వైసీపీకి మాటల్లేకుండా చేసిన టీడీపీ

ఉత్తరాంధ్రాలో శ్రీకాకుళం జిల్లా టీడీపీకి ఒక విధంగా చెప్పాలీ అంటే కంచుకోట. ఇక్కడ నుంచి అనేక ఎన్నికల్లో టీడీపీ అత్యధిక సీట్లు గెలుచుకుంటూ వచ్చింది.;

Update: 2025-10-02 04:30 GMT

ఉత్తరాంధ్రాలో శ్రీకాకుళం జిల్లా టీడీపీకి ఒక విధంగా చెప్పాలీ అంటే కంచుకోట. ఇక్కడ నుంచి అనేక ఎన్నికల్లో టీడీపీ అత్యధిక సీట్లు గెలుచుకుంటూ వచ్చింది. ఒక్క 2019లో తప్ప. ఆనాడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ సీట్లకు గానూ కేవలం రెండు మాత్రమే గెలిచింది. అయితే దానికి బదులు అన్నట్లుగా 2024లో మొత్తానికి మొత్తం అసెంబ్లీ సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చేసి పారేసింది. అయితే ఇంత పెద్ద విజయం కట్టబెట్టినా గతంలో కూడా టీడీపీని గెలిపించినా అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లాలు టీడీపీ చేసింది ఏమిటి అని వైసీపీ నేతలు తరచూ ప్రశ్నిస్తూ ఉంటారు. 2014 నుంచి చూసుకుంటే విభజన హామీలలో కూడా ఏవీ శ్రీకాకుళానికి అమలు కాలేదని ఏ ఒక్క ప్రాజెక్టూ కూడా దక్కలేదని అంటూ ఘాటుగానే కామెంట్స్ చేసేవారు.

ధర్మాన నోట అదే మాట :

ఇక చూస్తే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే టీడీపీ మీద ఇదే తీరున విమర్శించేవారు. ఒక్కటైనా కేంద్రీయ విశ్వవిద్యాలయం మా జిల్లాకు ఇచ్చారా అని ఆయన సూటిగా నిలదీశేవారు. అయితే ఇపుడు ఆయనకు కానీ ఏ ఇతర వైసీపీ నేతలకు కానీ ఏ మాత్రం చాన్స్ ఇచ్చే సీన్ లేకుండా కూటమి ప్రభుత్వం ఆ లోటు తీర్చేసింది. జిల్లాకు చిరకాలంగా రాని ఒక మంచి ప్రాజెక్టుని తీసుకుని వచ్చి ఖుషీ చేసింది.

పలాసకు కేంద్రీయ విద్యాలయం :

శ్రీకాకుళంలో బాగా వెనకబడిన ప్రాంతం అయిన పలాసాలు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేస్తూ కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో జిల్లాకు తొలిసారి ఒక కేంద్రీయ విద్యాలయం వచ్చినట్లు అయింది. మొత్తం ఆంధ్రప్రదేస్ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే నాలుగు కేంద్రీయ విద్యాల‌యాలని కేంద్రం మంజూరు చేసింది. ఇవన్నీ తొందరలో ఏర్పాటు కానున్నాయి. ఈ నేపధ్యంలో ఉత్తరాంధ్ర కు ప్రాధాన్యత ఇచ్చారు. అందులో కూడా శ్రీకాకుళంజిల్లా పలాస ప్రాంతానికి కేంద్రీయ విద్యాలయం దక్కడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. రానున్న రోజులలో ఈ కేంద్రీయ విద్యాయలం కోసం పెద్ద ఎత్తున నిధులు కూడా మంజూరు కానున్నాయి. దాంతో ఈ జిల్లా అభివృద్ధి చెందడం ఖాయమని కూటమి నేతలు అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రాంతీయుల సుదీర్ఘమైన కల‌ల‌కు ఈ విధంగా నెరవేరే అవకాశం వచ్చింది అనీ అంటున్నారు. మరి ఇంతటి గొప్ప ప్రయత్నం చేసి అందులో విజయం సాధించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అభినందనలు తెలియచేస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఆయన చెప్పుకునే విధంగా మంచి పని జరిగింది అని అంటున్నారు.

Tags:    

Similar News