స్పీకర్ ఫిరాయించలేదన్నారు..మహిపాల్ రెడ్డి తప్పు చేశానంటున్నారు
తెలంగాణలోని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారినట్లు ఆయన పరోక్షంగా ఒప్పుకొన్నారు;
తెలంగాణలోని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారినట్లు ఆయన పరోక్షంగా ఒప్పుకొన్నారు. అయితే, తాను తప్పు చేశానని మధనపడుతున్నారు. పరిస్థితుల కారణంగా నాడు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇదంతా పటాన్ చెరులో కార్యకర్తల సమావేశంలో జరిగింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సన్నాహకంగా జరిగిన ఈ సమావేశంలో మహిపాల్ రెడ్డి కార్యకర్తల వద్ద ఓపెన్ అయ్యారు. కాంగ్రెస్ లో చేరినందున నియోజకవర్గానికి, ప్రజలకు, నాకు వెంట్రుక మందం కూడా లాభం జరగలేదని వాపోయారు. కాగా, బీఆర్ఎస్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన... కాంగ్రెస్ లో చేరిన విషయం పక్కనపెట్టినట్లే కనిపిస్తోంది. తాజా సమావేశంలో.. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పటాన్ చెరు నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీలు ఉన్నాయని ఇందులో 104 మంది కౌన్సిలర్లను గెలిపించేందుకు అందరం పాటుపడదాం అని మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఇప్పుడేం చేయాలి..?
తెలంగాణలో బీఆర్ఎస్ తరఫున గెలిచి అధికార కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేల్లో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఒకరు. 2014, 2018, 2023లో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. కాగా, 2024లో కాంగ్రెస్ వైపు మొగ్గారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు... ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై అటునుంచి ఎలాంటి నిర్ణయమూ లేకపోవడంతో సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. గత శుక్రవారం దీనిపై విచారణ జరిగింది. నాలుగు వారాల్లోగా తేల్చాలని తెలంగాణ స్పీకర్ కు సుప్రీం కోర్టు సూచించింది.
స్పీకర్ అలా తీర్పునిస్తే..
ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో గతంలో విచారణ జరిపిన తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. మొదట ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. వీరిలో గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఒకరు కావడం గమనార్హం. కొద్ది రోజుల కిందట జరిపిన విచారణలో పోచారం శ్రీనివాసరెడ్డి (కామారెడ్డి), కాలే యాదయ్య (చేవెళ్ల)ల విషయంలోనూ పార్టీ మారలేదనే తీర్పు చెప్పారు. కానీ, ఇప్పుడు మహిపాల్ రెడ్డి తాను పార్టీ మారినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఇది మీడియా సమావేశంలో చెప్పలేదు. కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించారు. మరిప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.