తెలంగాణాపై పవన్ మరో ఆసక్తికరమైన ట్వీట్ !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో తెలంగాణా రాజకీయాల గురించి ఎక్కువగా పస్తావిస్తున్నారు.

Update: 2026-06-04 15:33 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో తెలంగాణా రాజకీయాల గురించి ఎక్కువగా పస్తావిస్తున్నారు. తెలంగాణా రాష్ట్ర అవతరణ రోజే ఆయన తన ఇంట్లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించి సంచలనం క్రియేట్ చేశారు. దాదాపుగా గంట పాటు సాగిన ఆ ప్రెస్ మీట్ లో పవన్ చాలా అంశాలనే ముందు పెట్టారు. ఒక్కోసారి ఆవేశంగా మరోసారి అర్ధవంతంగా ఇంకో సారి తార్కికంగా ఒక్కోసారి నిగ్గదీస్తూ నిలదీస్తూ పవన్ ప్రెస్ మీటి ఆద్యంతం సాగింది. అంతే కాదు ఎన్నో కొత్త ఆలోచనలను కూదా జనాలలో రేకెత్తించింది. అది జరిగిన తరువాత కూడా పవన్ ట్వీట్లు వేస్తూ తెలంగాణా గురించి తన పాత వీడియోలలో అన్న మాటలను రివీల్ చేస్తూ వస్తున్నారు. తనకు తెలంగాణా మీద ఉన్న నిబద్ధతను ఆయన చాటుకునే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నారు.

తానెన్నడూ సమర్థించలేదు :

ఇదిలా ఉంటే తెలంగాణా రాజకీయాల మీద తాజాగా పవన్ చేసిన ట్వీట్ అయితే ఆసక్తికరంగా ఉంది. తాను ఎప్పుడూ తెలంగాణాను అస్థిర పరిచే రాజకీయాలను సమర్థించలేదని పవన్ స్పష్టం చేశారు. తెలంగాణా ప్రయోజనాలపై తన వైఖరి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుందని ఆయన చెప్పడం విశేషం. ఏపీ విభజన అనంతరం శాంతిభద్రతల ఆందోళనలు వ్యక్తమయ్యాయని ఆ సమయంలో సెక్షన్ 8 అమలు తెలంగాణా ప్రజల ఆత్మగౌరవాన్ని స్వయం పరిపాలన హక్కును దెబ్బతీస్తుందని నేను దానిని వ్యతిరేకించానని గతాన్ని పవన్ గుర్తు చేశారు. తెలంగాణాని అస్థిర పరిచే రాజకీయాలను ఎన్నడూ సమర్థించలేదని మరోసారి చెప్పారు. పరస్పర గౌరవం, సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను కాపాడటమే తన ఉద్దేశం అని ఒక వీడియోను పోస్ట్ చేస్తూ పవన్ ట్వీట్ చేశారు.

అంతకు ముందు కూడా :

ఇదిలా ఉంటే పవన్ ఒక రోజు క్రితం కూడా తెలంగాణా గురించి మాట్లాడుతూ అక్కడి వారు అంతా జై తెలంగాణా అంటే తనకు ఎంతో ముచ్చట వేస్తుందని అన్నారు. అంతే కాదు తాను తెలంగాణా ప్రజల సమస్యల సాకారం కోసం పనిచేస్తున్నాను అని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణా ఎవరి అయ్య జాగీరు అన్న మాటలకు ఆయన సానుకూల దృక్పథంతో ఒక అర్ధం చెబుతూ అదే తన ఉద్దేశ్యం అని అన్నారు. తెలంగాణా భూమి పుత్రులది అని పవన్ ఉద్ఘాటించారు. జనసేన పార్టీ తరఫున కూడా పోటీ చేసేది తెలంగాణా బిడ్డలే అని ఆయన స్పష్టం చేశారు. వారిని ప్రోత్సహించడం కోసమే జనసేన అక్కడ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది అని కూడా చెప్పారు. మొత్తానికి చూస్తే పవన్ తెలంగాణా గురించి తన మనసులో ఉన్న భావాలను విడమరచి చెబుతున్నారు రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. తన మద్దతు తెలంగాణా అభ్యున్నతికి ఎపుడూ ఉంటుందని కూడా చెప్పుకొస్తున్నారు.



Tags:    

Similar News