'పవన్ 2 లక్షల పుస్తకాలు'.. నాగబాబు సవాల్!

అవును.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగబాబు.. పవన్ 2 లక్షల పుస్తకాల అంశంపై మాట్లాడారు.;

Update: 2025-06-26 05:24 GMT

ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా ట్రోలింగ్స్ ఒక భాగంగా మారిపోయిన సంగతి తెలిసిందే! నాయకుడు మాట మార్చినా, మాట తప్పినా, నిన్న ఒక మాట నేడు ఒక మాట మాట్లాడినా.. ట్రోలర్స్ వాయించేస్తున్నారు. ఈ విషయంలో కొంతమంది వ్యక్తిగత విషయాలపైనా ట్రోల్స్ చేస్తూ, పోలీసులకు దొరికి ఊచలు లెక్కేస్తున్నారు.

ఆ సంగతి అలా ఉంటే.. ఏపీ రాజకీయాల్లో పవన్ గురించి సోషల్ మీడియాలో వెటకారం ఆడడానికి ఉపయోగించే విషయాల్లో ఆయన పుస్తక పఠనానికి సంబంధించిన అంశం ఒకటనే సంగతి తెలిసిందే. తాను 2 లక్షల పుస్తకాలు చదివినట్లు పవన్ చెప్పారంటూ.. విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. ఇక గత ప్రభుత్వ హయాంలో అయితే వీటికి లెక్కేలేదు.

పవన్ పొరపాటున ఏదైనా తప్పు మాట్లాడినా, ఘణాంకాలు కాస్త అస్పష్టంగా చెప్పినా.. "2 లక్షల పుస్తకాల ప్రభావం" అంటూ వెటకారం ఆడేవారు. ఈ విషయంలో మీమర్స్ ని మించి వైసీపీ నేతలు పవన్ ని ఎద్దేవా చేసేవారు. ఈ విషయంపై తాజాగా నాగబాబు స్పందించారు. ఈ విషయంపై పవన్ మీద వెటకారాలు ఆడుతున్నవారికి ఛాలెంజ్ విసిరారు.

అవును.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగబాబు.. పవన్ 2 లక్షల పుస్తకాల అంశంపై మాట్లాడారు. ఇందులో భాగంగా... 2 లక్షల పుస్తకాలు చదివినట్లు పవన్ ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదని.. అలా చెప్పినట్లు ఏదైనా ఉంటే ఆ వీడియో పెట్టాలని నాగబాబు సవాలు విసిరారు. అసలు.. "పవన్ కల్యాణ్ - 2 లక్షల పుస్తకాలు” అనే ప్రస్థావన ఎలా వచ్చిందో వివరించారు.

ఇందులో భాగంగా... గతంలో తమ తండ్రి వెంకట్రావు ఒక ఇంటర్వ్యూలో పవన్ పుస్తక పఠనం గురించి మాట్లాడుతూ.. 'పవన్ దగ్గర రూ.2 లక్షల విలువైన పుస్తకాలు ఉన్నాయని.. ఎప్పట్నుంచో లైబ్రరీ మెయింటైన్ చేస్తున్నాడని.. చాలా శ్రద్ధగా పుస్తకాలు చదువుతాడని' పేర్కొన్నారని వివరించారు.

అయితే... ఇంటర్వ్యూ తీసుకున్న జర్నలిస్టు మాత్రం పవన్ 2 లక్షల పుస్తకాలు చదివినిట్లు రాశాడని నాగబాబు తెలిపారు. అసలు తాను ఎన్ని పుస్తకాలు చదివానన్నది పవన్ ఏ ఇంటర్వ్యూలోను చెప్పలేదని అన్నారు. దీనిపై ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాలని నాగబాబు సవాల్ విసిరారు. అసలు ఎవరైనా అన్ని పుస్తకాలు చదువుతారా అని ప్రశ్నించారు నాగబాబు.

దీంతో... పవన్ కల్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివారనే విషయంపై అందరికీ క్లారిటీ వచ్చినట్లేనా.. లేక, నాగబాబు వివరణను పక్కనపెట్టి మీమర్స్, ట్రోలర్స్ ఇంకా పాతపాటే పాడతారా అనేది వేచి చూడాలి!

Tags:    

Similar News