పవర్ చూపించిన కుంకీలు...పవన్ ఖాతాలోనేనా ?
ఏపీ కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా అయిదు కీలక శాఖలను నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్.;
ఏపీ కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా అయిదు కీలక శాఖలను నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. అవి అన్నీ గ్రామాలు గిరిజన ప్రాంతాలతో ముడిపడి ఉన్నవే. ఈ అటవీ పర్యావరణం కూడా ఆయన శాఖలలో ఉన్నాయి. ఇదిలా ఉంటే అటవీ శాఖ మంత్రిగా పవన్ ఏపీలో కొన్ని జిల్లాలలో అడవి ఏనుగుల బెడదతో అల్లాడుతున్న రైతులను పంటలను ఆదుకునేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కుంకీ ఏనుగులను ఏపీకి తీసుకుని రావడం ద్వారానే వీటికి పరిష్కారం అని ఆయన ఆలోచించడమే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటకకు వెళ్ళి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఏపీలో ఆ జిల్లాల్లో తీవ్రం :
ఆంధ్రాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం జిల్లాలో అటవీ ఏనుగుల బెడద చాలా ఎక్కువ. అవి గుంపులు గుంపులుగా ఊళ్ళలోకి వచ్చేస్తాయి. అంతే కాదు చేతికి అంది వచ్చిన పంటను సర్వ నాశనం చేయడమే కాకుండా చాలా మంది రైతులను పొట్టన పెట్టుకున్నాయి. వీటి బారిన పడి ప్రాణాలు ఆస్తులు అన్నీ సర్వ నాశనం అయ్యాయి. ఇది ఈ రోజూ నిన్నా సమస్య కానే కాదు. దశాబ్దాలుగా ఉంది. అయితే ఉప ముఖ్యమంత్రిగా అటవీ శాఖను చూస్తున్న పవన్ మాత్రం దీనిని శాశ్వత పరిష్కారమే కనుగొన్నారు.
ఏకంగా ఎనిమిది కుంకీ ఏనుగులు :
కర్ణాటక ప్రభుత్వం నుంచి ఎనిమిది కుంకీ ఏనుగులను ఏపీకి తీసుకుని రావాలని ఒప్పందం చేసుకున్నారు. అందులో మొదటి విడతగా నాలుగు ఏనుగులు ఆ మధ్యనే వచ్చాయి. ఇపుడు అవి వాటి ప్రతాపాన్ని తొలిసారి చూపించాయి. ఆ దెబ్బకు అటవీ ఏనుగులు పరార్ అయ్యాయి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలి వద్ద మామిడి తోటలను ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపుని కుంకీలు విజయవంతంగా దారి మళ్లించి అడవిలోకి తరిమికొట్టాయి. కృష్ణ, జయంత్, వినాయక అనే కుంకీలు ఆ ఆపరేషన్ లో పాల్గొని అడవి ఏనుగులను పంటల వైపు రాకుండా అడ్డుకుని తిరిగి అడవిలోకి మళ్లించాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగిన ఈ ఆపరేషన్ లో కర్ణాటక నుంచి తీసుకువచ్చిన కృష్ణ అనే కుంకీ ఏనుగు చాలా చురుకుగా పాల్గొన్నట్టుగా అటవీ అధికారులు చెబుతున్నారు.
రెండు నెలల సుదీర్ఘ శిక్షణ :
ఇదిలా ఉంటే కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తీసుకువచ్చిన అనంతరం రెండు నెలల శిక్షణ తర్వాత మొదటి ఆపరేషన్ విజయవంతంగా చేపట్టడం ఆనందాన్నిచ్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హార్షం వ్యక్తం చేశారు. ఏనుగుల సంచారంతో ఇబ్బందులు పడుతున్న సరిహద్దు ప్రాంతాల రైతులు, ప్రజలకు ఈ ఆపరేషన్ భరోసా ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏనుగుల గుంపు నుంచి పంటలను, ప్రజల ప్రాణాలు కాపాడే దిశగా ప్రణాళికా బద్ధంగా పని చేస్తుంది అనడానికి కుంకీలతో చేపట్టిన ఆపరేషన్ తొలి అడుగు అని వ్యాఖ్యానించారు.
తదుపరి ఆపరేషన్ పుంగనూరు :
అంతే కాదు ఈ ఆపరేషన్ లో పాల్గొన్న అటవీ అధికారులకు, మావటిలు, కావడిలకు ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అలాగే అడిగిన వెంటనే కుంకీ ఏనుగులు రాష్ట్రానికి ఇచ్చి సహకరించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకి, ఆ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేకి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వివరించారు. తదుపరి ఆపరేషన్ పుంగనూరు అటవీ ప్రాంతంలో చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సందర్బంగా వెల్లడించారు. మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ ఆలోచనలతో ఏపీలో రైతులకు ఏనుగుల బెడద తప్పింది అని చెప్పాల్సిందే.