనానిగా పవర్ ఫుల్ లీడర్ గా కనిపిస్తారు ఉప ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు మోస్తూనే ఆయన జనాలతో వీలైనప్పుడల్లా మమేకం అవుతూంటారు. ఇలా ఆయన సినీ జీవితం ప్రజా జీవితం రెండింటినీ జాగ్రత్తగా బాలెన్స్ చేసుకుంటూ వెళ్తూంటారు.




 


ఆధ్యాత్మికత కోణం :

పవన్ కి ఆధ్యాత్మిక పాళ్ళు ఎక్కువ. ఆయన భక్తిగా ఉంటారు. ఆయన ఎపుడూ కూడా ఈ విషయంలో ముందుంటారు. తన పర్యటనలలో ఎక్కడైన ప్రముఖ దేవాలయాలు ఉంటే తప్పనిసరిగా ఆయన దర్శించుకుంటారు. తాజాగా అదే జరిగింది. పవన్ కళ్యాణ్ ఉమ్మడి క్రిష్ణా జిల్లా పర్యటనలో భాగంగా మోపిదేవి సుబ్బారాయుడి సేవలో తరించారు. ఆయన ఎంతో భక్తిప్రపత్తులతో పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. దేశం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రార్థించారు.




 


అందులో భాగంగా :

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మొంథా తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు పర్యటన పెట్టుకున్నారు. ఆయన అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల పరిశీలన చేశారు. రైతులతో నేరుగా మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకుంటుందని పవన్ భరోసా ఇచ్చారు. పొలంలోనే దిగి మరీ ఆయన పంట దెబ్బ తిన్న పరిస్థితులను స్వయంగా గమనించారు.

తిరుగు ప్రయాణంలోనే :

ఈ పర్యటన మొత్తం రైతుల సాధక బాధలు వినడంతోనే సాగింది. ఇక పవన్ తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే అదే సమయంలో ఆయనకు వచ్చిన ఒక ఆలోచన ఆయనలోని ఆధ్యాత్మిక కోణం ఒక ప్రసిద్ధ పుణ్య క్షేత్రం వైపుగా నడిపించింది. మోపిదేవిలో వెలసిన ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం శ్రీ వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని పవన్ దర్శించుకున్నారు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి మధ్యాహ్న సేవలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన పాల్గొన్నారు. ఇక తొలిసారి ఈ ఆలయానికి పవన్ కళ్యాణ్ రావడంతో వేద పండితులు ఆలయ మర్యాదలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కి ఆలయ ఆవరణలో ఉన్న నాగ పుట్టను కూడా ఆయన దర్శించుకున్నారు.

విశిష్టమైన ఆలయంగా :

ఇక ఆలయ సంప్రదాయాలను అనుసరించి మొదట పుట్టలో పాలు పోసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మొక్కులు చెల్లించుకుని పడగలకు మొక్కారు. అనంతరం ప్రదక్షిణగా వచ్చి అంతరాలయంలో వేయి పడగలతో లింగమూర్తిగా వెలసిన మూలవిరాట్టుకు పంచామృతాలతో అభిషేకాదులు నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని వేడుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉంటే పవన్ కి ఆలయ విశిష్టతను, చరిత్రను అర్చకులు వివరించారు. శ్రీ సుబ్రహ్మణ్వేశ్వర స్వామి వారు స్వయంభువుగా వెలసిన క్షేత్రంగా దానిని పేర్కొన్నారు. అంతే కాదు , ఆలయం వెలుపల పుట్టలో పోసిన పాలను లింగాకార మూర్తి కింద సర్పరూపంలో ఉన్న స్వామి వారు స్వీకరిస్తారని వారు పవన్ కి తెలిపారు.

ఆ భాగ్యం కలిగిందంటూ :

ఈ ఆలయంలో సంవత్సరానికి రెండు మూడు సార్లు స్వామి వారు వెలుపలికి వచ్చి భక్తులకు విశ్వరూప దర్శనమిస్తారని ఆలయ అర్చకులు వివరించారు. భక్తుల కోరికలు తీర్చే స్వామిగా పేరున్న మోపిదేవి క్షేత్రానికి వారాంతాలు, ప్రతి మంగళవారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారని ఎంతో దివ్య క్షేత్రమని వారు చెప్పారు. ఇక గతంలో నివార్ తుపాను సమయంలో రైతులను పరామర్శించేందుకు వచ్చినపుడు ఆలయం వెలుపలి నుంచి వెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. తమిళనాట ఉన్న ఆరు విఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాల దర్శనం తర్వాత మోపిదేవి సుబ్రహ్మణ్వేశ్వరస్వామిని దర్శించుకునే భాగ్యం కలిగిందని పవన్ ఎంతో సంతోషం వ్యక్తం చేయడం విశేషం.

Tags:    

Similar News