ప‌వ‌న్ శాఖ‌లో అవినీతి పురుగులు..?

డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖలో అవినీతి తిమింగలాలు తిరుగుతున్నాయి.;

Update: 2025-10-17 17:30 GMT

డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖలో అవినీతి తిమింగలాలు తిరుగుతున్నాయా?. వాస్తవానికి పంచాయతీరాజ్ శాఖ అంటేనే అవినీతికి మారుపేరు అనే విషయం అందరికీ తెలిసిందే. బైనమాల నుంచి రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాల వరకు అదేవిధంగా గ్రామపంచాయతీలో పన్ను విధించడం దగ్గర నుంచి పన్నుల వసూల్ వరకు కూడా అనేక రూపాల్లో అవినీతి తాండవిస్తోంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో ప్రస్తావించారు.

వైసీపీ హయంలో భారీ ఎత్తున పంచాయతీరాజ్ శాఖలో అవినీతి జరిగిందని దీనిని ప్రక్షాళన చేస్తానని కూడా ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఒక దశలో అయితే అసలు అందుకే నేను ఈ శాఖను తీసుకున్నాను అని కూడా ఆయన చెప్పుకు రావడం విశేషం. అయితే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చేపట్టి 16 నెలలు అయినప్పటికీ శాఖలో మాత్రం ఎక్కడా మార్పు రాలేదు. ఎక్కడికక్కడ అవినీతి తాండవిస్తోంది. అవినీతి వలయంలో అధికారులు స్వేచ్ఛగా జీవిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు నాలుగు నుంచి ఐదు కేసులు నమోదు అవుతున్న పరిస్థితి ఉందంటే ఎంత దారుణంగా ఉందనేది అర్థమవుతుంది. ఏ చిన్న అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా, పట్టాదారుపాస్ పుస్తకాల్లో మార్పులు చేయాలని కోరినా, డిజిటల్ పత్రాలు ఇవ్వాలని రైతులు వేడుకున్నా వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా వినిపిస్తోంది. దీనిని ప్రజలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ప్రభుత్వం మాట ఎలా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ పై ఉన్న నమ్మకంతో వారు అవినీతి విషయంలో ఆయన చర్యలు తీసుకుంటారని కూడా భావించారు.

నిజానికి అవినీతి విషయంలో పవన్ కళ్యాణ్ కు నేరుగా ఎలాంటి సంబంధాలు లేవన్నది వాస్తవం. ఆయన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ, ప్రక్షాళన చేయాల్సిన చోట ఎందుకని నిర్లిప్తత‌ ప్రదర్శిస్తున్నారని ప్రధాన ప్రశ్న. ఉన్నత స్థాయిలో అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండడం వీటిని సమీక్షించి సరిదిద్దాల్సిన పవన్ కళ్యాణ్ కూడా చోద్యం చూస్తున్నారా అనే ప్రశ్నలు వ‌స్తున్నాయి. లేదా ఆయన వరకు ఇవి చేరడం లేదా అనేది కూడా ఆశ్చర్యకరంగా ఉంది.

తాజాగా అమలాపురంలో వెలుగు చూసిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఒక సాధారణ రైతుకు చిన్న పని చేసి పెట్టడానికి 50 వేల రూపాయలు లంచం తీసుకోవడం ఒక ఎత్తు అయితే అదే కార్యాలయంలో ఆరు లక్షల రూపాయలు సొమ్ము లభించడం మరో వివాదంగా ఉంది. సో దీనిని బట్టి పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేయాలి.

Tags:    

Similar News