ఫార్మాసిటీలో బ్లాస్ట్.. వైజాగ్ పరవాడకే ఇలా ఎందుకు అవుతోంది?
తాజాగా అనకాపల్లి జిల్లా పరవాడ ఇండస్ట్రియల్ పార్క్‌లోని 'దక్షిణ్ ఎనర్జీ' యూనిట్‌లో మంగళవారం (23 జూన్ 2026) తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది.
విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లా పరవాడ ఇండస్ట్రియల్ పార్క్‌లోని 'దక్షిణ్ ఎనర్జీ' యూనిట్‌లో మంగళవారం (23 జూన్ 2026) తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ప్లాస్టిక్ వ్యర్థాల నుండి పైరాలసిస్ ఆయిల్ తయారు చేసే ఈ పరిశ్రమలో బాయిలర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘోర ప్రమాదంలో నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తున్న బి. త్రినాథ్ (24), వి. వెంకటేష్ (34) అనే ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ప్రమాద తీవ్రతకు యావత్ పారిశ్రామిక ప్రాంతం ఉలిక్కిపడింది. ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
అయితే ఈ ఘటన విషయంలో కొన్ని మీడియాల అతి ఇప్పుడు ప్రధానంగా చర్చకు వచ్చింది. ఒక ప్రముఖ మీడియా కుప్పలు తెప్పలుగా శవాలు! అనే హెడ్డింగ్ తో ప్రజల్ని తప్పుదోవ పట్టించి భయభ్రాంతులకు గురి చేస్తే, మరికొన్ని మీడియా చానెళ్లు.. ముక్కలైన శవాలు.. అంటూ దారుణమైన హెడ్డింగ్స్ తో కల్లోలం సృష్టించడం, జరిగిన ఘటనను మించి ఆవేదనను మిగులుస్తోంది.
పరవాడ ఫార్మాసిటీ.. దాని పరిసర ప్రాంతాల్లో ఇలాంటి విపత్తులు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత చరిత్రను పరిశీలిస్తే.. 2024లోనూ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగి విశాఖ సాల్వెంట్స్ యూనిట్‌లో మంటలు చెలరేగడంతో ఒకరు మరణించారు. అలాగే జూన్ 2020లో సైనోర్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో గ్యాస్ లీక్ ఘటన, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దురంతం వంటివి ఇక్కడి పారిశ్రామిక భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. పదే పదే ఇక్కడే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనే దానిపై స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల లోపం, కాంట్రాక్ట్ కార్మికుల దుస్థితిపై ప్రజల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మేనేజ్‌మెంట్లు కేవలం లాభాలకే ప్రాధాన్యతనిస్తూ... కార్మికుల ప్రాణాల రక్షణను గాలికొదిలేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లకు సరైన భద్రతా పరికరాలు, శిక్షణ ఉండటం లేదని క్షేత్రస్థాయి పరిశీలనలు చెబుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే యాజమాన్యాలు నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయని, ఈ నిర్లక్ష్యానికి పేద కార్మికులు ప్రాణాలు బలికావాల్సి వస్తోందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈ దురంతంపై బురదజల్లే రాజకీయాలు, సోషల్ మీడియా వేదికగా విమర్శల పర్వం ఊపందుకుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కొందరు వైఫల్యాలను ఎత్తిచూపుతుండగా.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని... నాటి ఎల్జీ పాలిమర్స్ బాధితులకు జగన్ ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ప్రకటించిన విషయాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా కార్మికుల తలరాతలు మారడం లేదని, పాలకులు- ఉన్నతాధికారులు రాజకీయాలు పక్కనబెట్టి పారిశ్రామిక భద్రతపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇలాంటి విషాద సమయాల్లో కొన్ని మీడియా సంస్థల అతి ప్రదర్శన, క్లిక్‌బైట్ సంస్కృతి ప్రజల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. వ్యూస్- టీఆర్‌పీల కోసం 'శవాల కుప్పలు' అంటూ థంబ్ నెయిల్స్ పెట్టి భయానక శీర్షికలతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా, పరిశ్రమలపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఒత్తిడి తేవాల్సిన మీడియా.. సంచలనం కోసం ప్రాకులాడటం సరికాదని సమాజం హితవు పలుకుతోంది. ఇప్పటికైనా ఫ్యాక్టరీల శాఖ సమగ్ర విచారణ జరిపి..., బాధితులకు భారీ మొత్తంలో పరిహారం అందించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠినమైన సేఫ్టీ ఆడిట్స్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు.