ఆ నవ్వు వెనుక అంత అర్థం ఉందా? జగన్ పేరు చెప్పగానే పవన్ చేసిన పని...
అంతే కాకుండా It's Fine. Let's see (ఏం పర్వాలేదు, చూద్దాం) అంటూ ముక్తసరిగా తేల్చేశారు. దీంతో పవన్ నవ్వుతున్న వీడియో వైరల్ అవుతోంది.;
ఏపీ మాజీ సీఎం జగన్ ను డిప్యూటీ సీఎం పవన్ చాలా తేలిగ్గా తీసుకుంటున్నారా? పవర్ లో లేని జగన్ చేస్తున్న ప్రకటనలు, ప్రత్యర్థులకు ఇస్తున్న వార్నింగుల్లో ఏ మాత్రం పస ఉండటం లేదని భావిస్తున్నారా? జగన్ విషయమై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ స్పందన చూస్తే ఇదే అర్థమవుతోందని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ తన ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలే పంపుతున్నారు. తాను అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు, కార్యకర్తలను వేధించిన వారికి సినిమా చూపిస్తానంటూ మాస్ వార్నింగులిస్తున్నారు. అయితే జగన్ హెచ్చరికలను కూటమి సర్కారు ఏ మాత్రం లెక్కచేయడం లేదని అధికార పార్టీ నేతల వ్యవహరశైలిని చూస్తే అర్థమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఒకసారి తాను అధికారంలోకి వస్తే, ప్రత్యర్థులు ఎవరినీ వదలనంటూ జగన్ చేస్తున్న హెచ్చరికలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన చూసిన వారు.. పవన్ దృష్టిలో జగన్ మరీ అంత చులకన అయిపోయారా? అని అంటున్నారు. అధికారంలో ఉండగా, విపక్షానికి సింహస్వప్నంగా వ్యవహరించిన జగన్.. విపక్షంలో రాగానే పూర్తిగా హ్యాండ్సప్ అయిపోయినట్లే కనిపిస్తున్నారని అంటున్నారు. దీంతో ఆయనను అధికార పార్టీ పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ హెచ్చరికలపై పవన్ స్పందన కోసం ప్రశ్నించిన మీడియాకు తన నవ్వుతోనే సమాధానం చెప్పారు డిప్యూటీ సీఎం. అయితే పవన్ నవ్వడం తప్పుకాదని, కానీ ఆయన వికటాట్టహాసం చేయడం చూస్తే తన ప్రత్యర్థిని వ్యంగ్యంగా చూస్తున్నట్లే భావించాల్సివస్తోందని అంటున్నారు.
చాలా మంది చాలా విషయాలపై తమ ప్రతిస్పందనను నవ్వు రూపంలో తెలియజేస్తారు. చిరునవ్వు ఇతరులతో అనుబంధం కోరుకునే సంకేతం కాగా, విరగబడి నవ్వడం తమ ఆనందాన్ని తెలియజేస్తుందని చెబుతారు. అదే నవ్వు వికటాట్టహాసమైతే ఎదుట వారిని అవమానించడమే అంటున్నారు. తాజాగా పవన్ తన రాజకీయ ప్రత్యర్థి జగన్ హెచ్చరికలపై మీడియా ప్రశ్నించేసరికి వికటాట్టహాసమే చేశారు. అంతే కాకుండా It's Fine. Let's see (ఏం పర్వాలేదు, చూద్దాం) అంటూ ముక్తసరిగా తేల్చేశారు. దీంతో పవన్ నవ్వుతున్న వీడియో వైరల్ అవుతోంది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం జగన్ మధ్య రాజకీయ వైరం ఇప్పటిది కాదు. గతంలో ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న కాలంలో పవన్ పై ఎన్నో విమర్శలు చేసేవారు. చంద్రబాబుకు దత్తపుత్రుడు అనడమే కాకుండా పవన్ వ్యక్తిగత జీవితాన్ని జగన్ టార్గెట్ చేశారు. అలా పవన్ ను తన ప్రధాన శత్రువుగా మార్చుకున్నారు. ఇక పవన్ కూడా జగన్ ను ఓడించడమే ఏకైక లక్ష్యంగా గత ఎన్నికల ముందు కృషి చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పడమే కాకుండా, ఉప్పు-నిప్పులా మెలిగిన టీడీపీ, బీజేపీలను ఒకతాటిపైకి తెచ్చారు. అలా ఏపీలో కూటమి ఏర్పాటు చేసి రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయానికి కారణమయ్యారు. ఇక ఇప్పుడు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా వైసీపీ నేతలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. పవన్ పంతంతోనే వైసీపీ సోషల్ మీడియాలో చాలా మంది అరెస్టు కావాల్సివచ్చిందని చెబుతారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వాన్ని కట్టడి చేసేందుకు తరచూ వార్నింగులిస్తున్నారు. అయితే ఆయన హెచ్చరికలను తాము ఏ మాత్రం ఖాతరు చేయడం లేదని చెప్పేందుకు పవన్ వికటాట్టహాసం చేయడం చర్చనీయాంశంగా మారింది.