హిందువులు మేల్కొనాలి......పవన్ సంచలన ట్వీట్

పవన్ కళ్యాణ్ మీద ఇప్పటికే కామ్రేడ్స్ సనాతన ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని కన్నెర్ర చేస్తూ ఉంటారు.;

Update: 2025-12-06 03:44 GMT

పవన్ కళ్యాణ్ మీద ఇప్పటికే కామ్రేడ్స్ సనాతన ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని కన్నెర్ర చేస్తూ ఉంటారు. అయితే పవన్ తన మనసులో భావాలను బయటపెట్టడానికి కానీ వాటిని జనంలో చర్చకు పెట్టడానికి కానీ ఎపుడూ వెనక్కి తగ్గలేదు అని అనేక సందర్భాలలో రుజువు అవుతూనే ఉంది. ఆయన గత ఏడాది తొలిసారిగా తిరుపతిలో జరిగిన సభలో సనాతన ధర్మ పరిరక్షణ గురించి డిక్లరేషన్ చేశారు. దేశంలో సనాతన ధర్మం కాపాడాలీ అంటే ధర్మ పరిర్కషణ బోర్డు ఉండాలని ఆయన గట్టిగా అభిప్రాయపడ్డారు. ఈ మధ్యన కూడా ఆయన ఆ మాట చెప్పారు. ఇపుడు తాజాగా మరోసారి అదే డిమాండ్ చేశారు.

ఆలయాల నిర్వహణ కోసం :

దేశంలోని అన్ని ఆలయాల నిర్వహణ కోసం అక్కడ సనాతన ధర్మం కచ్చితంగా పరిడవిల్లేలా చేయడం కోసం సనాతన ధర్మ రక్షా బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ ఒక ట్వీట్ ద్వారా తాజాగా డిమాండ్ చేశారు. దేశంలో హిందువులను చాలా తక్కువగా చులకనగా చూస్తున్నారు అని పవన్ ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. తిరుప్పరన్‌కుండ్రంలో కార్తీక దీపం వెలిగించడంలో అడ్డంకులు పెడుతున్నారని ఆయన అన్నారు ఈ విషయంలో కోర్టులో గెలిచినా ఆచారాన్ని కోల్పోయామని పవన్ తన బాధను వ్యక్తం చేశారు. ఈ దేశంలో హిందువులు బలంగా నిలబడాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే వారంతా తమ ప్రాంతం, తమదైన కులం అంటూ వేరుపడి విడిపోతే హిందూ ధర్మానికి అది తీవ్రంగా నష్టం చేకూరుస్తుందని పవన్ స్పష్టం చేశారు.

న్యాయ పోరాటాలతోనే :

భారత్ లో అత్యధిక సంఖ్యలో ఉన్న హిందువులు తమ దేశంలో తమ మత విశ్వాసాలను పాటించేందుకు న్యాయ పరమైన పోరాటాలు చేయాల్సి వస్తోంది అని ఆయన అన్నారు. తాజాగా తమిళనాడులోని తిరుప్పరన్‌కుండ్రం అంశాన్ని ఆయన లేవనెత్తారు. అక్కడి కొండ మీద కార్తీక దీపం వెలిగించే విషయంలో కోర్టు అనుమతి ఇచ్చిందని అయినా అధికారులు అడ్డుకోవడమేంటని ఆయన ఆవేదన చెందారు. ఈ రకమైన పరిస్థితులు ఎదురుకాకూడదనే ఆలయాల వ్యవహారాలను భక్తులే పర్యవేక్షించేలా చట్టం ఉండాలని అన్నారు. అందుకోసమే దేశంలో సనాతన ధర్మ రక్షా బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మరోసారి పవన్ గట్టిగా డిమాండ్ చేశారు.

అన్యాయాల మీద మాట్లాడాలని :

ఇక ఈ దేశంలో హిందువులు తమకు జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడాలని, వారు ముందు మేలుకోవాలని పవన్ కోరారు. ఎక్కడైనా ఏ మతం వారు అయినా తమ ఆచారాలు సక్రమంగా చేసుకోవాల్సి ఉందని అన్నారు. కానీ హిందువుల విషయంలోనే అన్యాయం జరుగుతోంది అని ఆయన అన్నారు. ఇక కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ అదే విధంగా కామాఖ్య నుంచి ద్వారక వరకూ ఉన్న ప్రతి హిందువు తమ దేశంలఒ తాము హిందువులు ఎదుర్కొంటున్న అవమానాలపై మేల్కొనే రోజు రావాలని పవన్ ఆశించారు. అలాంటి రోజు తప్పకుండా వస్తుందని తాను ఆశిస్తున్నానని అని పవన్ తన ట్వీట్ ని ముగించడం విశేషం.

Tags:    

Similar News