పాలమూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అతడేనా?

ఫైర్ బ్రాండ్ గా.. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా తర్వాతి కాలంలో ఎమ్మెల్యేగా వ్యవహరించిన వంశీచంద్ రెడ్డి పేరును తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ ప్రస్తావించారు.

Update: 2024-02-22 04:53 GMT

తాను ప్రాతినిధ్యం వహించే కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రూ.4వేల కోట్లతో డెవలప్ మెంట్ పనులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అనంతరం సభను ఏర్పాటు చేశారు. ఇదంతా ఒక ఎత్తుఅయితే సదరు సభలో మాట్లాడిన మాటల సందర్భంలో ఆయన నోటి నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిపై క్లారిటీ వచ్చేసినట్లుగా చెప్పాలి. దీంతో ఎంపీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ రేసు గుర్రాల్లో మొదటి రేసు గుర్రాన్ని సీఎం రేవంత్ డిసైడ్ చేసినట్లుగా చెప్పాలి.

ఫైర్ బ్రాండ్ గా.. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా తర్వాతి కాలంలో ఎమ్మెల్యేగా వ్యవహరించిన వంశీచంద్ రెడ్డి పేరును తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ ప్రస్తావించారు. మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే విషయాన్ని సీఎం రేవంత్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.తాజా సభలో చివర్లో ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న వంశీచంద్ రెడ్డికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ప్రజలు వంశీచంద్ రెడ్డిని ఆశీర్వదించాలని..తన నియోజకవర్గంలో 50 వేల అధిక్యత వచ్చేలా చేయాలని వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది.

Read more!

ముఖ్యమంత్రి రేవంత్ నోటి నుంచి వచ్చిన మాటల్ని చూస్తే.. పాలమూరు ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో రేవంత్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తూ కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పటికే పచ్చజెండా ఊపేసిన నేపథ్యంలో.. అందుకు తగ్గట్లే తమపార్టీ తొలి అభ్యర్థిని రేవంత్ ప్రకటించారని చెప్పాలి. ఇక.. వంశీచంద్ రెడ్డి విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 78 ఓట్ల స్వల్ప అధిక్యంతో తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.

విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీ యూత్ నేతగా ఆయన సుపరిచితుడు. 2005-06లో ఎన్ ఎస్ యూఐ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. 2006-10 వరకు ఎన్ ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా.. 2012-14లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2018లో పార్టీలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఏఐసీసీ కార్యదర్శిగా ఎంపికయ్యారు.

అయితే.. 2018లో జరిగిన ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి ఓడారు. ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శి హోదాలో ఉన్న ఆయన్ను మరోసారి ఎన్నికల బరిలో దింపుతున్నారని చెప్పాలి. 2023 ఆగస్టులో ఆయన్ను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు. మరి.. ఈసారి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News